AP High Court: అమరావతిలో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ఇళ్లు నిర్మించాల్సిన బాధ్యత తమపై ఉందని వాదిస్తున్న ఆంధ్రప్రదేశ్ సర్కారు.. ఇతర పనుల విషయంలో చట్టబద్ధమైన బాధ్యతను ఎందుకు నిర్వర్తించడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు న్యాయవాదులకు కనీస మౌలిక సదుపాయాలు లేవని పేర్కొంది. వాటి గురించి రాష్ట్ర సర్కారు ఎందుకకు పట్టించుకోవడం లేదని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన పేద వారికైనా అమరావతిలో ఇళ్ల స్థలాలిచ్చే ప్రక్రియను సవాల్ చేస్తు దాఖలైన వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా హైకోర్టు ఇలా రాష్ట్ర సర్కారును ప్రశ్నించింది. ఈ వ్యాజ్యంపై సుదీర్ఘ వాదనలు విన్న కోర్టు.. శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని పేర్కొంది. 


పేద వారికైనా రాజధాని అమరావతిలో 1134 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు


రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన పేద వారికైనా రాజధాని అమరావతిలో 1134 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చే నిమిత్తం గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్లకు భూముల బదలాయింపు నిమిత్తం సీఆర్డీఏ కమిషనర్ కు అనుమతిస్తూ పురపాలక శాఖ జీవో జారీ చేసింది. సదరు జీవోను సవాల్ చేస్తూ అమరావతి ప్రాంత రైతులు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. సీఆర్డీఏ చట్ట నిబంధనల ప్రకారం మొత్తం భూమిలో కనీసం 5 శాతం.. ఆర్థికంగా వెనకబడిన తరగతుల ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించవచ్చని రైతుల తరఫు న్యాయవాదులు వాదించారు. గత ప్రభుత్వ హయాంలో 5,024 టిడ్కో ఇళ్లు నిర్మించారని, లబ్ధిదారులను గుర్తించారు కానీ, కేటాయించలేదని కోర్టుకు వివరించారు. రెసిడెన్షియల్ జోన్లలో ఇళ్ల స్థలాలిస్తామంటే తమకు అభ్యంతరం లేదని, ఎలక్ట్రానిక్ సిటీకి చెందిన 1800 ఎకరాల్లో 700 ఎకరాలను ఇళ్ల స్థలాలకు ఇస్తామనడంపైనే అభ్యంతరం అంటూ అమరావతి రైతుల తరఫు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై ఏపీ సర్కారు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఎస్ఎల్పీ తేలే వరకు ఇళ్ల స్థలాల కేటాయింపును నిలుపుదల చేయాలని కోరారు. మాస్టర్ ప్లాన్ ను సవరించడం, రాజధానేతర ప్రాంత వాసులకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు భూములు బదలాయించేందుకు అనుమతి ఇవ్వడం కోర్టుధిక్కరణ కిందకు వస్తాయని వాదించారు. అమరావతి ప్రాజెక్టును దెబ్బతీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఈ ప్రక్రియపై స్టే ఇవ్వాలని కోర్టును కోరారు. 


హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు అనుగుణంగానే పేదలకు ఇళ్ల స్థలాలు


పేద ప్రజలకు ఇళ్ల స్థలాల కేటాయింపు గురించి మాస్టర్ ప్లాన్ లో ప్రస్తావన లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదించారు. సీఆర్డీఏ చట్టం, హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు అనుగుణంగానే పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల గురించి మాత్రమే హక్కులు ఉంటాయని తెలిపారు. సీఆర్డీఏ రైతులకు మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం అభివృద్ధి పనులపై ప్రశ్నించడానికి వీల్లేదని తెలిపారు. రూ.1100 కోట్లు చెల్లించి సీఆర్డీఏ నుండి రాష్ట్ర సర్కారు భూమిని కొన్నట్లు గుర్తు చేశారు. 5,024 టిడ్కో ఇళ్లలో 99 ఇళ్లను తీసుకోలేదని, మరో 147 ఇళ్ల వ్యవహారంలో బ్యాంకు రుణ మంజూరులో సమస్యలు ఉన్నాయని మిగతా అన్నింటిని కేటాయించినట్లు పేర్కొన్నారు.