Gummadi Kuthuhalamma Death: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్‌ గుమ్మడి కుతూహలమ్మ (73) తీవ్ర అనారోగ్యంతో బుధవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా కుతూహలమ్మ అనారోగ్యంతో బాధ పడుతున్నారు. గుమ్మడి కుతూహలమ్మ జూన్ ఒకటో తేదీ 1949లో ప్రకాశం జిల్లా కందుకూరులో జన్మించింది. చదువులో చాలా ముందున్న ఆమె ఎం.బి.బి.ఎస్. పూర్తి చేసింది. ఆ తర్వాత కొంత కాలం వైద్య వృత్తిలో పని చేసి 1979 నుంచి 1981 వరకు డాక్టర్స్ సెల్ కన్వీనర్ గా పని చేశారు. ఆ తర్వాత డాక్టర్ గా సేవలు ఆపేసి.. రాజకీయాల్లోకి వచ్చారు. వృత్తిరిత్యా వైద్యరాలైన కుతూహలమ్మ.. చిత్తూరు జడ్పీ ఛైర్‌ పర్సన్‌గా తన రాజకీయ అరంగేట్రం చేశారు. అనతి కాలంలోనే ప్రజల మనస్సులను దోచుకున్న రాజకీయ నాయకురాలుగా పేరు పొందారు. అంతే కాకుండా తన రాజకీయ జీవితంలో ఎక్కువ కాలం కాంగ్రెస్‌లో పని చేశారు. 2014వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగు దేశం పార్టీలో చేరారు. అయితే కొన్ని అనివార్య కారణాలతో కుతూహాలమ్మ టీడీపీకి రాజీనామ సమర్పించారు. 1979లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆమె చిత్తూరు జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా కూడా పని చేశారు.


ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి కుతూహలమ్మ


1980-85 సమయంలో చిత్తూరు  జిల్లా జడ్పి ఛైర్ పర్సన్, కో-ఆప్షన్ సభ్యురాలుగా పని చేశారు. ఆ తర్వాత కుతూహలమ్మ 1985లో గంగాధర నెల్లూరు నియోజక వర్గంలోని వేపంజేరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత కూడా కుతూహలమ్మ అదే స్థానం నుంచి 1989, 1999, 2004లోనూ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. దివంగత మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్‌ రెడ్డి హయాంలో వైద్యారోగ్యం, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సేవలందించిన ఆమె, 2007లో ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సేవలు అందించారు. 1994వ సంవత్సరంలో కాంగ్రెస్‌ సీటు నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో జీడీనెల్లూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ తరఫున గెలిచిన ఆమె, రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఆమె టీడీపీలో చేరి జీడీనెల్లూరు నియోజకవర్గంలో నారాయణ స్వామికి ప్రత్యర్ధిగా పోటీ చేసి ఓటమిని చవి చూశారు. ఆ తర్వాత రాజకీయాల నుంచి పూర్తి స్ధాయిలో దూరంగా ఉంటూ వచ్చిన ఆమె తన చిన్న కుమారుడు హరికృష్ణను రాజకీయ ప్రవేశం చేయించారు. 


కుతూహలమ్మ రాజకీయ ప్రస్థానం..



  • 1980-1983 చిత్తూర్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్

  • 1985-1989 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యురాలు

  • 1987-1994 ఆంధ్రప్రదేశ్ మహిళ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి

  • 1991 - 1992 వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

  • 1992-1997 ఏఐసిసి సభ్యురాలు

  • 1992-1993 మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి

  • 1998-2006 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యురాలు

  • 1999-2003 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యురాలు

  • 2001-2004 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎలక్షన్ కమిటీ సభ్యురాలు

  • 24 జులై 2007 నుండి 19 మే 2009 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్