జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు అభివృద్ధికి ఈ నెల 7న రూ.100 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. బుధవారం మాస్టర్ ప్లాన్‌కు రూపకల్పన చేసేందుకు స్వామివారి క్షేత్రానికి రానున్నారు. ఉదయం 9 గంటలకు ప్రగతి భవన్ నుంచి రోడ్డుమార్గంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. 9.10 గంటలకు హెలిక్యాప్టర్‌లో బయలుదేరి 9.40 గంటలకు కొండగట్టు సమీపంలోని నాచుపల్లి జేఎన్టీయూకు చేరుకొంటారు. అక్కడి నుంచి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకొంటారు. అనంతరం కొండగట్టుపై ఉన్న కోనేరు, కొత్త పుష్కరిణి, బేతాళస్వామి ఆలయం, సీతమ్మ కన్నీటిధార, కొండలరాయుడి గుట్ట తదితర స్థలాలను పరిశీలించి జేఎన్టీయూకు బయలుదేరుతారు.
జేఎన్టీయూ సమావేశ మందిరంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరుగుపయనమవుతారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరిశీలించారు.
నేటి నుంచి ఇంటర్ ప్రయోగ పరీక్షలు
రాష్ట్రంలో ఇంటర్‌మీడియట్ విద్యార్థులకు నేటి నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభం కానున్నాయి. ఇంటర్ ఎంపీసీ, బైపీసీ, జాగ్రఫీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులతోపాటు ఒకేషనల్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ప్రయోగ పరీక్షలు రాయడం తప్పనిసరి. మార్చి 2వ తేదీ వరకు ప్రాక్టికల్స్ జరగనున్నాయి. జనరల్ విద్యార్థులు 2.62 లక్షలు, ఒకేషనల్ నుంచి 93వేల మంది.. మొత్తంగా 3.63 లక్షల మంది విద్యార్థులు వీటికి హాజరుకానున్నారు. 2,201 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
‘పోలీసు’ అభ్యర్థులకు నేటి నుంచి 7 కేంద్రాల్లో నిర్వహించనున్న టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ
ప్రాథమిక రాత పరీక్షల ఫలితాల్లో ఉత్తీర్ణులు కాలేకపోయినా న్యాయస్థానం ఉత్తర్వులతో పలువురు ఎస్సై, కానిస్టేబుల్ స్థాయి అభ్యర్థులకు మళ్లీ కొలువు దక్కించుకునే పోటీలో నిలిచే అవకాశం చిక్కింది. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 52 వేల మందికి పైగా అభ్యర్థులు ఉండడం విశేషం. వీరంతా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మరోసారి సిద్ధమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి వీరికి శారీరక సామర్థ్య పరీక్షలు జరగబోతున్నాయి. తొలిసారిగా డిసెంబరు 8 నుంచి 31 వరకు జరిగాయి. కనిష్ఠంగా 9 రోజులు, గరిష్ఠంగా 24 రోజులపాటు వీటిని నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్‌తో పాటు సిద్దిపేటలో ఇవి జరిగాయి. అప్పటికే ప్రాథమిక రాతపరీక్షలో అర్హత సాధించిన దాదాపు 2.07లక్షల మందికి అప్పట్లో ఈ శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు మాత్రం కొన్ని కేంద్రాల్ని తగ్గించారు. రాచకొండ, ఖమ్మం, సంగారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట మినహా మిగిలిన 7 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు పరీక్ష కేంద్రాల్లో తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఏర్పాట్లు పూర్తి చేసింది.
బీహెచ్‌ఎంఎస్ హోమియోపతి సీట్ల భర్తీకి నేడు, రేపు వెబ్‌ఆప్షన్లు
ప్రైవేట్ హోమియోపతి కళాశాలల్లో బీహెచ్‌ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు రెండవ విడత వెబ్ కౌన్సెలింగ్‌కు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్ధులు నేటి ఉదయం 9 గంటల నుండి 16న గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. మరింత సమాచాాంనికి యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను చూడాలనియూనివ ర్సిటీ వర్గాలు ఒకప్రకటనలో తెలిపారు
ఎండీ హోమియో, యాజమాన్య కోటా సీట్ల భర్తీకి వన్‌టైం వెబ్‌ఆప్షన్లు
రాష్ట్రంలోని ప్రైవేట్ ఎండీ హోమియో వైద్యసీట్ల భర్తీకి వెబ్‌ఆప్షన్లకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదలచేసింది. పీజీ హోమియో కోర్సులో యాజమాన్య కోటా సీట్లను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు. అభ్యర్ధులు నమోదు చేసిన ఇట్టి వన్‌టైం ఆప్షన్ల ద్వారా అన్ని విడతల కౌన్సెలింగ్‌లకు సీట్లకేటాయింపులు జరపనున్నారు.
అర్హులైన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో నేటి ఉదయం 9 గంటల నుంచి 16న సాయంత్రం 6 గంటల వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. మరింత సమాచారానికి యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ బీబీనగర్ వద్ద పట్టాలు తప్పింది. దీంతో రైలులో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైలు వేగం తక్కువగా ఉండటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు. అయితే కాజీపేట- సికింద్రాబాద్ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.