అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి ఎప్పుడూ వైఎస్ జగన్ వెంట నడవలేదని, సీఎం జగన్ నాశనం కోరుకునేవారు వివేకా ఫ్యామిలీలో ఉన్నారని కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో జగన్ అంటే ఏంటో చంద్రబాబు మరోసారి చూస్తారని, మార్చి 18వ తేదీ నుంచి జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి శ్రీకారం చుడతామని ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత ఎన్టీఆర్ ను హత్యచేసి చంద్రబాబు పార్టీతో పాటు సీఎం పదవిని తీసుకున్నారని ఆరోపించారు. వర్ల రామయ్య, పట్టాభి వంటి వాళ్లు చంద్రబాబు వద్ద జీతగాళ్లు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని. మాజీ మంత్రి, మాజీ ఎంపీ వైఎస్ వివేకా చనిపోవడం వల్ల సీఎం జగనుకేమైనా ఆస్తి వచ్చిందా..? పదవి ఏమైనా వచ్చిందా..? అని కొడాలి నాని ప్రశ్నించారు.
లోకేషుకు తాత గొంతు రావడమేంటీ.. అయితే ఆ వచ్చిన గొంతు ఖర్జూర నాయుడు గొంతై ఉంటుందని, ఎన్టీఆర్ గొంతు అయి ఉండదన్నారు. ఎన్టీఆర్ బతుకుంటే లోకేష్ మాటలు విని ఆత్మహత్య చేసుకుని ఉండేవారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగనాసుర రక్త చరిత్ర ఎవరు చదువుతారు. ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం అని, సోషల్ మీడియా ఉందనే ఐ-టీడీపీ పెట్టారన్నారు. బుక్స్ చదువుతున్నారంటే పేపర్ టీడీపీ అని రాయండి. తడిగుడ్డతో గొంతులు కొయడం ఎలా అని బుక్ రాయమనండి అని సూచించారు.
వైఎస్ వివేకా చనిపోతే ఆస్తులు ఎవరికెళ్లాయి..?
వైఎస్ వివేకానందరెడ్డి, సీఎం జగన్ తో కలిసి నడిచి వచ్చిన వ్యక్తి కాదని, విజయమ్మ మీద కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడించే ప్రయత్నం చేశారంటూ కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా చనిపోతే జగనుకేమైనా ఆస్తులొచ్చాయా..? పదవి ఏమైనా వచ్చిందా ? అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ కుటుంబం సర్వనాశనం కోరుకునే వ్యక్తులు వైఎస్ వివేకా ఫ్యామ్లీలో ఉన్నారని, వైఎస్ భాస్కర్ రెడ్డి కుటుంబమే జగన్ వెంట నడిచారని చెప్పారు. భాస్కర్ రెడ్డి కుటుంబానికే జగన్ టిక్కెట్టిస్తారు. టిక్కెట్ ఎవరికివ్వాలో జగన్ ఇష్టం అన్నారు.
ఎన్టీఆర్ మృతిపై విచారణకు కొడాలి నాని డిమాండ్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుమారుడు లోకేష్ చేస్తున్న విమర్శలపై స్పందించిన కొడాలి నాని ఇప్పుడు ఎన్టీఆర్ మృతిపై విచారణకు డిమాండ్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఫ్యామిలీపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని విరుచుకుపడ్డారు. నందమూరి తారకరామారావును మృతిపై మిస్టరీ వీడాలని డిమాండ్ చేశారు. తారాక రామారావు రాష్ట్ర సంపద అని, ఆయన ఎలా చనిపోయారో అందరికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు.
ఎన్టీఆర్ డెత్ మిస్టరీపై కామెంట్స్ చేసిన కొడాలి నాని... ప్రధాని మోదీ, కేంద్రహోమంత్రి అమిత్ షా, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖలు రాస్తానని చెప్పారు. ఎన్టీఆర్ వారసులు రాజకీయాల్లోకి రావాలనుకుంటే యాక్సిడెంట్లు, హార్ట్ ఎటాక్లు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. వీటన్నింటిపైనా కూడా విచారణ చేయాల్సిందేనని కేంద్రంతోపాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను కోరాతనని నాని చెప్పారు.
వివేకా మర్డర్ కేసులో చార్జీషీట్ ఎందుకు వేయలేదు?
వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎందుకు హంతకులను పట్టుకోలేదని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. వివేకా హత్య కేసుతో చంద్రబాబు,లోకేష్, అప్పటి డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీ, కడప జిల్లా ఎస్పీతోపాటు టీడీపీ నేతల ఫోన్ కాల్స్ పైనా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. వివేకా మర్డర్ కి ముందు ఆ తర్వాత వీళ్లంతా ఏమేం మాట్లాడుకున్నారో కూడా ఎంక్వైరీ చేయాలన్నారు.