AP Deputy CM Narayana Swamy: తిరుమల : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఒక్క కులం వెంట పరుగెడుతుందని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి నియోజకవర్గంలో అభివృద్ధి నిల్లు... అవినీతి ఫుల్లు అని పాదయాత్రలో లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. తిరుమలలో పర్యటిస్తున్న ఆయన ఆదివారం నాడు శ్రీవారి నైవేద్య విరామ సమయంలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ.. దేశం అంతా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైపు చూస్తుందని, పేదవాడి అభివృద్ధికి నోచుకోని శత్రువులంతా ఒక్కటై పోతున్నారని, జగన్ గాలితో గెలిచిన వాళ్ళు వెన్ను పోటు పొడిచిన చంద్రబాబుతో కలిస్తున్నారని ఆయన ఆరోపించారు.
బెంగళూరు నుంచి బస్సుల్లో తీసుకొచ్చారు!
వెన్నుపోటు దారులు అంతా ఒక్కటైనా.. సీఎం జగన్ ను ఏం చేయలేరని ఆయన అన్నారు. జగన్ పై ఈర్ష్య, ద్వేషాలతో రగిలి పోయే వారిని దేవుడి క్షమించడని, జగన్ వైపే ప్రజలు ఎల్లప్పుడూ ఉంటారని, లోకేష్ పాదయాత్ర ఒక కులం‌ వెంట మాత్రమే పరుగెడుతుందన్నారు. బెంగుళూరు నుంచి బస్సులో కేవలం తమ సామాజిక వర్గం వాళ్ళను తీసుకొచ్చి రెచ్చగొట్టే ప్రయత్నం లోకేష్ చేస్తున్నారని, ఆయన చేపట్టిన యువగళం పాదయాత్రలో జగనన్న శాంక్షన్ చేసిన రోడ్డు శిలాఫలకంను కొట్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. జగన్ శాంక్షన్ చేసిన రోడ్డుపైనే నారా లోకేష్ నడుచుకుంటూ పాదయాత్ర చేస్తున్నాడని, వనదుర్గాపురం, డిఎన్.కండ్రిగలో ఫారెస్ట్ క్లియరన్స్ ఇచ్చి రోడ్డు వేయించారన్నారు. 194 కోట్లతో అగ్రిమెంట్ అయ్యి రేపో ఎల్లుండో రోడ్లు వేస్తున్నామని, ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్లు వేస్తున్నామని, అన్ని వర్గాల ప్రజలకు సీఎం‌ జగన్ న్యాయం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఆ దళితులందరికీ నవరత్నాల సంక్షేమ పథకాలు
దళిత వర్గాలను అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు అని, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు పూల‌దండ వేసేందుకు లోకేష్ ఇష్టపడలేదన్నారు. లోకేష్ యువగళం పాదయాత్రలో తిరిగే దళితులందరికి జగన్ తీసుకొచ్చిన నవరత్నాల సంక్షేమ పథకాలు అందాయని, ఆ విషయం నారా లోకేష్ తెలుసుకోవాలన్నారు నారాయణ స్వామి. చంద్రబాబు, లోకేష్ తమ నిర్ణయాలతోనే పతనం అవుతున్నారని, ఎడారిలా ఉన్న నా నియోజకవర్గంను జగన్ సీఎం అయ్యాక అభివృద్ధి చేశారన్నారు. దళిత రిజర్వ్ నియోజకవర్గంలో ఇప్పటివరకూ పార్టి ఇంఛార్జ్ ను పెట్టలేదని, బలిసిపోయిన అచ్చెన్నాయుడికి బుద్ధి, జ్ఞానం రాలేదంటూ మండిపడ్డారు. దళిత నియోజకవర్గంలో పార్టీ ఇంఛార్జ్ ను పెట్టలేని యోగ్యత టీడీపీ వాళ్ళదన్నారు. దళితులకు రాజకీయ బిక్షం పెట్టిన వ్యక్తి సీఎం జగన్ అని చెప్పిన ఆయన, నారా చంద్రబాబు దళితులకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఓటు కోసం పేదవాడి నెత్తురు తాగేవాడు చంద్రబాబు అని, ఒక్క రూపాయి ఇండ్లు ఇస్తామని చెప్పి‌ పేదలను టీడీపీ అధినేత మోసగించారని, టిడిపి ఎప్పుడూ కోటీశ్వరులకు కొమ్ము కాసే పార్టీ అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విమర్శించారు.