AP PCC Chief Gidugu Rudraraju: తిరుపతి: ఓవైపు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తామని ధీమాగా ఉంది. ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని స్థానాల్లో విజయం సాదిద్దాం, వై నాట్ 175 సీట్స్ అని గట్టిగానే చెబుతున్నారు. అయితే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు పిడుగు లాంటి వార్త చెప్పారు. అధికార పార్టీ వైసీపీ నేతలు చాలా మంది తమతో టచ్ లో ఉన్నారని, తిరిగి కాంగ్రెస్ పార్టీకి రావడానికి సిద్ధంగా ఉన్నారని ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జగన్, కేంద్రంలో బీజేపీలే మాకు రాజకీయ ప్రత్యర్థులు అని స్పష్టం చేశారు. 


జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని డిమాండ్ 
దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ నేత గిడుగు రుద్రరాజు అన్నారు కుబేరుడు అదాని కార్పొరేట్ మాఫియాతో, ఆర్థిక అక్రమాలపై జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం తిరుపతిలో రాష్ట్ర  పిసిసి అధ్యక్షుడు గిడిగి రుద్రరాజు పాదయాత్ర నిర్వహించారు. స్థానిక మహతి కళాక్షేత్రం వద్ద నుంచి అంబేద్కర్ భవన్ వద్ద వరకు ఈ పాదయత్ర సాగింది. 


అనంతరం అంబేద్కర్ భవన్ ప్రాంగణంలో మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో జగన్, వైసీపీలే మాకు రాజకీయ ప్రత్యర్థులు అన్నారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు అన్ని దోచుకుంటున్నారని సచివాలయం పేరుతో స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేశారంటూ ధ్వజమెత్తారు. దేశంలో అదాని కార్పొరేట్ మాఫియాతో, ఆర్థిక అక్రమాలపై జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలిని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతుందన్నారు. అధికార పార్టీ వైసీపీ నేతలు చాలా మంది మాతో టచ్ లో ఉన్నారని, తిరిగి కాంగ్రెస్ పార్టీకి రావాటానికి సిద్ధంగా ఉన్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. వైసీపీ పాలన చూసిన రాష్ట్ర ప్రజలు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయం అని గిడుగు రుద్రరాజు ధీమా వ్యక్తం చేశారు.


ఏపీలో కాంగ్రెస్ ను బలోపేతం చెయ్యడమే తన లక్ష్యం అంటున్నారు గిడుగు రుద్రరాజు. మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన తనకు ఈ పదవి రావడానికి తన విధేయతే కారణం అంటున్నారు.  కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న సీనియర్ నేతలను కలుపుకుని ముందుకు వెళతానంటున్న పార్టీ నూతన అధ్యక్షుడు పార్టీయే తన కులం, గోత్రం అంటున్నారు. పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానన్నారు. అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళతానన్నారు. ప్రజా సమస్యలు, విభజన హామీలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో అందరికీ గుర్తింపు ఉంటుందని, ముఖ్యంగా కష్టపడి పనిచేసేవారికి గుర్తింపు ఉంటుందన్నారు.