Anurag Thakur On Kejriwal:


విమర్శలు..


కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్...కేజ్రీవాల్‌ను టార్గెట్ చేశారు. కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, గణపతి బొమ్మలు ముద్రించాలని మూడ్రోజుల క్రితం కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై ఠాకూర్ స్పందించారు. కేజ్రీవాల్ మాటలన్నీ "ఫేక్" అంటూ కొట్టిపారేశారు. ఆలయాలు నిర్మించటాన్ని వ్యతిరేకించే వాళ్లు ఉన్నట్టుండి హిందువులుగా మారిపోయారని మండి పడ్డారు. తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ కొత్త ప్రచారంతో ముందుకొచ్చిందని విమర్శించారు. ఢిల్లీ సర్కార్ ఓ మత పెద్దలకు రూ.18 వేల ఆర్థిక సాయం అందిస్తోందని...అదే విధంగా పూజారులకు, గురుద్వారలో పని చేసే వారికి, చర్చ్ ప్రీస్ట్‌లకు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. ఆప్ నేతలను ఆలయాలను వ్యతిరేకించే కొత్త "హిందూ వర్గం" గా అభివర్ణించారు ఠాకూర్. ఇదే సమయంలో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల గురించీ ప్రస్తావించారు. పార్టీ టికెట్‌లు ఇచ్చే క్రమంలో చాలా మంది వాటిని ఆశిస్తారని, కానీ అందరికీ టికెట్‌లు ఇవ్వలేమని వెల్లడించారు. కొందరు సీనియర్ నేతలు టికెట్ కావాలని ఒత్తిడి తెచ్చారని, వాళ్లు స్వతంత్రఅభ్యర్థులుగా పోటీ చేసేందుకూ సిద్ధమవుతున్నారని చెప్పారు. అలాంటి వాళ్లకు నచ్చచెప్పే ప్రయత్నాలు చేస్తున్నామని స్పష్టం చేశారు. 






రాజకీయ దుమారం..


ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కరెన్సీ నోట్లపై చేసిన వ్యాఖ్యలు రెండు రోజులుగా దుమారం రేపుతూనే ఉన్నాయి. రాజకీయంగా పెద్ద రచ్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్...ప్రధాని మోదీకి లేఖ రాశారు. "ఇది దేశంలోని 130 కోట్ల మంది కోరిక. గాంధీ బొమ్మతో పాటు కరెన్సీ నోటుపై లక్ష్మీదేవి, గణేషుడి బొమ్మలు ముద్రించండి" అని లేఖలో పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ చాలా దారుణమైన స్థితిలో ఉందని, స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా భారత్ ఇంకా అభివృద్ధి చెందుతున్న పేద దేశంగానే మిగిలిపోయిందని లేఖలో ప్రస్తావించారు. దేశంలో ఇంకా ఇంత మంది పేదలు ఎందుకున్నారని ప్రశ్నించారు. " ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే మనమంతా సమష్టిగా శ్రమించాలి. అటు దేవుళ్ల ఆశీర్వాదాన్నీ బలంగా కోరుకోవాలి. ఇవే దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తాయి. నేను చెప్పినప్పటి నుంచి ప్రజల్లో ఈ కోరిక బలపడింది. అందరూ ఇది జరగాలని కోరుకుంటున్నారు. తక్షణమే అమలు చేయాలని ఆకాంక్షిస్తున్నారు" అని వెల్లడించారు కేజ్రీవాల్.  


శివాజీ ఫోటోతో..


కరెన్సీ నోట్ల వివాదానికి ఇప్పట్లో తెరపడేలా లేదు. ఆప్, కాంగ్రెస్, భాజపా మధ్య ఇది మాటల యుద్ధానికి దారి తీసింది. ఒక్కో పార్టీ ఒక్కో విధంగా కేజ్రీవాల్ కామెంట్స్‌పై స్పందిస్తోంది. ఓ భాజపా నేత మాటలు ఎందుకనుకున్నాడో ఏమో. ఏకంగా చేతల్లో చూపించాడు. ఛత్రపతి శివాజీ ఫోటోతో ఇండియన్ కరెన్సీని ఫోటోషాప్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. భాజపా నేత నితేశ్ రాణే ఈ ఫోటోను షేర్ చేశారు. రూ.200 నోటుపై ఛత్రపతి శివాజీ ఫోటోని ఎడిట్ చేశారు. మహారాష్ట్రలోని కంకవలి ఎమ్మెల్యే అయిన రాణే.."ఇది పర్‌ఫెక్ట్‌"
అని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. 


Also Read: కొబ్బరి నీళ్లు తీసుకురా- ఎమ్మెల్యేల కొనుగోలులో కోడ్‌ లాంగ్వేజ్‌- రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు