తెలంగాణ తొలి 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ పరీక్షలో వచ్చిన ప్రశ్నలు సివిల్స్‌ తరహాలో కఠినంగా ఉన్నట్లు పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిలిమ్స్‌లో ప్రశ్నలు కఠినంగా వచ్చాయని, విశ్లేషణాత్మక, స్టేట్‌మెంట్‌ ఆధారిత, సుదీర్ఘ విశ్లేషణలతో కూడినవి ఎక్కువగా ఉన్నాయని అభ్యర్థులు తెలిపారు. వాటిని చదివి, అర్థం చేసుకుని సమాధానాలు గుర్తించేందుకు సమయం సరిపోలేదని అన్నారు. ప్రిలిమ్స్‌ ప్రశ్నల కాఠిన్యత, అడిగిన తీరు సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష స్థాయికి మించి ఉందని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. కరెంట్‌ అఫైర్స్‌, సైన్స్‌, టెక్నాలజీ, మెంటల్‌ ఎబిలిటీ, లాజికల్‌ థింకింగ్‌ కేటగిరీ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. సమాధానాలు గుర్తించేందుకు ఒక్కో ప్రశ్నకు ఒక్కో నిమిషం మాత్రమే ఉంటుంది. ఐతే ప్రశ్నల కాఠిన్యం దృష్టా నిముషం సమయం సరిపోలేదని, ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నలు అధికంగా వచ్చాయని అన్నారు. నేరుగా సమాధానాలను గుర్తించే ప్రశ్నలు స్వల్ప సంఖ్యలో మాత్రమే ఉన్నాయి. ప్రశ్నలను పూర్తిగా చదివేందుకు కూడా సమయం సరిపోలేదని అన్నారు. అందువల్ల అన్ని ప్రశ్నలకు సమాధానం రాయలేక పోయామని, సగటున 15 నుంచి 20 ప్రశ్నలకు సమాధానాలను గుర్తించలేకపోయినట్లు కొందరు అభ్యర్థులు తెలిపారు.


ఇకపై అన్ని పరీక్షలు ఇలాగే..?
అయితే గ్రూప్-1 పరీక్షలో ఇచ్చిన ప్రశ్నల తరహాలోనే ఇకపై టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించే ప్రతీ పోటీ పరీక్షల పేపర్లు ఇదే స్థాయిలో ఉంటాయని ఉద్యోగార్థులు, విషయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్‌-1 పరీక్ష గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన విషయం తెలిసిందే. కానీ తెలంగాణ రాష్ట్రంలో అక్టోబరు 16న జరిగిన 'గ్రూప్‌-1' ప్రిలిమినరీ పరీక్ష పేపర్‌ సివిల్స్‌ స్థాయిలో ఇంత కఠినంగా వస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. గతంలో ఎన్నడూ ఈస్థాయిలో కఠినంగా పేపర్‌ రాలేదని పరీక్ష రాసిన అభ్యర్థులు, కోచింగ్‌ నిర్వాహకులు చెబుతున్నారు. ఈక్రమంలోనే ఇకమీదట టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించబోయే పోటీ పరీక్షలన్నీ ఈ స్థాయిలోనే ఉంటాయని పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్ష రూపంలో కమిషన్‌ చెప్పకనే చెప్పింది. ఈ నేపథ్యంలో కోచింగ్‌ విధానాన్ని, చదివే తీరును మార్చుకునే పనిలో కోచింగ్‌ సెంటర్లు, నిరుద్యోగులు పడ్డారు. గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 80వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.


తొలి నోటిఫికేషన్ కావడంతో..
తెలంగాణలో లక్షల మంది నిరుద్యోగులు చాలా కాలంగా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. చివరిసారిగా 'గ్రూప్‌-1' నోటిఫికేషన్‌ ఉమ్మడి రాష్ట్రంలో 2011లో విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక తొలి నోటిఫికేషన్‌ కావడంతో భారీ స్థాయిలో దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,80,081 మంది అభ్యర్థులు గ్రూప్‌-1కు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్నవారిలో 2,86,051 మంది పరీక్షకు హాజరయ్యారు. అయితే పరీక్ష రాసిన వారిలో దాదాపు ప్రతి ఒక్క అభ్యర్థి సుమారు 15 ప్రశ్నలను ఆన్సర్‌ చేయకుండానే వదిలేసినట్లు కోచింగ్‌ నిర్వాహకులు చెబుతున్నారు. పరీక్ష రాసిన అభ్యర్థుల్లో సుమారు 90శాతం మంది తమకు సమయమే సరిపోలేదని చెప్పడం గమనార్హం. త్వరలో జరగబోయే పరీక్ష పేపర్లు కూడా ఏ స్థాయిలో టఫ్‌గా ఉంటాయో మనం దీన్ని బట్టే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.


అంత ఈజీ కాదు...
ఏమాత్రం అంచనాలకు అందకుండా గ్రూప్‌-1 ప్రిలిమినరీ పేపర్‌ను టీఎస్‌పీఎస్‌సీ రూపకల్పన చేసింది. ఎవరూ ఊహించని విధంగా ఎక్కడెక్కడి నుంచో పరీక్షల్లో ప్రశ్నలు అడిగారు. ఎక్కువ క్వశ్చన్లు వస్తాయనుకున్న టాపిక్‌ నుంచి ఒకటి రెండు ప్రశ్నలు వస్తే.. తక్కువ క్వశ్చన్లు వస్తాయనుకున్న సబ్జెక్టుల నుంచి చాలా క్వశ్చన్లను అడిగినట్లు అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఏ టాపిక్‌ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయో ఊహించడంలో కోచింగ్‌ సెంటర్లు దిట్ట. అందులోనూ పోటీ పరీక్షల్లో ఏ తరహా ప్రశ్నలను అడుగుతారో వారు సులువుగా పసిగడతారు. అలాంటిది ఆయా కోచింగ్‌ సెంటర్లు కూడా ఊహించనంతగా ప్రశ్నల సరళి గ్రూప్‌-1 పరీక్షలో ఇచ్చారు. ఈ దెబ్బకి త్వరలో జరగబోయే పోటీ పరీక్షల కోచింగ్‌ విషయంలో అటు ఉద్యోగార్థులు, ఇటు కోచింగ్‌ నిర్వాహకులు డైలమాలో పడ్డారు. లక్షల్లో ఫీజులు కట్టి కోచింగ్‌ తీసుకున్నా పెద్దగా ఉపయోగం లేకుండా పోయిందనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.


మెయిన్స్ పరిస్థితి ఏంటో?
ఫిబ్రవరివలో 'గ్రూప్‌-1' మెయిన్స్‌ పరీక్ష జరుగనుంది. దీంతోపాటు ఇతర పోటీ పరీక్షల కోసం వేరే రిఫరెన్స్‌ బుక్స్‌లను చదివే పనిలో పడ్డారు. టీఎస్‌పీఎస్‌సీ ఇప్పటి వరకు దాదాపు 9 నుంచి 12 వరకు వివిధ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షతో పాటు త్వరలో జరగబోయే ఉద్యోగ పోటీ పరీక్షలన్నింటికీ ప్రశ్నపత్రాలను కమిషన్‌ టఫ్‌గానే రూపొందించనున్నట్లు కోచింగ్‌ నిర్వాహకులు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చేశారు. దానికనుగుణంగానే కోచింగ్‌ ఇచ్చే విధానాన్ని మార్చుకునే పనిలో ఉన్నారు. స్ట్రెయిట్‌ ప్రశ్నలు అడగకుండా సమయం ఎక్కువగా పట్టే విధంగా, క్లిష్టతరమైన ప్రశ్నలతో పేపర్లు ఉండే అవకాశముందని కోచింగ్‌ నిర్వాహకులు, అభ్యర్థులు, నిపుణులు అంచనా వేస్తున్నారు. వెలువడే ప్రతి నోటిఫికేషన్‌కు లక్షల మంది అభ్యర్థులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న నేపథ్యంలో వారందరినీ వడపోత చేసేలా పేపర్లను టఫ్‌గా తయారు చేస్తున్నారు.


మరిన్ని ఉద్యోగ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి..