Dr Reddy's Q2 results: 2022 సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో ‍‌(Q2FY23)... ఫార్మాస్యూటికల్ దిగ్గజం, తెలుగు కంపెనీ డా.రెడ్డీస్ లాబొరేటరీస్ దలాల్‌ స్ట్రీట్‌ అంచనాలను అధిగమించి బలం పుంజుకుంది. ఏడాది ప్రాతిపదికన (YoY), కంపెనీ ఏకీకృత (కన్సాలిడేటెడ్) నికర లాభం 12% పెరిగింది. ఈ త్రైమాసికంలో రూ. 1,113 కోట్ల లాభాన్ని కంపెనీ ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలోని రూ. 992 కోట్ల నుంచి ఇది పెరిగింది. 


ఈ హైదరాబాదీ డ్రగ్‌ మేకర్ ఏకీకృత ఆదాయం కూడా  9 శాతం పెరిగి రూ. 6,306 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 5,763 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. గత త్రైమాసికంతో పోల్చినా (Q1FY23) ఏకీకృత ఆదాయం 21 శాతం పెరిగింది.


మైనస్‌ అనుకుంటే ప్లస్‌ అయింది
కంపెనీ ఏకీకృత నికర లాభం గత సంవత్సరం కంటే 19.4 శాతం క్షీణించి రూ. 799.8 కోట్లకు చేరుకుంటుందని మార్కెట్‌ పండితులు అంచనా వేశారు. ఆదాయం కూడా ఏడాదికి 1.8 శాతం తగ్గి రూ. 5,659.3 కోట్లకు చేరుకుంటుందని ఫలితాల ముందు అభిప్రాయపడ్డారు. పండితుల లెక్కలను పటాపంచలు చేస్తూ, అటు ఆదాయంలో, ఇటు లాభంలో పైచేయి సాధించింది డాక్టర్‌ రెడ్డీస్‌.


సాయం చేసిన అమెరికన్‌ సేల్స్‌
కంపెనీ ఆదాయం, లాభం పెరుగుదలతో ప్రధాన పాత్ర అమెరికన్‌ మార్కెట్‌లో కొత్తగా లాంచ్‌ చేసిన లెనాలిడోమైడ్ (Lenalidomide) క్యాప్సూల్స్‌ది. ఈ క్యాప్సూల్స్‌ భారీగా అమ్ముడుపోవడం వల్ల సెప్టెంబర్‌ త్రైమాసికంలో బలమైన ఆర్థిక పనితీరు కనబరిచామని కంపెనీ కో-చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి.వి.ప్రసాద్ వెల్లడించారు. 


సెప్టెంబర్‌ క్వార్టర్‌లో, లెనాలిడోమైడ్ క్యాప్సూల్స్‌తో పాటు ఏడు కొత్త ఔషధాలను కంపెనీ విడుదల చేసింది. రాబోయే 3 నెలల్లో, అమెరికన్‌ మార్కెట్‌లో మరో 25 కొత్త ఔషధాలను లాంచ్‌ చేయడానికి డాక్టర్‌ రెడ్డీస్‌ సిద్ధంగా ఉంది. బయోలాజిక్స్‌ విభాగంలో సామర్థ్యాన్ని పెంచుకునే ప్రణాళికలపై కంపెనీ దృష్టి పెట్టింది. 


సెప్టెంబర్‌ త్రైమాసికంలో, గ్లోబల్‌ జనరిక్స్‌ విభాగంలో 18 శాతం వృద్ధిని ఈ కంపెనీ సాధించింది. ఈ విభాగంలో, ఒక్క ఉత్తర అమెరికాలోనే 48 శాతం అమ్మకాలు పెరిగాయి. అయితే... మన దేశంతోపాటు యూరోపియన్‌ మార్కెట్లలో వృద్ధి పెద్దగా లేదు. 


యుద్ధ ప్రభావం నిల్‌
యుద్ధ ప్రభావం రష్యన్‌ మార్కెట్‌ ఆదాయం మీద కనిపించ లేదు. రష్యా వ్యాపారంలో 4 శాతం వృద్ధితో అమ్మకాలు రూ. 590 కోట్లుగా నమోదయ్యాయి. కొత్త మెడిసిన్స్‌ లాంచ్‌ చేయడం, ప్రొడక్ట్‌ రేట్లు పెంచడం, మారక దవ్య మార్పిడి సానుకూలత డాక్టర్‌ రెడ్డీస్‌కు కలిసొచ్చాయి. రష్యాలో అమ్మకాలు దాదాపుగా సాధారణ స్థితికి చేరుకున్నట్లు కంపెనీ పేర్కొంది.


రెండో త్రైమాసికంలో పరిశోధన & అభివృద్ధి కార్యకలాపాల కోసం రూ. 490 కోట్లను కంపెనీ వెచ్చించింది. క్యాపిటల్‌ ఎక్చ్‌పెండీచర్‌ (మూలధన వ్యయం‌) రూ. 250 కోట్ల వరకు ఉంది.


2022-23 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలు లేదా తొలి రెండు త్రైమాసికాల్లో (ఏప్రిల్‌-సెప్టెంబర్‌) కలిపి మొత్తం రూ.11,521 కోట్ల ఆదాయాన్ని, రూ. 2,300 కోట్ల నికర లాభాన్ని డాక్టర్‌ రెడ్డీస్‌ సంపాదించింది.


శుక్రవారం 1.06% క్షీణించిన కంపెనీ షేరు ధర, రూ. 4,442 దగ్గర క్లోజయింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.