Weather Today: బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో మారుతున్న పరిస్థితులు, ఊపందుకున్న ఈశాన్య రుతుపపనాలు కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఓవైపు అరేబియాలో ఏర్పడిన అల్పపీడనం, మరోవైపు వేగంగా కదులుతున్న ఈశాన్య రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఆవర్తనంతో వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి. వీటి ప్రభావంతో ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా చాలా ప్రాంతాలు మేఘావృతమై ఉన్నాయి. 


తెలంగాణలోని వాతావరణం(Todays Telangana Weather )
తెలంగాణలో ఇవాల్టి నుంచి ఏడు రోజుల పాటు వాతావరణం ఎలా ఉంటుందో వాతావరణ శాఖ వెల్లడించింది. రెండు రోజులు మాత్రం  వివిధ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 


శుక్రవారం ఎల్లో అలర్ట్ జారీ అయిన జిల్లాలు:- ఆదిలాబాద్‌, కొమరం భీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయి. ఈదురు గాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 


శనివారం ఎల్లో అలర్ట్ ఉన్న జిల్లాలు:- ఆదిలాబాద్‌, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయి. ఉరుమలు మెరుపులు ఈదురుగాలుల వీస్తాయని అధికారులు వెల్లడించారు. 


మిగతా ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయి కానీ ఎలాంటి ప్రత్యేక అలర్ట్ లేదని వాతావరణ శాఖ పేర్కొంది. వాతావరణం విషయానికి వస్తే గరిష్ట ఉష్ణోగ్రతలు 31 డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో రిజిస్టర్ అయ్యే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల వరకు ఉంటుందని అంచనా వేస్తోంది. గురువారం రోజున గరిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 34.8 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత కూడా మెదక్‌లోనే 21.8 డిగ్రీలుగా నమోదు అయింది.  


హైదరాబాద్‌ వాతావరణం(Todays Hyderabad Weather )
హైదరాబాద్‌లో మాత్రం వాతావరణం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. గరిష్ఠం 31.2 డిగ్రీలు ఉంటే... కనిష్ఠం 23.8 డిగ్రీలుగా రిజిస్టర్ అయ్యింది. హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాలకు వాతావరణ శాఖాధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 


ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం(Todays Andhra Pradesh Weather)
ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో మారుతున్న వాతావరణం ఏపీని వణికిస్తోంది. శనివారానికల్లా దక్షిణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ దిశగా కదలనుంది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడి రెండు రోజుల్లో అది వాయుగుండంగా మారుతుంది. అది కాస్త తీవ్ర వాయుగుండంగా మారి 16 లేదా 17 వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లోనే తీరం దాటొచ్చని అంచనా వేస్తున్నారు. దీని గమనం ఎటు వెళ్తుంది... పూర్తి వివరాలు శనివారం సాయంత్రానికి ఓ క్లారిటీ రానుంది. 



బంగాళాఖాతంలో మారుతున్న పరిస్థితులు కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. ఒక వేళ తుపాను ఏర్పడే పరిస్థితులు వస్తే మాత్రం ఆదివారం నుంచి ప్రభావం తీవ్రంగా ఉంటుందని సోమవారం నుంచి కచ్చితంగా వర్షాలు జోరు అందుకుంటాయని అంటున్నారు. 


మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారుతూ వాయవ్య దిశగా కదులుతోంది. దీని ప్రభావం కూడా తెలుగు రాష్ట్రాలపై ఉంటోంది. ఈ అల్పపీడన, ఆవర్తనాలకు తోడు చురుగ్గా కదులుతున్న ఈశాన్య రుతుపవనాలు ప్రభావం తెలుగు రాష్ట్రాలపై గట్టిగానే ఉంది. మరో రెండు మూడు రోజుల్లో రాష్ట్రానికి ఈశాన్య రుతుపవనాలు తాకవచ్చని చెబుతున్నారు. దీని వల్ల కూడా కోస్తా రాయలసీమ, తెలంగాణలో వర్షాల జోరు పెరగనుంది. 


Also Read: 29 ఏళ్ల యువకుడే రతన్ టాటా బెస్ట్ ఫ్రెండ్‌ అండ్‌ మేనేజర్- గుడ్‌ బై లైట్‌హౌస్‌ అంటూ వీడ్కోలు