AP Grama Volunteers Salaries Hike:  ఏపీలో గ్రామ వాలంటీర్లకు (Grama Volunteers) ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 1 నుంచి వారికి రూ.750 జీతం పెంచుతున్నట్లు మంత్రి కారుమూరి (Karumuru Nageswararao) నాగేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం వాలంటీర్లకు నెలకు రూ.5 వేల గౌరవ వేతనం లభిస్తోంది. సీఎం జగన్ పుట్టిన రోజు కానుకగా మంత్రి గురువారం ఈ ప్రకటన చేశారు. గురువారం తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. 'సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా వాలంటీర్ల వేతనం అదనంగా రూ.750 ఇవ్వబోతున్నాం. జనవరి 1 నుంచే పెంచిన వేతనాన్ని వారు అందుకుంటారు. ప్రజలకు రేషన్ పకడ్బందీగా ఇప్పిస్తున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్తులో వాలంటీర్లు మరింత మంచి చేసే అవకాశాన్ని సీఎం జగన్ కల్పిస్తారు.' అని మంత్రి తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ రాష్ట్ర అభివృద్ధికి అడ్డు పడుతున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మళ్లీ సీఎంగా జగన్ అధికారం చేపడతారని ధీమా వ్యక్తం చేశారు.


ఘనంగా సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు


మరోవైపు, సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు విషెష్ చెప్పారు. పీఎం మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ సీఎంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, మంత్రి రోజా ఇతర నేతలు విషెష్ చెప్పారు.  అటు, వైసీపీ నేతలు, శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు సీఎం పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలువురు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆయన ఆయురారోగ్యాలతో పాలన సాగించాలని ఆకాంక్షించారు. సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మరో 3 దశాబ్దాల పాటు సీఎంగా ఉండాలని ప్రజా ప్రతినిధులు కోరుకున్నారు. పలు చోట్ల కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. 


ట్యాబ్స్ పంపిణీ


అటు, సీఎం జగన్ తన పుట్టిన రోజు సందర్భంగా విద్యార్థులకు ట్యాబుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అల్లూరి జిల్లా చింతపల్లిలో విద్యార్థులకు ట్యాబ్స్ అందజేశారు. నాడు- నేడుతో స్కూళ్ల రూపురేఖలను మార్చామన్నారు. 10 రోజుల పాటు విద్యార్థులకు ట్యాబుల పంపిణీ కొనసాగుతుందని ప్రకటించారు. పేదరికం సంకెళ్లు తెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని.. విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చూట్టామని సీఎం జగన్ తెలిపారు. విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తూంటే.. వద్దంటున్నారని విపక్షాలపై మండిపడ్డారు. పేద విద్యార్థులపై విషం కక్కొద్దని చెబుతున్నానన్నారు.  పేద పిల్లలకు మంచి చేస్తుంటే ఏడుస్తున్నారని ఆరోపించారు.


భవిష్యత్ కోసమే ప్రతి రూపాయి


ప్రభుత్వం ఖర్చు పెడుతున్న ప్రతీ రూపాయి సంక్షేమం కోసమేనని సీఎం జగన్ చెప్పారు. మంచి చేస్తున్న తనపై ఎందరో బురద చల్లుతున్నారని, దుబారా ఖర్చు చేస్తున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని మండిపడ్డారు. చంద్రబాబు, దత్తపుత్రుడు పవన్ దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. 'విద్యార్థులకు ట్యాబులు ఇస్తే చెడిపోతున్నారట.. ఏవేవో వీడియోలు చూస్తున్నారట, గేమ్స్ ఆడుతున్నారట.. నాపై పని గట్టుకుని విమర్శలు చేస్తున్నారు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే. మన పిల్లలు దేశంలోనే ఉత్తమంగా ఉండాలి. అప్పుడు, ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లు ఎలా ఉన్నాయో గమనించండి'. అని పేర్కొన్నారు.


Also Read: CM Jagan : ట్యాబుల ప్రతి విద్యార్థికి రూ. 33వేల లబ్ది - ఎప్పట్లాగే ప్రభుత్వ కార్యక్రమంలో విపక్షాలపై రాజకీయ విమర్శలు !