Amaravati Farmers Protest: ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ఇళ్ల పట్టాల పంపిణీకి వ్యతిరేకంగా అమరావతి రాజధాని రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆర్-5 జోన్ పరిధిలో నల్ల బెలూన్లు చేత పట్ట మరీ ధర్నా చేస్తున్నారు. ఈరోజు తుళ్లూరు మండలం వెంకటపాలెంలో పట్టాల పంపిణీకి నేడు సీఎం జగన్ వచ్చారు. ఈక్రమంలోనే రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడి, మందడం, కృష్ణాయపాలెం తదితర గ్రామాల్లో ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా రైతులు, మహిళలు ఆందోళన చేపట్టారు. పేదలకు పట్టాల పేరుతో మోసం చేస్తున్నారని ఆరోపించారు.


వెలగపూడిలోని దీక్షా శిబిరం వద్ద రైతులు నల్ల బెలూన్లు, నల్ల జెండాలు ఎగురవేసి నిరసన తెలిపారు. తుళ్లూరులో ఇళ్లు, దుకాణాలపై నల్ల జెండాలు ఎగురవేశారు. దీక్షా శిబిరం వద్ద ఉరి తాళ్లతో నిరసన చేశారు. తమను మోసం చేయొద్దంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. 


పేదల్లారా.. మరోసారి మోసపోవద్దంటూ రాసి ఉన్న ప్లకార్డులు చేతిలో పట్టుకొని నిరసన చేస్తున్నారు. అమరావతిని విచ్ఛిన్నం చేసే సీఎం గో బ్యాక్, రాజధాని ద్రోహులు గో బ్యాక్, అమరావతిని నిర్మించండి, ఆంధ్రప్రదేశ్ ను కాపాడండి అంటూ నినాదాలు చేశారు. మరోవైపు మందడంలోని దీక్షా శిబిరం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నిరసన కారులు బయటకు రాకుండా భారీగా పోలీసులు మోహరించారు. సీఎం పర్యటన నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో 3 వేల మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అమరావతి రైతుల ఆందోళనపై పోలీసు అధికారులు ప్రత్యేక నిఘా ఉంచారు. అమరావతి జేఏసీ నేతలు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనకుండా ముందుగానే వారిని గృహ నిర్బంధం చేశారు. అమరావతి బహజన ఐకాస నేత పోతుల బాలకోటయ్యను స్వస్థలమైన కంచికచర్లలో హౌస్ అరెస్ట్ చేశారు. 


ఇప్పటికే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్


అమరావతిలోని ఆర్‌-5జోన్‌లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. తుళ్లూరు మండలం వెంకటాయ­పాలెం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నుంచి లబ్ధిదారులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. అక్కడే నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందజేస్తారు. సీఆర్డీఏ పరిధిలోని నిడమర్రు, కృష్ణఆయపాలెం, నవులూరు, ఐనవోలు, మందడం, కురగల్లు, యర్రబాలెం, పిచ్చుకలపాలెం, బోరుపాలెం, నెక్కల్లు, అనంతవరంలో 51,392 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నారు. ఈ లబ్ధిదారులంతా ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందినవారు. వీల్లకు ఒక్కొక్కరికి సెంటు స్థలాన్ని ఇంటి కోసం అందిస్తోంది ప్రభుత్వం. మొత్తం  25 లేఅవుట్లలో ప్లాట్లు కేటాయించింది


అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి దేశ చరిత్రలో ప్రత్యేకత ఉందన్నారు సీఎం జగన్. పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని వేల పోరాటాలు దేశంలో చాలా జరిగాయని గుర్తు చేశారు. కానీ, పేదలకు ప్రభుత్వమే ఇళ్లస్థలాలు ఇవ్వడానికి సుదీర్ఘ న్యాయపోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లిమరీ.. 50వేల మందికి ఇళ్లస్థలాలు ఇవ్వడం ఒక చారిత్రక ఘటంగా అభివర్ణించారు. ఇలాంటివి చూస్తే ఆశ్చర్యం కలుగుతోందన్నారు. పెదలకు ఇళ్లస్థలాలు ఇవ్వకుండా రాక్షసులు అడ్డుపడ్డారని ప్రతిపక్షాలను ఉద్దేశించి జగన్ విమర్శించారు. ఈ ప్రాంతంలో గజం ధర 15 వేల నుంచి 20 వేల వరకు ఉంటుందన్నారు. అంటే ఒక్కొక్కరికి 7 నుంచి 10 లక్షల రూపాయల విలువైన ఇంటి స్థలాన్ని ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు. సామాజిక పత్రాలుగా ఈ ఇంటి పత్రాలు ఇస్తున్నట్టు అభిప్రాయపడ్డారు. ఇదే అమరావతి.. ఇకమీదట ఒక సామాజిక అమరావతి అవుతుందన్నారు. ఇకపై మన అందరి అమరావతి అవుతుందని చెప్పారు.