Kamal Haasan: గ్రాండ్ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ(IIFA) అవార్డ్‌ల కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. ఈ మూవీ కార్నివాల్ 23వ ఎడిషన్ మే 26, 27 తేదీల్లో అబుదాబిలోని యాస్ ఐలాండ్‌లోని ఎతిహాద్ ఎరీనాలో జరగనుంది. ఈ ఈవెంట్ కు బాలీవుడ్ స్టార్ హీరోస్ అభిషేక్ బచ్చన్, విక్కీ కౌశల్ ఈ సంవత్సరం హోస్ట్ చేయనున్నారు.


అబుదాబిలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో 6 దశాబ్దాలుగా సినీ రంగానికి అందించిన సేవలకు గాను దిగ్గజ నటుడు-దర్శకుడు కమల్ హాసన్‌ ఐఫా జీవిత కాల పురస్కారం అందుకోనున్నారు. ఈ విషయాన్ని IIFA మేనేజ్‌మెంట్‌తో పాటు IIFA అడ్వైజరీ బోర్డ్ సభ్యులు కర్టెన్ రైజర్ ప్రెస్ మీట్‌లో వెల్లడించారు. ఇదిలా ఉండగా ఈ అవార్డు వేడుకలో ఇండియన్ ఫిల్మ్ అకాడమీ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా, స్టార్ కపుల్ రితీష్ దేశ్ ముఖ్, జెనీలియా డిసౌజాలను కూడా సత్కరించనున్నారు. కమల్ కు ఐఫా జీవితకాల సాఫల్య పురస్కారం రావడంతో ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.


భారతదేశంలోని పలు సినీ పరిశ్రమలలో పనిచేసిన మల్టీ హైఫనేట్ యాక్టర్ కమల్ హాసన్.. IIFA 2023 అవార్డు వేడుక కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నానని తెలిపారు. తాను IIFA వేడుకలో భాగమైనందుకు, ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమాలను ప్రమోట్ చేస్తోన్నందుకు తాను చాలా గౌరవంగా, కృతజ్ఞతతో ఉన్నానని ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈసారి అబుదాబిలోని యాస్ ఐలాండ్‌లో జరిగే IIFA 2023లో తనను సత్కరిస్తున్నారని, ఈ కార్యక్రమానికి హాజరవుతున్నందుకు సంతోషిస్తున్నానని హాసన్ తెలిపారు.


68 ఏళ్ల కమల్ హాసన్.. 'కలతుర్ కన్నమ్మ' అనే తమిళ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. దీనికి రాష్ట్రపతి గోల్డ్ మెడల్ లభించింది. అప్పట్నుంచి ఆయన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం హిందీ, బెంగాలీ వంటి అనేక చిత్ర పరిశ్రమలలో పనిచేశారు. 'అవ్వై షణ్ముగి', 'నాయగన్', 'హే రామ్', 'ఇండియన్',  'విక్రమ్' వంటి అనేక ఇతర చిత్రాలలో కమల్ పోషించిన పాత్రలకు, నటనకు మంచి గుర్తింపు లభించింది. అంతే కాదు కమల్ హాసన్ ప్రసిద్ధ పద్మశ్రీ,, పద్మభూషణ్‌ రెండూ అందుకున్నారు.


కమల్ హాసన్ పలు భాషల్లో కలిపి మొత్తం 232 పైగా చిత్రాల్లో నటించారు. ఆయన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన పాత్రలు, సినిమాల్లో నటించి.. ఎన్నో అవార్డులు, పురస్కారాలు, రివార్డులు సొంతం చేసుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్న ఆయన.. తన నట విశ్వరూపంతో కొన్ని దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. 


ఇక కమల్ హాసన్ సినిమా విషయానికొస్తే ఆయన తదుపరి సినిమా శంకర్ డైరెక్షన్ లో రాబోతున్న 'భారతీయుడు 2'లో కనిపించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి తాను నటించిన సన్నివేశాలకు కమల్‌ డబ్బింగ్‌ కూడా పూర్తి చేసినట్లు సమాచారం. ఈ మూవీలో కాజల్‌ అగర్వాల్‌, రకుల్ ప్రీత్‌ సింగ్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. త్వరలో ఇండియన్ 2 టీజర్‌ ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కమల్ ప్రముఖ దర్శకుడు మణిరత్నంతో ఓ సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Read Also : యంగ్ టాలెంట్స్ కోసం రామ్ చరణ్ కీలక నిర్ణయం - ఇక నిర్మాతగానూ బిజీ బిజీ