Nara Lokesh Comments in Kakinada: వచ్చే ఎన్నికల్లో గెలిచేది టీడీపీయేనని, మరో 3 నెలల్లో అధికారంలోకి వచ్చి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. యువగళం (Yuvagalam) పాదయాత్రలో భాగంగా ఆదివారం కాకినాడ సెజ్ బాధిత రైతులతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటును పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన పరిశ్రమలను వైసీపీ ప్రభుత్వం తరిమేసిందని మండిపడ్డారు. పరిశ్రమలు ఏర్పాటైతేనే స్థానిక యువతకు ఉద్యోగాలు ఎక్కువగా వస్తాయని, స్థానికులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు ఫోన్ల పరిశ్రమ తీసుకొచ్చానని, అందులో 6 వేల మంది పని చేసేవారని గుర్తు చేశారు. వైసీపీ హయాంలో ఆక్వా ఉద్యోగులు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్తున్నారని, ఈ రంగంపై దృష్టి సారిస్తే 10 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు. కియా పరిశ్రమ వల్ల వేలాది మంది జీవితాల్లో మార్పు వచ్చిందని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధి కల్పనపైనే దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. న్యాయం చేయాలని ప్రశ్నించిన వారిపై ప్రభుత్వం కేసులు పెట్టి హింసిస్తోందని మండిపడ్డారు.


కాగా, మిగ్ జాం తుపాను కారణంగా వాయిదా పడిన యువగళం పాదయాత్ర శనివారం నుంచి తిరిగి ప్రారంభమైంది. శనివారం పెరుమాళ్లపురంలో మత్స్యకారులతో లోకేశ్ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సీఎం జగన్ (CM Jagan) కు వ్యవసాయంపై ఏ మాత్రం అవగాహన లేదని, అలాంటి వ్యక్తికి ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయని ఎద్దేవా చేశారు. సీఎం బటన్లు నొక్కుతూ పాలన గాలికొదిలేశారని మండిపడ్డారు. ప్రజాధనంపై దోచుకునే పనిలో బిజీగా ఉన్నారని, సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కనీసం ప్రాజెక్ట్ గేట్లకు గ్రీజు పెట్టేందుకు కూడా నిధులివ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు విరిగి నీరు వృథాగా పోతున్నా పట్టించుకోవడం లేదని అన్నారు.


'పేదలకు అండగా ఉంటాం'


కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని తొండంగి మండలం ఒంటి మామిడి నుంచి ఆదివారం యాత్ర ప్రారంభం కాగా మిగ్ జాం తుపాను ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. తాటిమోపుపై నుంచి కాలువను దాటి పొలాల్లోని రైతులను పలకరించారు. పంట నష్టం వివరాలపై ఆరా తీశారు. అధికారంలోకి వచ్చాక అందరినీ ఆదుకుంటామన్నారు. మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు మిగ్ జాం తుపానుపై ప్రధాని మోదీకి లేఖ రాశారు. దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. 15 జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపిందని, 22 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని లేఖలో ప్రస్తావించారు. 770 కి.మీల మేర రోడ్లు దెబ్బతిన్నాయని, రూ.10 వేల కోట్ల నష్టం జరిగిందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.


18న యువగళం ముగింపు


అటు, విశాఖలోని అగనంపూడి వద్ద ఈ నెల 18న నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగుస్తుంది. ఈ నెల 20న బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ ముగింపు సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్, బాలకృష్ణ, పార్టీ శ్రేణులు, అభిమానులు హాజరుకానున్నారు.


Also Read: Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం