Diabetic Coma Preventions : ఆరోగ్యం విషయంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేదంటే డయాబెటిక్ కోమాలోకి వెళ్లే అవకాశముంది. ఇంతకీ డయాబెటిక్ కోమా అంటే ఏమిటి? ఏ కారణాల వల్ల ఈ స్థితి సంభవిస్తుంది? దాని లక్షణాలు వంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అసలు డయాబెటిక్ కోమా అంటే ఏమిటి?
డయాబెటిక్ కోమా అనేది మధుమేహ వ్యాధిగ్రస్తుల రక్తంలో అతి ఎక్కువ లేదా తక్కువ స్థాయిలో గ్లూకోజ్ స్థాయిలు ఉన్నప్పుడు అనుభవించే పరిస్థితి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తుల శరీరంలోని కణాలు పనిచేయడానికి గ్లూకోజ్ అవసరమైనప్పుడు.. వాటి స్థాయిలు ఆగిపోవడం వల్ల స్పృహ కోల్పోవచ్చు. దానివల్ల రోగి డయాబెటిక్ కోమాలోకి వెళ్లిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
ఈ సమస్యకు గల కారణాలు ఏమిటి?
రక్తంలో ఉండే హైపర్ గ్లైసీమియా అనే అధిక రక్త చక్కెర మిమ్మల్ని స్పృహ కోల్పోయే స్థాయికి తీసుకెళ్తుంది. దీనివల్ల శరీరం తీవ్రంగా డీహైడ్రేట్ అవుతుంది. మీరు శరీరంలో షుగర్‌ను పెంచే ఫుడ్ ఎక్కువగా తిన్నప్పుడు, ఒత్తిడికి గురైనప్పుడు.. స్టైరాయిడ్స్ తీసుకున్నప్పుడు.. సరైన వ్యాయామం చేయనప్పుడు.. మీ శరీరంలో హైపర్ గ్లైసీమియా పెరగవచ్చు.
శరీరంలో చక్కెర స్థాయిలో పూర్తిగా తగ్గిపోయినప్పుడు.. లేదా హైపర్గ్లైసీమియా ఉత్పత్తి ఎక్కువగా ఉన్నప్పుడు మధుమేహంతో ఇబ్బంది పడినప్పుడు స్పృహ కోల్పోయే ప్రమాదముంది. డాక్టర్లు సూచించిన మందులు రెగ్యూలర్‌గా వేసుకోనప్పుడు.. లేదా సరిగ్గా తినని సమయంలో కూడా ఈ స్పృహ కోల్పోతారు. తద్వార పేషేంట్ డయాబెటిక్ కోమాలోకి వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
ఈ ట్రిగర్ పాయింట్ మరింత డేంజర్
డయాబెటిక్ కీటోయాసిడోసిస్ అనేది కూడా డయాబెటిక్ కోమాలకు గురిచేస్తుంది. మీరు డయాబెటిక్ కీటోయాసిడోసిస్‌తో ఇబ్బంది పడుతున్నప్పుడు.. మీ శరీరంలో పనిచేయడానికి తగినంత ఇన్సులిన్ ఉండదు. కాబట్టి అది శక్తిని పొందేందుకు కొవ్వును విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తుంది. ఇది రక్తప్రవాహంలోకి కీటోన్లను విడుదల చేస్తుంది. ఇది రోగి కోమాలోకి లేదా మరణానికి కూడా దారితీస్తుంది.
మీరు కూల్‌డ్రింక్స్, కొన్ని నిషేదిత మందులు తీసుకోవడం లేదా స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల డయాబెటిక్ కీటోయాసిడోసిస్ వచ్చే ప్రమాదముంది. అంటువ్యాధులు, కొన్ని రకాల వైరస్లు కూడా ఈ ప్రమాదాన్ని పెంచుతాయి.
దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే..
మీరు హైపర్ గ్లైసీమియా లేదా హైపోగ్లైసీమియా లక్షణాలతో ఇబ్బంది పడుతున్నప్పుడు త్వరగా దానికి రెస్పాండ్ కావాలి. లేకుంటే ప్రాణాలు పోయే ప్రమాదముంది. అయితే దాని లక్షణాలు ఎలా ఉంటాయో ముందు మీకు తెలియాలి. హైపర్ గ్లైసీమియా ఉన్నప్పుడు చాలా నీరసంగా ఉంటుంది. విపరీతమైన చెమట, ఆందోళన, ఆకలి పెరగడం లేదా తగ్గడం, శరీరమంతా వణకడం.. కడుపులో వికారం వంటి లక్షణాలు ఉంటాయి. కడుపు నొప్పి, శ్వాసలో ఇబ్బందులు, అలసట, ఎక్కువగా మూత్రవిసర్జనకు వెళ్లడం, నడిచేందుకు కూడా ఓపిక లేకపోవడం, ఆకలి, దాహం పెరగడం వంటివి కూడా ఈ లక్షణాల్లో భాగమే.
కంట్రోల్ చేసేందుకు..
ప్రాణాంతకమైన డయాబెటిక్ కోమాను నివారించాలంటే మీరు కొన్ని సూచనలు ఫాలో అవ్వాలి. మీరు మధుమేహ బాధితులైతే.. కచ్చితంగా మీకు వైద్యులు సూచించిన మందులు వాడాలి. తగినంత నిద్రపోవాలి. ఒత్తిడి తగ్గించుకోవాలి. సరైన సమయానికి తినాలి. వ్యాయామం చేయాలి. పైన చెప్పిన లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా.. వెంటనే వైద్యుని సంప్రదించాలి. ఆలోపు రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ చేసేందుకు మీరు కూడా ప్రయత్నాలు చేయాలి. మీరు ఎంత త్వరగా, తగినంత చురుకుగా దీనిపై స్పందిస్తే మీరు డయాబెటిక్ కోమాలోకి వెళ్లకుండా నిరోధించవచ్చు.
Also Read : సరిగ్గా నిద్రపోవట్లేదా? అయితే ఈ ప్రాణాంతక వ్యాధులు తప్పవు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.