Side Effects of Lack of Sleep : కొందరు అర్థరాత్రైనా నిద్రపోరు. పైగా వారి నిద్ర సమయం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఫోన్ చూసుకుంటూ చాలా మంది తమ నిద్రను నిర్లక్ష్యం చేస్తారు. దీనివల్ల కలిగే మానసిక, శారీరక ఆరోగ్య సమస్యల గురించి వారికి సరైన అవగాహన లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. అయితే నిద్రలేమి కలిగే మానసికంగా, శారీరకంగా కలిగే నష్టం ఏంటో? సమస్యను దూరం చేసుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 


రోగనిరోధక వ్యవస్థ తగ్గిపోతుంది..


రోగనిరోధక వ్యవస్థ అనేది ఆరోగ్యానికి చాలా అవసరం. ఇది తగ్గిందంటే.. అంటువ్యాధులు, అనారోగ్యాలు ఎక్కువైపోతాయి. దీర్ఘకాలిక నిద్రలేమి శరీరంలో సైటోకిన్​ల ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుందని అధ్యయనాలు వెల్లడించాయి. ఇది రోగనిరోధక ప్రతిస్పందనకు కీలకమైన ప్రోటీన్. దీని ఉత్పత్తికి ఆటంకం కలిగి శరీరం ఇన్​ఫెక్షన్లతో సమర్థవంతంగా పోరాడే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో రోగనిరోధక వ్యవస్థ చాలా అవసరం. లేదంటే సీజనల్ వ్యాధులు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. అంతేకాకుండా శరీరంలోని వివిధ రోగాలకు, పునరుత్పత్తిని మెరుగుపరచడానికి నాణ్యమైన నిద్ర అవసరం.


సన్నగిల్లే జ్ఞాపకశక్తి 


క్రమరహితమైన నిద్ర మీ ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. అంతేకాకుండా జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంది. నిద్ర లేకపోవడం వల్ల మతిమరుపు వస్తుంది. చిన్నచిన్న విషయాలను కూడా త్వరగా మరచిపోతారు. రోజుకి కనీసం 7 గంటల నిద్ర లేకుంటే జ్ఞాపకశక్తి సామర్థ్యం తగ్గుతుందని పలు అధ్యయనాలు నిరూపించాయి. ఇవి రోజువారీ పనితీరు, ఉత్పాదకతను ప్రభావితం చేస్తాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక నిద్రలేమి అల్జీమర్స్ వ్యాధి వంటి నాడీ సంబంధిత రుగ్మతలను అభివృద్ధి చేస్తుంది. కాబట్టి మీకు నిద్ర సమస్యలుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.


మానసిక కల్లోలం..


మానసిక ఆరోగ్యం.. నిద్ర ద్వారా ప్రభావితమవుతుంది. ఈ నిద్రలేమి మానసిక ఉల్లాసాన్ని దెబ్బతీస్తుంది. ఆందోళన, నిరాశతో ఉండేలా చేస్తుంది. మానసికంగా ఉన్న ఆరోగ్య సమస్యలను కూడా ఇది తీవ్రతరం చేస్తుంది. 


ఆకలిలో మార్పులు


క్రమరహిత నిద్ర శరీరంలో హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా ఆకలి నియంత్రణను ప్రభావితం చేస్తుంది. లెప్టిన్, గ్రెలిన్ వంటి ఆకలిని నియంత్రించే హార్మోన్లు నిద్ర ద్వారా ప్రభావితమవుతాయి. నిద్రలేమి ఈ హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది అతిగా తినడం లేదా అనారోగ్యకరమైన ఫుడ్ తినేలా మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. ఇది బరువు పెరగడానికి, ఊబకాయం, మధుమేహం  వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. 


హృదయ సంబంధ వ్యాధులు


నిద్రలేమి హృదయ సంబంధ వ్యాధులకు దారి తీస్తుంది. నిద్రలేమి వల్ల చాలా మంది గుండెపోటుకు గురి అవుతున్నట్లు పలు అధ్యయానాలు ఇప్పటికే నిరూపించాయి. తగినంత నిద్ర లేకపోవడం వల్ల రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది శరీరంలో రక్తపోటు, ఒత్తిడి స్థాయిలను పెంచుతుంది. అనతీకాలంలోనే హృదయనాళ వ్యవస్థను దెబ్బతీస్తుంది. 


కాబట్టి నిద్ర ప్రాముఖ్యతను గుర్తించి.. నిద్ర నాణ్యతను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి. ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లు మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా కూడా హెల్తీగా ఉంచుతుంది. దీనికోసం మీరు మెరుగైన నిద్ర అలవాట్లు చేసుకోండి. నిద్రపోయే స్థలం నిద్రకు అనువుగా ఉండేలా చూసుకోండి. పడుకునే ముందు స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయండి. ఇవి నిద్రనాణ్యతను మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది. సమతుల్యమైన ఆహారం తీసుకోవడం వల్ల కూడా మంచి నిద్ర వస్తుంది. ఇవేమి మీ నిద్రను మెరుగుపరచకుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. 


Also Read : కాంచీపురం ఇడ్లీ.. రెసిపీ వెరీ డెడ్లీ