కరోనా మహమ్మారి పేరు చెబితేనే ప్రపంచమంతా చిగురుటాకులా వణికిపోతున్న తొలిరోజుల్లో కోవిడ్19 యోధులకు అన్నం పెట్టిన ఆ చేతులు ఇప్పుడు ప్రభుత్వాన్ని దీనంగా అర్ధిస్తున్నాయి. తనకు రావాల్సిన బిల్లులు చెల్లించి తన కుటుంబాన్ని ఆదుకోవాలని నీరసించిన గొంతు బేలగా అడుగుతోంది. ప్రమాదంలో  చితికి పోయిన తన కాలును చూసైనా  జాలి చూపించండి అంటూ కన్నీటి పర్యంతం అవుతున్నాడు సత్యనారాయణ. ఆరోగ్యం బాగోలేకనో,  ఇబ్బందుల నేపథ్యంలోనో ప్రభుత్వాన్ని అడుగుతున్నాడు అనుకుంటే పొరపాటే. నిజానికి ఆయనకే ప్రభుత్వం సుమారు 8 లక్షల రూపాయలు అప్పు పడింది. చెల్లించాల్సిన బిల్లుల విషయంలో ప్రభుత్వ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించి ఓ కుటుంబం చిత్రం కావడానికి కారణం అయ్యారు. అనంతపురం జిల్లా హిందూపురం లో జరిగిన  ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..


కరోనా మహమ్మారి అంటే ఇప్పుడైతే ఫర్వాలేదు గానీ మొదట వెలుగుచూసిన సందర్భంలో చాలా భయానికి గురి అయ్యే పరిస్థితి ఉండేది. కరోనా పాజిటివ్ కేసు ఒకటి నమోదయింది అంటే చాలు ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులని అందరిని క్వారంటైన్ చేయడం,  వీధులకు విధులు బందు చేయడం తొలి రోజుల్లో మనం చూశాం. మహమ్మారి అంతం చూడడంలో ముందు వరుసలో నిలబడిన వైద్య సిబ్బందికి కూడా కనీసం భోజన సౌకర్యాలు కల్పించేందుకు ఎవరు ముందుకు రాని భయానక రోజులలో హిందూపురంలోని సత్యనారాయణ అనే వ్యక్తి ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తే తాను వైద్య సిబ్బందికి భోజనాలు సరఫరా చేసేందుకు సిద్ధమేనంటూ ముందుకు వచ్చి తన ధైర్యాన్ని చాటుకున్నాడు. 


అప్పటి  రెవెన్యూ అధికారులు కూడా  మొదట భోజనాలు సరఫరా చేయాలని తర్వాత బిల్లులను చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇంకేముంది సత్యనారాయణ తన కేటరింగ్ సర్వీస్ ద్వారా వైద్య సిబ్బందికి రోజూ మూడు పూటలా రకరకాల భోజనాలను సరఫరా చేశాడు. తొలినాళ్లలో మూడు దఫాలుగా రూ.1,40,000 చెల్లించిన అధికారులు తిరిగి చిల్లిగవ్వ కూడా చెల్లించ లేకపోయారు. అధికారుల అలసత్వం కారణంగా భోజనాలకు సరుకులు అప్పులు చేసిన సత్యనారాయణ చేసేదిలేక తాను నిర్మించుకున్న ఇంటిని, భార్యకు చెందిన బంగారాన్ని అమ్మి అప్పులు కట్టేశాడు. అనంతరం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినప్పటికీ వారి దయ సత్యనారాయణ  మీదపడలేదు. 


అధికారుల చుట్టూ తిరిగే ప్రయత్నంలో ఓ సారి ప్రమాదానికి గురై కుడి కాలు విరిగిపోయింది. శస్త్రచికిత్స చేసినప్పటికీ ఉపయోగం లేకపోవడంతో రెండోసారి కూడా మేజర్ ఆపరేషన్ జరిగి ప్రస్తుతం నడవలేని పరిస్థితిలో మంచానికి పరిమితమయ్యాడు. కోట్లాది రూపాయలు కరోనా మహమ్మారి నిర్మూలనకు వ్యయం చేశామని బీరాలు పోతున్న ప్రభుత్వం.. సత్యనారాయణ లాంటి ఎన్నో కుటుంబాలు రాష్ట్రవ్యాప్తంగా చిద్రమైపోయిన దయనీయ పరిస్థితి నెలకొంది. కష్టకాలంలో కడుపు నింపిన సత్యనారాయణ లాంటి వ్యక్తులపై ఇకనైనా పాలకుల కరుణ చూపి బిల్లులు చెల్లించాలని ప్రజలు కోరుతున్నారు. చూద్దాం పాలకులు ఎలా స్పందిస్తారో..
Also Read: YSRCP MLA : భువనేశ్వరి కాళ్లు కన్నీటితో కడుగుతాం.. గౌరవసభలు విరమించుకోవాలన్న వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే !


Also Read: Hyderabad: భార్యకు జాకెట్ కుట్టిచ్చిన భర్త.. తర్వాత లోనికి వెళ్లి ఉరేసుకున్న భార్య.. ఏం జరిగిందంటే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి