Security of Ambani Family: అపర కుభేరుడు అంబానీ ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. అతిరథ మహరధులు ఈ పెళ్లికి తరలివస్తుండడంతో.... ప్రపంచం దృష్టంతా ఈ వివాహ వేడుకపైనే ఉంది. ఆసియాలోనే అత్యంత ధనికుడైన ముఖేష్ అంబానీ..భద్రత ఎవరు చూస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది . చాలామంది ఇప్పుడు అపర కుబేరులు అంబానీ కుటుంబ భద్రతను ఎవరు చూస్తారని నెట్‌లో వెతుకుతున్నారు. అంబానీకి కేంద్రం ఇప్పటికే జడ్ ప్లస్ భద్రత కల్పిస్తోంది. అయితే వారి కుటుంబ సభ్యుల భద్రతను రిటైర్డ్ ఆర్మీ సైనికులు చూస్తారు. అత్యంత పటిష్టంగా ఉండే ఈ భద్రతా వలయాన్ని దాటి చీమ కూడా లోపలికి రాలేదంటే అతిశయోక్తి కాదు. ప్రతీ నిమిషం కంటికి రెప్పలా వీరు అంబానీ కుటుంబానికి, ఆస్తులకు కాపాలా కాస్తుంటారు. భద్రత కోసం అంబానీలు ఓ కంపెనీనే స్థాపించి దాని ద్వారా భద్రతను పటిష్టం చేసుకున్నారు.
ఈగ కూడా వాలకుండా...
ముఖేష్ అంబానీ... రిటైర్డ్ ఆర్మీ సైనికులపై పెద్ద బాధ్యతను పెట్టారు. తమ ఆస్తులు, కుటుంబ భద్రత కోసం అంబానీలు... రిలయన్స్ సంస్థ ఆధ్వర్యంలో గ్లోబల్ కార్పొరేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఇందులో చేరాలనుకునే వారు తప్పకుండా ఆర్మీలో పని చేసిన వారే అయి ఉండాలి. వేరే వారు చేరేందుకు అనుమతి ఇవ్వరు. రిలయన్స్ సెక్యూరిటీ ఆర్మీలోని మాజీ సైనికులు... దేశవ్యాప్తంగా ఉన్న అంటే రిలయన్స్ ఆస్తులతో పాటు వారి కుటుంబ సభ్యులకు భద్రత కల్పిస్తారు. ఈ గ్రూప్‌కు దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్న కంపెనీల్లో వేల మంది పనిచేస్తున్నారు. గ్లోబల్ కార్పొరేట్ సెక్యూరిటీ... రిటైర్డ్ ఆర్మీ సిబ్బందిని రిక్రూట్ చేసుకుంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం ముఖేష్ అంబానీ దాదాపు 16 వేల మంది రిటైర్డ్ ఆర్మీ సిబ్బందిని రిక్రూట్ చేసుకున్నారు. ఈ మాజీ సైనికులే రిలయన్స్ ఆస్తులను కాపాడుతున్నారు. వీరంతా నిరంతరం అప్రమత్తతతో భద్రతలో నిమగ్నమై ఉంటారు. వీరి నిఘాలో అంబానీ కుటుంబ సభ్యులపై ఈగ కూడా వాలదంటే అతిశయోక్తి కాదు. ఈ గ్లోబల్ కార్పొరేట్ సెక్యూరిటీలో జాయిన్ కావడం అంత సులభం కాదు. ఇక్కడ రిక్రూట్‌మెంట్... సైన్యంలో జరిగే విధంగానే జరుగుతుంది. ఈ గ్రూప్‌లో చేరాలనుకునే వారికి మానసిక, శారీరక పరీక్షలు పెడతారు. అనంతరం ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేసుకుంటారు. అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‌ల వివాహ వేడుకకు ప్రపంచం నలుమూలల నుంచి అతిరథ మహారథులు హాజరవుతున్నారు. వీరి భద్రతను కూడా ఈ కంపెనీనే చూస్తోంది.
అంబానీకి జడ్ ప్లస్ భద్రత
2023 సంవత్సరం నుంచి అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీకి ప్రభుత్వం Z ప్లస్ భద్రతను ఇచ్చింది. అంబానీకి 10 మందికి పైగా ఎన్‌ఎస్‌జీ కమాండోలు, పోలీసు సిబ్బంది, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ఇందులో ఉంటారు. ముకేశ్ అంబానీకి భారత్‌తో పాటు విదేశాల్లో కూడా ఈ భద్రత ఉంటుంది. ముఖేష్ అంబానీ ఏ విదేశానికి వెళ్లినా అక్కడికి కూడా ఈ భద్రతా సిబ్బంది వెళతారు.