IAS Trainee Pooja Khedkar: పుణే IAS ట్రైనీ పూజా ఖేడ్కర్‌ వ్యవహారాన్ని విచారించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ ప్యానెల్‌ని ఏర్పాటు చేసింది. ఇప్పటి తనపై వస్తున్న ఆరోపణల గురించి స్పందించిన పూజే ఖేడ్కర్ తొలిసారి మీడియా ముందుకు వచ్చింది. ఇప్పటికైతే నేను ఏమీ మాట్లాడలేనని మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది. కేంద్ర విచారణ గురించి కూడా ఏమీ స్పందించకుండానే వెళ్లిపోయింది. ప్రభుత్వం నిబంధన ప్రకారం తాను ఈ వ్యవహారంపై ఏమీ మాట్లాడడానికి వీల్లేదని, తనకు ఆ అధికారం లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ట్రైనింగ్‌లో ఉండగానే ఇన్ని డిమాండ్‌లు పెట్టడమేంటని అధికారులు తీవ్రంగా పరిగణించారు. అటు కేంద్రం కూడా ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. విచారణ చేపట్టేందుకు ప్రత్యేంగా ప్యానెల్‌ని ఏర్పాటు చేసింది. ఆమెపై వస్తున్న ఆరోపణల్లో నిజమెంత అన్నది తేల్చి చెప్పాలని ఆదేశించింది. ఈ కమిటీలో ఒకే ఒక సభ్యుడు ఉన్నాడు. అడిషనల్ సెక్రటరీ స్థాయి ఉన్న ఓ సీనియర్ అధికారిని ఇందులో సభ్యుడిగా చేర్చింది కేంద్రం. రెండు వారాల్లోగా ఈ కమిటీ కేంద్రానికి ఓ నివేదిక సమర్పించనుంది. ఈ మేరకు కేంద్రం అధికారికంగా ఈ ప్రకటన చేసింది. 


"ఒక సభ్యుడితో కూడుకున్న ప్యానెల్‌ని ఏర్పాటు చేసి పూజా ఖేడ్కర్ వ్యవహారంపై విచారణకు ఆదేశించాం. అడిషనల్ సెక్రటరీ స్థాయి ఉన్న సీనియర్ అధికారికి ఈ ప్యానెల్‌ బాధ్యతలు అప్పజెప్పాం. ఐఏఎస్ పూజా మనోరమ దిలీప్ ఖేడ్కర్‌పై వస్తున్న ఆరోపణల ఆధారంగా ఈ విచారణ కొనసాగుతుంది. రెండు వారాల్లో ఈ కమిటీ ఓ నివేదికను అందజేస్తుంది"


- కేంద్ర ప్రభుత్వం


,స్థలం ఆక్రమించి బంగ్లా నిర్మాణం..


అటు పుణే మున్సిపల్ కార్పొరేషన్ కూడా పూజాపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. స్థలాన్ని కబ్జా చేసి బంగ్లా కట్టుకోగా, ఆ బంగ్లాని కూల్చి వేయాలని నిర్ణయించుకుంది. ఆ పరిసరాలనూ పూర్తిగా బుల్‌డోజర్‌తో కూల్చి వేయనుంది. IAS 2023 బ్యాచ్‌కి చెందిన పూజా ఖేడ్కర్ UPSC లో 841 ర్యాంక్ సాధించింది. కానీ ట్రైనింగ్‌ మొదలు కాగానే వివాదాల్లో చిక్కుకుంది. ప్రైవేట్ ఆడీ కార్‌కి రెడ్, బ్లూ బీకాన్ లైట్ పెట్టించుకుంది. VIP నంబర్‌ ప్లేట్‌ కూడా పెట్టించింది. ట్రైనింగ్‌లో ఉండగా ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు ఉండవు. అయినా సరే పట్టుబట్టి మరీ అన్ని వసతులూ కల్పించాలని డిమాండ్ చేసింది. 


మరో సంచలన విషయమూ వెలుగులోకి వచ్చింది. ఓ కేసులో దొంగను జైల్లో నుంచి వదిలేయాలని DCPపై పూజా ఖేడ్కర్ ఒత్తిడి తీసుకొచ్చినట్టు తేలింది. మే 18వ తేదీన ఇది జరిగినట్టు విచారణలో వెల్లడైంది. దొంగతనం కేసులో అరెస్టైన వ్యక్తిని విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఆ వ్యక్తి దొంగతనం చేయలేదని, అమాయకుడు అని సమర్థించింది. ఓ చిన్న కేసులో అరెస్ట్ అయిన వ్యక్తిని విడుదల చేయమని పూజా ఖేడ్కర్ ఎందుకు చెప్పిందో DCPకి అర్థం కాలేదు. అందుకే ఆమె డిమాండ్‌ని పక్కన పెట్టి ఆ దొంగని జ్యుడీషియల్ కస్టడీకి తరలించాడు. 


Also Read: Viral Video: పుణే ట్రైనీ IAS ఆఫీసర్ తల్లి హల్‌చల్‌, రైతుల భూములు కబ్జా - అడ్డుకున్న వాళ్లకి గన్‌తో వార్నింగ్‌