Anant Ambani Wedding Updates : అంగరంగ వైభవంగా పెళ్లి జరగడం అంటే ఏంటో అనంత్‌ అంబానీ- రాధిక మర్చంట్‌ల వివాహ వేడుక చూస్తే అర్థమైపోతుంది. ఇవాళ అనంత్‌-రాధిక వివాహ వేడుక వైభోగంగా జరగబోతోంది. చాలా ఏళ్లుగా స్నేహితులుగా ఉన్న రాధిక- అనంత్ ఇవాళ మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. ఈ వివాహ వేడుకను కలలో కూడా ఊహించనంత ఘనంగా జరపబోతున్నారు. బాలీవుడ్‌ ప్రముఖులు, ప్రపంచ రాజకీయ నాయకులు, టెక్ సీఈఓలు, అమెరికా రియాలిటీ షో స్టార్‌లు.. ఈ వైభవోపేత వివాహ వేడుకలో పాల్గొనేందుకు ముంబై చేరుకున్నారు. ఈ వివాహ వేడుకకు బ్రిటన్‌ మాజీ ప్రధానులు బోరిస్‌ జాన్సన్‌ ప్రముఖ పారిశ్రామికవేత్త పీటర్‌ డయామండిస్‌, జెఫ్‌ కూన్స్‌, జే షెట్టి, అమెరికా మాజీ విదేశాంగ మంత్రి జాన్‌ కెర్రీ, కెనడా మాజీ పీఎం స్టీఫెన్‌ హార్పర్‌ హాజరవునున్నారు. ఇప్పటికే బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ పెళ్లి కోసం భారత్‌కు వచ్చారు. బ్లెయిర్‌ అంబానీ కుటుంబానికి స్నేహితుడు. ఇప్పటికే హాలీవుడ్‌ నటులు కిమ్ కర్దాషియాన్, ఖోలే కర్దాషియాన్ ముంబైలో అడుగుపెట్టారు. వీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.





బాలీవుడ్‌ తారల హంగామా

బాలీవుడ్ తారలు సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, దీపికా పదుకొనే, అలియా భట్ వివాహ వేడుకలో తళుక్కున మెరవనున్నారు. అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ కూడా హాజరు కానున్నారు. ప్రియాంక చోప్రా-జోనాస్, ఐశ్వర్యారాయ్-బచ్చన్, జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్, రామ్‌చరణ్‌, పవన్‌కల్యాణ్ హాజరుకానున్నారు.  అనంత్‌ అంబానీ- రాధిక మర్చంట్‌ల వివాహ వేడుక మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. రాత్రి 8 గంటల వరకు జరగనుంది. ఫుట్‌బాల్ ఐకాన్ డేవిడ్ బెక్‌హాం-విక్టోరియా దంపతులు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల వివాహనికి వస్తారని తెలుస్తోంది. గతంలోనూ బెక్‌హాం ముఖేష్ అంబానీ ఇంటికి వచ్చారు. 

టాలీవుడ్ హీరో మహేష్ బాబు కూడా ముంబై బయలుదేరాడు.






అనంత్ అంబానీ పెళ్లి ఖర్చు ఎంత 

ఔట్‌లుక్‌ నివేదిక ప్రకారం అనంత్‌ అంబానీ- రాధిక మర్చంట్‌ల వివాహ వేడుకకు ముఖేశ్‌ అంబానీ రూ.4 నుంచి 5 వేల కోట్లు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం అంబానీ కుటుంబం నికర ఆస్తి విలువలో కేవలం 0.05 శాతం మాత్రమే. కొద్ది రోజుల క్రితమే ప్రీ వెడ్డింగ్‌తో ఆరంభమైన వేడుకలు ఇప్పుడు పతాకస్థాయికి చేరాయి. జూలై 8న యాంటిలియాలో జరిగిన హల్దీ వేడుకలో రాధిక ధరించిన నగలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఇవాళ ఆరంభం కానున్న వేడుకలు మరో మూడు రోజులు కొనసాగునున్నాయి. జూలై 13న శుభ్ ఆశీర్వాద్, జూలై 14న మంగళ్ ఉత్సవ్ నిర్వహిస్తారు.