Anakapalle Crime News: అనకాపల్లి జిల్లాలో అత్యంత దారుణ రీతిలో ఓ హత్య జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు.. ఓ వ్యక్తిని ముక్కలు ముక్కలుగా నరికి చంపారు. కాళ్లు, చేతులు,తల, మెండం వేరు చేశారు. ఒక్కో భాగాన్ని ఒక్కో చోట పాడేశాడు. మృతదేహం భాగాలను గుర్తించిన స్థానికులు... పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు.  


అసలేం జరిగిందంటే..? 


అనకాపల్లి జిల్లాలోని ఎలమంచిలి మున్సిపాలిటీ కొత్తపాలెం సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికిన దుండగులు తమ, మొండం, కాళ్లను వేర్వేరుగా పడేశారు. ఎలమంచిలి కొత్తపాలెం బ్రిడ్జి కింద శరీర భాగాలు గుర్తించిన స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురైన వ్యక్తి వివరాలు ఇంకా తెలియ రాలేదు. అది తెలుసుకునేందుకే పోలీసులు చాలా కష్టపడుతున్నారు. అలాగే ఈ హత్య ఎవరు, ఎందుకు చేశారో తెలుసుకునేందుకు కృషి చేస్తున్నారు. క్రికెట్ ఆడేందుకు వెళ్లిన స్థానిక యువకులు మృతదేహాన్ని మొదటగా చూసి పోలీసులకు సమాచారం అందించారు. 


ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలో యువతి ఆత్మహత్య


ప్రేమ పెళ్లి చేసుకున్న ఆ జంట ప్రయాణం కొంత కాలం బాగానే సాగింది. అనంతరం వారి మధ్య కలహాలు మొదలయ్యాయి. దీంతో ఆ యువతి ఈగల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా ఎ.పోలవరం గ్రామానికి చెందిన వనపర్తి సతీష్‌కు అదే గ్రామానికి చెందిన దేవికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి మూడు నెలల పాప కూడా ఉంది. కొంత కాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. బుధవారం సతీష్‌ పనికి వెళ్లి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో సతీష్, దేవి మధ్య మరోసారి గొడవ జరిగింది. అనంతరం సతీష్‌ తిరిగి పనికి వెళ్లిపోయాడు.


ఈగల మందు తాగి బలవన్మరం చేసుకున్న దేవి..


కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన దేవి ఇంట్లో ఉన్న ఈగలమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అపస్మారక స్థితిలో ఉన్న దేవిని గమనించిన అత్త నిర్మల గమనించి, కుటుంబ సభ్యులతో కలిసి ఆమెను జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. అయితే ఈ ఘటనపై దేవి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవి, సతీష్‌లది ప్రేమ వివాహం అని, అయితే సతీష్‌ వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో వీరి మధ్య తరచూ గొడవలు జరిగేవని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై ఇటీవల దేవి కుటుంబ సభ్యులు సతీష్ ను అడిగితే, దేవిని కొట్టాడని దీంతో మనస్తాపం చెంది ఈగల మందు తాగిందని ఫిర్యాదులో  తెలిపారు. అయితే సతీష్‌ బలవంతంగా తన చెల్లితో ఈగల మందు తాగించాడనే అనుమానం కూడా ఉందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.