Foreign Portfolio Investors: చైనా, అమెరికా సహా ప్రపంచంలోని కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో కోవిడ్ ఇన్‌ఫెక్షన్ కేసులు పెరగడం; అమెరికా & యూరప్‌ మీద మాంద్యం నీలినీడల ఆందోళనల మధ్య విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (FPIలు) ఇండియన్‌ ఈక్విటీల మీద శీతకన్నేశారు. 2023 జనవరి మొదటి రెండు వారాల్లోనే ‍‌(జనవరి 2-13 తేదీల మధ్య) మన స్టాక్ మార్కెట్ల నుంచి రూ. 15,068 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మేశారు. జనవరిలో జరిగిన 10 ట్రేడింగ్ సెషన్లలో, కేవలం రెండు రోజుల్లో మాత్రమే FPIలు నికర కొనుగోలుదార్లుగా ఉన్నారు.


అంతకు ముందు, 2022 డిసెంబర్‌లో స్టాక్ మార్కెట్లలో FPIలు రూ.11,119 కోట్ల నికర కొనుగోళ్లు చేశారు. నవంబర్‌లో రూ. 36,239 కోట్ల విలువైన నికర పెట్టుబడులు పెట్టారు. 


గత కొన్ని వారాలుగా భారతీయ స్టాక్ మార్కెట్ల పట్ల ఎఫ్‌పీఐలు ఆచితూచి (cautious stance) వ్యవహరిస్తున్నారు. ప్రపంచ స్థూల ఆర్థిక ఆందోళనలతో పాటు, మరికొన్ని రోజుల్లో ప్రకటించనున్న కేంద్ర బడ్జెట్‌ కూడా విదేశీ మదుపుదార్ల అప్రమత్తతకు కారణం.


కోటక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ ఈక్విటీ రీసెర్చ్ (రిటైల్) హెడ్ శ్రీకాంత్ చౌహాన్ చెప్పిన ప్రకారం సమీప భవిష్యత్తులో ఎఫ్‌పీఐల ఇన్‌ ఫ్లోస్‌ అస్థిరంగా ఉంటాయి. 


FPI ఫ్లోస్‌ పరంగా 2022 పరమ చెత్త సంవత్సరం
2022 మొత్తంలో, ఫారిన్‌ ఇన్వెస్టర్లు భారతీయ స్టాక్ మార్కెట్ల నుంచి 1.21 లక్షల కోట్ల రూపాయలను ఉపసంహరించుకున్నారు. దీనికి ప్రధాన కారణం ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను దూకుడుగా పెంచడం, ముఖ్యంగా ఫెడరల్ రిజర్వ్ దూకుడు వైఖరి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ముడి చమురు ధరలలో అస్థిరత, కమొడిటీల ధరలు పెరగడం. అంతకుముందు మూడు సంవత్సరాలలో, భారతీయ స్టాక్ మార్కెట్లలో FPIలు నికర పెట్టుబడిదారులుగా ఉన్నారు.


“ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఇప్పటికీ కోవిడ్ ముప్పు ఉంది. ఇది కాకుండా, అమెరికాలో మాంద్యం గురించి ఆందోళనలు భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో పెట్టుబడులు పెట్టకుండా ఎఫ్‌పీఐలను నిరోధిస్తున్నాయి. జనవరిలో, ఈక్విటీలలతో పాటు, బాండ్ మార్కెట్ నుంచి కూడా విదేశీ పెట్టుబడిదార్లు రూ. 957 కోట్లను విత్‌డ్రా చేశాయి. భారత్‌తో పాటు ఇండోనేషియాలోనూ ఎఫ్‌పీఐల పెట్టుబడులు ప్రతికూలంగా ఉన్నాయి. అయితే.. ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియా, థాయిలాండ్ మార్కెట్లలో నికర కొనుగోలుదార్లుగా ఉన్నారు" - మార్నింగ్‌స్టార్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్-మేనేజర్ రీసెర్చ్ హిమాన్షు శ్రీవాస్తవ


అతి పెద్ద బాధిత రంగం ఐటీ
2022లో విదేశీ పెట్టుబడులు వెనక్కు వెళ్లిపోయిన అతి పెద్ద సెక్టార్‌ ఐటీ రంగం. ఇన్ఫోసిస్, టీసీఎస్‌, విప్రో సహా ₹72,000 కోట్ల విలువైన ఐటీ షేర్ల మార్కెట్‌లో విదేశీయులు అమ్మేశారు. ఈ అమ్మకాల తర్వాత, 2022 డిసెంబరు 31 నాటికి, విదేశీ సంస్థల మొత్తం పెట్టుబడుల్లో IT రంగం ఎక్స్‌పోజర్‌ 15.43% నుంచి 10.45%కి పడిపోయింది. తమ పోర్ట్‌ఫోలియోల నుంచి ఏకంగా 5 శాతం ఐటీ స్టాక్స్‌ను ఒక్క ఏడాదిలోనే డంప్‌ చేశారు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.