Amruta Fadnavis on Modi: 


నవ భారతానికి జాతి పిత..


మహారాష్ట్ర డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ సతీమణి అమృత  ఫడణవీస్...ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నవ భారతానికి ప్రధాని మోడీ జాతిపిత అని ఆమె ఓ కార్యక్రమంలో కామెంట్ చేశారు. నాగ్‌పూర్‌లో Abhirup Court పేరిట జరిగిన ఓ కార్యక్రమం జరిగింది. మహాత్మా గాంధీ గురించి ప్రస్తావన రాగా...అమృత ఇలా స్పందించారు. "భారత్‌కు ఇద్దరు జాతిపితలు ఉన్నారు. ఒకప్పుడు మహాత్మా గాంధీ. ఇప్పటి నవ భారతానికి ప్రధాని నరేంద్ర మోడీ" అని అన్నారు. ఇప్పుడే కాదు. గతంలోనూ ఓ సందర్భంలో అమృత ఫడణవీస్ ఇదే వ్యాఖ్యలు చేశారు. మోడీని గాంధీతో పోల్చారు. అప్పట్లోనూ రాజకీయ పరంగా ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఇప్పుడు కూడా మళ్లీ అవే వ్యాఖ్యలు చేసి రాజకీయాల్ని మరోసారి వేడెక్కించారు. ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇక ఈ వ్యాఖ్యలపై విమర్శలు వస్తాయని, వాటిని పట్టించుకోననీ అన్నారు. "నేనెప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడలేదు. అలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. వాటిపై నాకు పెద్దగా ఆసక్తి కూడా లేదు. సాధారణ ప్రజలెవరూ నన్ను ట్రోల్ చేయరు. కేవలం శివసేన, ఎన్‌సీపీ ఇలాంటి పనులు చేస్తూ ఉంటుంది. వాళ్లకు అంత ప్రాధాన్యత ఇవ్వడం అనవసరం. నేను భయపడేది కేవలం మా అమ్మకు, అత్తమ్మకు అంతే. మిగతా ఎవరినీ లెక్క చేయను" అని స్పష్టం చేశారు. ఇక తన భర్త దేవేంద్ర ఫడణవీస్ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అమృత. ఆయన 24 గంటలూ రాజకీయాల గురించే ఆలోచిస్తారని చెప్పారు. "నాకు రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి ఏ మాత్రం లేదు. రాజకీయాల కోసం నేను 24 గంటలు పని చేయలేను. నా భర్తం మాత్రం ఎప్పుడూ రాజకీయాల్లోనే మునిగి తేలుతుంటారు. సమాజం కోసం పని చేస్తుంటారు. ఇలా తమ జీవితాన్ని అంకితం చేసిన వాళ్లు మాత్రమే రాజకీయాలకు అర్హులు. దేవేంద్ర ఫడణవీస్‌కు ముఖ్యమంత్రి పదవి తప్పకుండా దక్కాలి" అని వెల్లడించారు. 


గతంలో యూపీ మంత్రి...


గతంలో ఉత్తరప్రదేశ్ మంత్రి గులాబ్ దేవి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ప్రధాని మోదీ దేవుడి అవతారం అని...ఆయనకు నచ్చినన్నాళ్లు పీఎం పదవిలో కొనసాగుతారని అన్నారు గులాబ్ దేవి. "మోదీ ఓ అవతార పురుషుడు. ఆయనకు అత్యద్భుతమైన ప్రతిభ ఉంది. ఆయనతో ఎవరూ పోటీ పడలేరు. ఆయన కోరుకుంటే బతికున్నంత కాలం ప్రధాని పదవిలోనే కొనసాగొచ్చు" అని వివరించారు. మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తికి ప్రధాని పదవి ఎందుకు ఇవ్వడం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇదే విషయాన్నీ ప్రస్తావించిన గులాబ్ దేవి.."ఇలాంటి వ్యాఖ్యలతో ఒరిగేదేం లేదు. ఆయన ఓ అత్యున్నతమైన వ్యక్తి. తన ప్రతినిధిగా దేవుడే ఆయనను భూమి మీదకు పంపారు" అని అన్నారు. ఆయన ఏదంటే అది చేస్తారని, దేశమంతా ఆయనను అనుసరిస్తోందని అన్నారు. ప్రజలు ఆయనను యాక్సెప్ట్ చేస్తున్నారనటానికి ఇంతకన్నా గొప్ప సాక్ష్యం ఏముందని ప్రశ్నించారు. 


Also Read: Corona Cases: భారత్‌లోనూ కొవిడ్ కొత్త వేరియంట్ గుబులు, ముగ్గురికి వ్యాప్తి