Gujarat Corona Cases:


గుజరాత్‌లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BF.7  వెలుగులోకి వచ్చింది. ఓ NRI మహిళకు కొవిడ్ టెస్ట్ చేయగా...పాజిటివ్‌గా తేలింది. ఆమెకు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BF.7 సోకిందని వైద్యులు వెల్లడించారు. సెప్టెంబర్‌లోనే ఈ మహిళకు ఈ వేరియంట్ సోకిందని తేలింది. గుజరాత్‌లో ఇప్పటికే ఈ వేరియంట్ కేసులు రెండు నమోదయ్యాయి. వీరితో పాటు...ఒడిశాకు చెందిన ఓ వ్యక్తికి ఇదే కొవిడ్ వేరియంట్ బారిన పడ్డారు. చైనాలో ఇప్పటికే ఈ వేరియంట్ తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. ఈ సమయంలోనే భారత్‌లోనూ కేసులు నమోదవడం కలవర పెడుతోంది. సెప్టెంబర్‌లో NRI మహిళకు కొవిడ్ సోకగా...ఆ వైరస్ శాంపిల్‌ని ల్యాబ్‌కు పంపారు. గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్స్ సెంటర్‌లో పరిశోధించగా...అది BF.7 వేరియంట్ అని తేలింది. ప్రస్తుతం చైనాలో ఇదే వేరియంట్ అక్కడి ప్రజల్ని సతమతం చేస్తోంది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. చైనాలో ఆ స్థాయిలో కరోనా కేసులు పెరగటానికి ఈ వేరియంటే కారణమని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.


"BF.7 వేరియంట్ చైనాలో చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. కానీ....అక్కడి ప్రజలు ఇప్పటికే వ్యాకిన్‌లు తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీని పెద్దగా దెబ్బ తీయడం లేదు" అని కొందరు వైద్యులు వెల్లడించారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ BA.5కి BF.7 సబ్ వేరియంట్. చాలా తీవ్రంగా, వేగంగా ఈ వేరియంట్ వ్యాప్తి చెందుతుంది. ఇన్‌క్యుబేషన్ పీరియడ్ తక్కువే అయినప్పటికీ..ప్రభావం మాత్రం ఎక్కువే. వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్లకూ ఇదే వేరియంట్ మళ్లీ సోకే ప్రమాదముంది. ఇప్పటికే పలు దేశాల్లో ఈ వేరియంట్‌ను గుర్తించారు. అమెరికా, బ్రిటన్‌తో పాటు ఐరోపా దేశాల్లోనూ దీని బారిన పడుతున్నారు. బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్‌లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. 


కేంద్రం అలర్ట్..


ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని వస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సమీక్ష సమావేశం నిర్వహించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ప్రకటన చేసింది. వైరస్ వ్యాపించకుండా రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని ప్రభుత్వం సూచించింది. కోమోర్బిడిటిస్‌తో బాధపడే  పెద్దవాళ్ళ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, ప్రికాషన్ డోసులు తీసుకోవాలని తెలిపింది. విదేశీ ప్రయాణాల విషయంలో ఎలాంటి మార్పులు లేవని తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుక్ మాండవీయ నేతృత్వంలో జరిగిన సమీక్ష సమావేశం అనంతరం  నీతి అయోగ్ సభ్యుడు వీకే పాల్ మాట్లాడారు. 



" మీరు బయటి ప్రదేశాలు, రద్దీ ప్రాంతాల్లో ఉన్నప్పుడు మాస్క్ తప్పకుండా ధరించండి. కొమోర్బిడిటిస్‌తో బాధ పడుతున్న వాళ్ళు,పెద్ద వాళ్ళు ఇది పాటించడం చాలా ముఖ్యం. కేవలం 27-28 శాతం ప్రజలు మాత్రమే ప్రికాషన్ డోసులు తీసుకున్నారు. నేను అందరనీ మరి ముఖ్యంగా పెద్ద వయస్సు వ్యక్తులను ప్రికాషన్ డోస్ తీసుకోవాలని కోరుతున్నాను. ప్రికాషన్ డోస్ తీసుకోవడం అందరికి ముఖ్యం.                                                  "
- వీకే పాల్, నీతి అయోగ్ సభ్యుడు