Amritpal Singh News: పరారీలో ఉన్న వివాదాస్పద మతబోధకుడు, ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు ఇప్పటికీ గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు. రహదారులపై భారీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా, అమృత్ పాల్‌ను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారని, బూటకపు ఎన్‌కౌంటర్ చేయొచ్చని పరారీలో ఉన్న ఖలిస్తానీ నాయకుడి సంస్థకు చెందిన న్యాయవాది ఆరోపించారు. అమృతపాల్ మామ హర్జీత్ సింగ్, డ్రైవర్ హర్‌ప్రీత్ సింగ్ సోమవారం పోలీసులకు లొంగిపోయారు. అయితే అమృతపాల్ సింగ్ మాత్రం పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. పంజాబ్ పోలీసులు వేర్పాటువాద నేత నలుగురు సన్నిహితులను అరెస్టు చేసి అస్సాంలోని దిబ్రూగఢ్‌కు పంపారు. వీరిపై జాతీయ భద్రతా చట్టం కింద చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు. 


అజ్నాలా కేసులో తొలి కేసు నమోదు..


అజ్నాలా ఘటనకు సంబంధించి ఆనంద్‌పూర్ ఖల్సా ఫోర్స్ పేరుతో ప్రైవేట్ ఆర్మీని కలిగి ఉన్న అమృతపాల్ సింగ్‌పై మొదటి కేసు నమోదైంది. ఫిబ్రవరి 23వ తేదీన పంజాబ్‌లోని అమృత్‌ సర్‌లోని అజ్నాలా వద్ద అమృత్ పాల్ సింగ్ మద్దతుదారులకు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. తన సహచరుల్లో ఒకరైన లవ్‌ప్రీత్ విడుదల కోసం అమృతపాల్ తన మొత్తం సైన్యంతో కలిసి అజ్నాలా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. ఈ సమయంలో అమృత్ పాల్ మద్దతుదారులు ఆయుధాలు, కత్తులను వాడారు. బారికేడ్లను బద్దలు కొట్టి మరీ పోలీసులపై దాడి చేశారు. ఇందులో సుమారు 6 మంది సైనికులు గాయపడ్డారు. చివరికి అజ్నాలా పోలీసులు.. దుండగుల ముందు ఓటమిని అంగీకరించి అమృత్ పాల్ సన్నిహితురాలు లవ్‌ప్రీత్‌ను విడుదల చేశారు. ఈ రచ్చకు సంబంధించి అమృత్ పాల్‌పై తొలి కేసు నమోదు అయింది. అమృత్ పాల్ సింగ్ మాజీ సన్నిహితుడు వారిందర్ సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు అమృత్ పాల్ సింగ్‌పై 365, 379బి, 323, 506, 148, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.


అజ్నాలా కేసులో ఎలాంటి శిక్ష విధించే అవకాశం ఉంది?


ఈ కేసులో ఖలిస్తానీ నేత సహా ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఐపీసీ సెక్షన్ 365 కిడ్నాప్‌ కేసుతో.. ఏడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దొంగతనానికి హాని కలిగించే ఉద్దేశ్యంతో లేదా హత్య చేయాలనే ఉద్దేశ్యంతో వ్యవహరిస్తే ఐపీసీ సెక్షన్ 379బీకింద కేసు పెడతారు. ఇది మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే ఛాన్స్ ఉంది. ఐపీసీ సెక్షన్ 323లో ఎవరైనా స్వచ్ఛందంగా మరొకరికి గాయాలు లేదా నష్టాలు కల్గించినట్లయితే.. ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా వెయ్యి రూపాయల జరిమానా లేదా రెండూ విధిస్తారు. సెక్షన్ 506 ఎవరినైనా క్రిమినల్ బెదిరింపులకు పాల్పడినందుకు 2 సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.


ఇపీసీ సెక్షన్ 148 ప్రకారం.. మరణానికి కారణమయ్యే మారణాయుధాలతో అల్లర్లకు పాల్పడితే మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా వేస్తారు. ఇందులో రెండు శిక్షలు కూడా ఉండవచ్చు. చట్టవిరుద్ధంగా గుమికూడడం వల్ల సంఘటితంగా ఉండటం వల్ల 149 సెక్షన్ విధించారు. ఇందులో గుంపులో పాల్గొన్న ప్రతి వ్యక్తిపై శిక్షకు అర్హులే అవుతారు. 


ద్వేషపూరిత ప్రసంగం కేసు కూడా నమోదు.. 


వేర్పాటువాద నాయకుడు అమృత్ పాల్ సింగ్‌పై కూడా రెండు విద్వేష పూరిత ప్రసంగ కేసులు నమోదు అయ్యాయి. ఉద్వేగ భరితమైన ప్రసంగం చేసినందుకు ఐపీసీ సెక్షన్ 153ఏ, 153ఏఏ కింద కేసు నమోదు చేశారు. అదే సమయంలో కొన్ని సందర్భాల్లో సెక్షన్ 505 కూడా జోడిస్తారు. ఈ కేసులలో 5 సంవత్సరాల వరకు శిక్ష, జరిమానా విధించే నిబంధన ఉంది. జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద వారిస్ పంజాబ్ దే చీఫ్‌ పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వాస్తవానికి అతని సన్నిహితులు నలుగురిపై ఎన్ఎస్ఏ కింద చర్యలు తీసుకున్నారు.


ఎన్ఎస్ఏలో బెయిల్ ఎప్పుడు లభిస్తుంది?


జాతీయ భద్రతా చట్టం ప్రకారం దేశ భద్రతకు ముప్పు కలిగించే అవకాశం లేదా ఒక వ్యక్తి దేశానికి ముప్పుగా మారే అవకాశంపై ఉంటే వారిపై చర్యలు తీసుకుంటారు. ఇది కోర్టులో రుజువైతే ఏడాది పాటు దోషికి బెయిల్ లభించదు. ఆ వ్యక్తి నుంచి దేశ భద్రతకు ఎటువంటి ముప్పు ఉండదని కోర్టు భావించే వరకు అతను జైలులోనే ఉంటాడు.


ఆయుధ చట్టంలోనూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు.. 


ఆనంద్‌పూర్ ఖల్సా ఫోర్స్‌తో సంబంధం ఉన్న వ్యక్తుల నుంచి అక్రమ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నందుకు అమృత్ పాల్ సింగ్‌తో సహా పలువురు మద్దతుదారులపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆయుధాల చట్టంలోని సెక్షన్ 25 ప్రకారం ఏడేళ్ల జైలు శిక్ష నుంచి యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంది. ఈ కేసులో జరిమానా కూడా విధించవచ్చు.