Modi The Immortal : ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న‌ ఆదరణ, గౌరవం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రంలేదు. అనేక‌మంది దేశాధినేత‌లు నిత్యం ఆయ‌న్ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతూ ఉంటారు. అతి తక్కువ సమయంలో ప్రపంచంలోనే అగ్రనేతగా ఎదిగిన మోదీకి ఎన్నో దేశాల్లో అభిమానులున్నారు. తాజాగా చైనాలో భార‌త ప్ర‌ధానికి భారీ క్రేజ్ ఉంద‌ని.. ఆ దేశ ప్ర‌జ‌లు ఆయ‌న‌ను అసాధార‌ణ వ్య‌క్తిగా భావిస్తున్నార‌నే విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ప్ర‌ముఖ అమెరిక‌న్ మ్యాగ‌జీన్ ‘ద డిప్లొమాట్‌’ ఈ ఇందుకు సంబంధించిన క‌థ‌నాన్ని ప్ర‌చురించింది.


‘ద డిప్లొమాట్‌’లో ‘చైనాలో భారత్‌ను ఎలా చూస్తున్నారు?’ అనే శీర్షికన జర్నలిస్టు ము షుంషాన్‌ రాసిన వ్యాసంలో ఈ వివరాల‌ను వెల్లడించారు. చైనీస్‌ సోషల్‌ మీడియాను షుంషాన్‌ విశ్లేషిస్తుంటారు. ముఖ్యంగా చైనాలో విశేష ఆద‌ర‌ణ ఉన్న సినా వీబో యాప్‌ను ఆయ‌న‌ విశ్లేషణ చేస్తుంటారు. ఈ యాప్‌కు 58 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ప్రపంచంలోని పెద్ద దేశాలన్నింటితో మోదీ చక్కటి సంబంధాలు కొన‌సాగిస్తున్నారని చైనీయులు భావిస్తున్నట్లు త‌న క‌థ‌నంలో షుంషాన్‌ తెలిపారు. అంతేకాకుండా మోదీ చాలా భిన్నమైన వ్యక్తి అని చైనా నెటిజన్లు నమ్ముతున్నాని.. ఆయనకు అసాధారణ సామర్థ్యాలు ఉన్నాయని భావిస్తున్నార‌ని పేర్కొన్నారు. త‌మ సామాజిక మాధ్యమాల్లో చైనీయులు మ‌న ప్ర‌ధాన‌మంత్రికి ‘మోదీ లావోగ్జియన్‌’ అని ముద్దు పేరు పెట్టుకున్నార‌ని షుంషాన్ త‌న క‌థ‌నంలో పేర్కొన్నారు. లావోగ్జియన్‌ అంటే అసాధారణ సామర్థ్యమున్న వృద్ధుడైన దివ్య పురుషుడు అని అర్థం.


 20 ఏళ్ల నుంచీ అంతర్జాతీయ మీడియా వార్తలను తాను అందిస్తున్నానని పేర్కొన్న షుంషాన్.. చైనీయులు ఒక విదేశీ నేతకు ముద్దు పేరు పెట్టడం ఎప్పుడూ చూడ‌లేద‌ని స్ప‌ష్టంచేశారు. చైనా ప్రజల దృష్టిలో న‌రేంద్ర‌మోదీకి ప్రత్యేక స్థానముందని తెలిపారు. ఇక ఈ క‌థ‌నంలో ఆయ‌న‌ మోదీని ఆకాశానికెత్తేశారు. ఆయన మిగిలిన నేతలకంటే విభిన్నంగా ఉంటార‌ని.. ఆయన వస్త్రధారణ, రూపం అసాధారణంగా ఉంటాయని, ఆయన విధానాలూ గత నేతలకన్నా భిన్నంగా ఉంటాయని తెలిపారు. అమెరికా, రష్యా, దక్షిణ దేశాలతో న‌రేంద్ర మోదీ స్నేహ పూర్వ‌కంగా మెలగుతార‌ని చైనా దేశ‌స్థులు భావిస్తార‌ని షుంషాన్‌ వివరించారు. కాగా.. చైనాలో ట్విటర్‌కు పోటీగా వచ్చిన ‘సైనా వీబో’లో న‌రేంద్ర మోదీ 2015లో చేరారు. ఆయనకు 2.44 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. అయితే చైనా యాప్‌లపై నిషేధంలో భాగంగా 2020 జులై తర్వాత ఆయన తన ఖాతాను తొల‌గించారు. 


కాగా.. అతి తక్కువ సమయంలో ప్రపంచంలోనే అగ్రనేతగా ఎదిగిన మోదీని ఎన్నో దేశాల మీడియా సంస్థ‌లు ప్ర‌శంసించాయి. భారత్‌పై విషం చిమ్మే పాకిస్థాన్ మీడియా కూడా గ‌తంలో మన ప్రధానిని కొనియాడుతూ ఆకాశానికెత్తేసింది. ప్రపంచాన్ని ప్ర‌భావితం చేసే స్థితికి భారత్​ను మోదీ తీసుకెళ్లార‌ని ఆ దేశానికి చెందిన ప్రముఖ వార్తాసంస్థ 'ది ఎక్స్​ప్రెస్​ ట్రిబ్యూన్‌'  ప్ర‌శంసించింది. ప్రధాని మోదీ నేతృత్వంలో.. భారతదేశం అంతర్జాతీయ స‌మాజాన్ని ప్ర‌భావితం చేసే శ‌క్తిగా ఎలా రూపొందుతోంద‌న్న అంశాన్ని విశ్లేషించింది. మోదీ నాయ‌కత్వంలో.. ఇండియా ఎంతో నైపుణ్యంగా వ్యవహరించి తన జీడీపీని 3 ట్రిలియన్​ డాలర్లకు పెంచుకుందని అని పేర్కొంది. అభివృద్ధి పథంవైపు దూసుకెళుతోందని స్పష్టం చేసింది. తాజాగా దేశాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణపూరిత వాతావ‌ర‌ణం నెల‌కొన్నా చైనా ప్ర‌జ‌లు మాత్రం మోదీని ఆరాధిస్తుండ‌టం ఆయ‌న‌కు విదేశాల్లో ఉన్న క్రేజ్‌ను ప్ర‌తిబింబిస్తోంది.