ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణల వల్ల ప్రస్తుతం ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు ఈడీ ఎదుట విచారణకు నేడు హాజరు కావాల్సి ఉంది. మూడు రోజుల క్రితమే (మార్చి 16న) హాజరు కావాల్సి ఉండగా, ఆమె విచారణకు వెళ్లకపోవడంతో నేడు (మార్చి 20) రావాలని ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇవాళ కూడా ఆమె ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట విచారణకు హాజరవుతారా అనే అంశంపై ఉత్కంఠ నెలకొని ఉంది. 


ఈడీ విచారణ ఉన్నందున కవిత నిన్న (మార్చి 19) సాయంత్రమే హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనం అయ్యారు. భర్త అనిల్‌, సోదరుడు, మంత్రి కేటీఆర్‌, ఎంపీలు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌, వద్దిరాజు రవిచంద్ర, అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ రామచంద్రరావు, పలువురు న్యాయవాదులతో కలిసి కవిత ఢిల్లీకి చేరుకున్నారు. నేరుగా తుగ్లక్‌ రోడ్డులోని తన తండ్రి, సీఎం కేసీఆర్‌ అధికారిక నివాసానికి చేరుకున్నారు. విచారణలో ఏ ప్రశ్నలు అడుగుతారు? సమాధానాలు ఏం చెప్పాలి? అసలు విచారణకు హాజరు కాకపోతే పరిస్థితి ఏంటి? అనే అంశాలపై రాత్రి వీరంతా సుదీర్ఘంగా చర్చించుకున్నట్లు తెలిసింది. ఈ నెల 11న మొదటిసారి ఈడీ విచారణకు హాజరైన కవిత రెండోసారి ఈ నెల 16న గైర్హాజరైన విషయం తెలిసిందే. నేడు హాజరవుతారా? లేదా? అనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.


16న ఢిల్లీకి వచ్చినా ఈడీ ఎదుట గైర్హాజరు
మార్చి 16న కూడా ఢిల్లీకి వచ్చినా కూడా ఈడీ విచారణకు హాజరు కాకుండా తన తరఫు న్యాయవాదిని పంపించారు. తాను ప్రత్యక్షంగా హాజరు కావాలా? లేదంటే ప్రతినిధులను పంపాలా? అనే విషయంపై నోటీసుల్లో స్పష్టత లేదంటూ ఈడీకి ఆమె లేఖ రాశారు. ఈ లేఖను సోమా భరత్‌ ఈడీ అధికారులకు అదే రోజు అందజేశారు. ఆ తర్వాత ఈ నెల 20న విచారణకు ప్రత్యక్షంగా హాజరు కావాలని మరోసారి ఈడీ ఆదేశించింది. అయితే తాను మహిళను అయినందున తనను ఇంటి వద్ద విచారించాలంటూ కవిత సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌ 24న విచారణకు రానుంది. ఆ తర్వాతే విచారణకు హాజరవుతానని ఈడీకి విన్నవించుకున్నారు. కానీ, ఇందుకు అధికారులు ఒప్పుకోలేదు.


నేడు మరోసారి సీబీఐ ప్రత్యేక కోర్టుకు రామచంద్ర పిళ్లై
ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్టయిన అరుణ్‌ రామచంద్ర పిళ్లైని నేడు (మార్చి 20) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు మరోసారి రౌజ్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ నెల 16న పిళ్లై కస్టడీని మూడు రోజులపాటు పొడిగిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ గడువు నేటితో ముగియనుంది. దీంతో ఆయనను సోమవారం మధ్యాహ్నం సీబీఐ ప్రత్యేక కోర్టుకు తీసుకురానున్నారు. ఈ కేసులో ఎమ్మెల్సీ కవితతో పాటు పిళ్లైని కూడా విచారించాలని ఈడీ అధికారులు భావించారు. కానీ, 16న కవిత గైర్హాజరు కాకపోవడంతో సోమవారం విచారణకు హాజరు కావాలని అదే రోజు కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది.