శరీరానికి అత్యవసరమైన పోషకాల్లో ప్రోటీన్ మొదటిది. ప్రోటీన్ లోపిస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు దాడి చేస్తాయి. అందుకే ప్రోటీన్ నిండిన ఆహారాన్ని తినమని వైద్యులు సూచిస్తూ ఉంటారు. అయితే ప్రోటీన్ కోసం నాన్ వెజిటేరియన్లు ఎక్కువగా చికెన్, గుడ్లు మీద ఆధారపడుతుంటే, వెజిటేరియన్లు పనీర్, పప్పులు తింటుంటారు. అయితే చికెన్, పనీర్‌లలో ఏది ఆరోగ్యకరమైనది? ఏది పుష్కలంగా ప్రోటీన్‌ని అందిస్తుంది? ఈ విషయాలకు సమాధానం చెబుతున్నారు పోషకాహార నిపుణులు.
చికెన్ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది లీన్ ప్రోటీన్ ను కలిగి ఉంటుంది. అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. చికెన్ తినడం వల్ల కండరాలు, ఎముకలు ఆరోగ్యంగా, బలంగా మారుతాయి. ఆస్టియో పోరాసిస్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇక పనీర్ విషయానికి వస్తే దీనిలో ఒమేగా త్రీ, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. పనీర్ తినే వాళ్ళలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం తగ్గుతుంది. దీన్ని తినడం వల్ల రక్తంలోని హిమోగ్లోబిన్ ఉత్పత్తి జరుగుతుంది. బ్రాంకైటిస్, ఆస్తమా, దగ్గు, జలుబు వంటి వ్యాధులను తట్టుకునే రోగనిరోధక శక్తిని ఇవ్వడంలో పనీర్ ముందుంటుంది. ఇది పిల్లలకు ఎంతో ఆరోగ్యకరం.
రెండింట్లో ఏది బెటర్?
పనీర్, చికెన్... ఈ రెండూ తినడం వల్ల ఉపయోగాలే. అయితే ఆ రెండింట్లో దేనిలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది? పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం ఎక్కువ ప్రోటీన్ కావాలంటే చికెన్ తినాలి. అధిక ప్రోటీన్ అవసరమైన వారంతా రెండు రోజులకు ఒకసారి చికెన్ తినడం వల్ల శరీరానికి మంచే జరుగుతుంది. అధిక ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఎముక సాంద్రతను కాపాడుకోవచ్చు. ఇక శాకాహారులు పనీర్ మీదే ఆధారపడాలి. ప్రతి 100 గ్రాములు చికెన్‌లో 31 గ్రాముల ప్రోటీన్ ఉంటే, ప్రతి 100 గ్రాముల పనీర్‌లో 20 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి మాంసాహారం తినే వారంతా ప్రోటీన్ కోసం చికెన్ మీదే ఆధారపడడం మంచిది.
ఎన్నో పోషకాలు
చికెన్, పనీర్ ఈ రెండింట్లో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ రెండింటిని తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. చికెన్‌లో విటమిన్ బి12, నియాసిన్, భాస్వరం పుష్కలంగా ఉంటాయి. ఇక పనీర్‌లో కాల్షియం కూడా లభిస్తుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి, దంతాల ఆరోగ్యానికి చాలా ముఖ్యం. అంతే కాదు రక్తం గడ్డ కట్టడం, కండరాలు సంకోచించడానికి సహాయపడుతుంది. గుండెలయలను నియంత్రిస్తుంది.
క్యాలరీలు?
చికెన్, పనీర్ ఈ రెండింట్లో ఏది తక్కువ క్యాలరీలను అందిస్తుందో తెలుసా? చాలామంది పనీర్ అనే చెబుతారు. నిజానికి చికెన్, పన్నీర్ కన్నా తక్కువ క్యాలరీలను అందిస్తుంది. 100 గ్రాముల చికెన్ తినడం వల్ల 165 కేలరీలు శరీరంలో చేరితే, 100 గ్రాముల పనీర్ తినడం వల్ల 265 నుంచి 320 కేలరీలు శరీరంలో చేరుతాయి.
అయితే చికెన్ కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. యాంటీబయోటిక్స్ వాడని చికెన్ ని ఎంచుకోవాలి. ఇక పనీర్ విషయానికొస్తే తక్కువ కొవ్వు ఉన్న పనీర్ మంచిది. మీగడ తీసిన పాలతో చేసేది తక్కువ కొవ్వు పనీర్. ఇక మీగడ తీయని పాలతో చేసేది మలై పనీర్. రెండూ మంచివే. కాకపోతే బరువు తగ్గాలనుకునే వారు తక్కువ కొవ్వు ఉన్న పనీర్ ఎంచుకోవడం మంచిది.
Also read: పెసరపప్పు - సొరకాయతో క్రిస్పీ దోశె, పిల్లలకు బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.