Amit Shah in Baramulla Rally: జమ్ముకశ్మీర్ పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి మంత్రి అమిత్ షాకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆజాన్
బారాముల్లాలో ర్యాలీలో అమిత్ షా ప్రసంగిస్తుండగా సమీపంలోని మసీదు నుంచి 'ఆజాన్' కోసం పిలుపు వినిపించింది. దీంతో అమిత్ షా తన ప్రసంగాన్ని కొద్దిసేపు ఆపారు. "మసీదులో ప్రార్థన జరుగుతోందా? మసీదులో ప్రార్థన ఉందని నాకు ఇప్పుడే చిట్టీ అందింది" అని అమిత్ షా అన్నారు. మసీదులో ఆజాన్ పిలుపు అనంతరం ప్రసంగాన్ని ప్రారంభించవచ్చా అని అమిత్ షా ప్రజలను అడిగి తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
అమిత్ షా ఆజాన్ సందర్భంగా చేసిన ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆజాన్ పిలుపు సందర్భంగా అమిత్ షా తన ప్రసంగాన్ని కొద్దిసేపు ఆపడంతో సభకు వచ్చిన ప్రజలు అమిత్ షా జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ చప్పట్లు కొట్టారు.
చర్చలకు నో
ఈ సందర్భంగా పాకిస్థాన్‌తో చర్చలపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాక్‌తో చర్చలు జరిపే సమస్యే లేదన్నారు.
" 1990 నుంచి జమ్ముకశ్మీర్‌లో 42వేల మంది ప్రాణాలను ఉగ్రవాదం అనే భూతం బలిగొంది. అలాంటిదానితో ఎవరికైనా ఉపయోగం ఉంటుందా? అబ్దుల్లాలు, ముఫ్తీలు, నెహ్రూ కుటుంబం.. భారత దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కశ్మీర్ అభివృద్ధిని అడ్డుకుంటూనే ఉంటున్నారు. పైగా కొంతమంది పాకిస్థాన్‌తో చర్చలు జరపాలని మాకు సూచిస్తున్నారు. అసలు పాక్‌తో ఎందుకు మాట్లాడాలి? ఉగ్రవాదాన్ని ఎందుకు సహించాలి? మేం చర్చలు జరపం. "
సహించేది లేదు
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం.. ఉగ్రవాదాన్ని ఎట్టపరిస్థితుల్లో ఉపేక్షించలేదని అమిత్ షా అన్నారు. ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశంలోనే కశ్మీర్‌ను శాంతివనంగా తీర్చిదిద్దుతామన్నారు.
కశ్మీర్ ప్రాంతీయ పార్టీలతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సైతం కశ్మీర్‌లో శాంతి నెలకొనాలంటే పాక్‌తో చర్చలు జరపాల్సిందేనని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి.