Amit Shah On UCC:


చర్చలు, వాదనలకు సిద్ధమే: అమిత్‌షా


గుజరాత్ ఎన్నికల్లో ప్రధానంగా వినిపిస్తున్న అంశం యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC). బీజేపీ ఇదే ప్రచారాస్త్రంగా మలుచుకోగా...అటు ప్రతిపక్షాలు దీనిపై విమర్శలు చేస్తున్నాయి. ఈ వాద ప్రతివాదాలుజరుగుతుండగానే...కేంద్ర హోం మంత్రి అమిత్‌షా యూసీసీ (Uniform Civil Code)పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కోడ్‌ను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పారు. అయితే...అంత కన్నా చర్చలు, వాదనలు తప్పకుండా వింటామని అన్నారు. జనసంఘ్‌గా ఉన్న నాటి నుంచే బీజేపీ ఈ హామీ ఇస్తూ వస్తోందని గుర్తు చేశారు. "బీజేపీ మాత్రమే కాదు. ఎప్పుడో మన రాజ్యాంగ పరిషత్ కూడా యూసీసీని సరైన సమయంలో అమలు చేయొచ్చని సూచించింది. సెక్యులర్ దేశంలో మతాల ఆధారంగా చట్టాలు చేయడం సరికాదని చెప్పింది. రాష్ట్రాలన్నీ సెక్యులర్‌గా మారిపోతే అప్పుడు మతాల ఆధారంగా చట్టాల అవసరం
ఎందుకు.." అని అన్నారు అమిత్‌షా. అప్పట్లో రాజ్యాంగ పరిషత్ చేసిన సూచనలు కాలక్రమంగా మరుగున పడిపోయాయని చెప్పారు. బీజేపీ తప్ప మరే పార్టీ కూడా యూసీసీకి మద్దతునివ్వడం లేదని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఏది అమలు చేయాలన్నా కచ్చితంగా దానిపై వాదోపవాదాలు జరగాలని అభిప్రాయపడ్డారు. "ఆరోగ్యకరమైన చర్చలు, వాదనలు ఎంతో అవసరం" అని వ్యాఖ్యానించారు. భాజపా  పాలిత రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్‌లో యూసీసీ అమలు కోసం ప్రత్యేక ప్యానెల్‌ను ఏర్పాటు చేశామని వెల్లడించారు. సుప్రీం కోర్టు, హైకోర్టుల మాజీ చీఫ్ జస్టిస్‌లు ఈ ప్యానెల్‌కు నేతృత్వం వహిస్తున్నారు. వీళ్లంతా చర్చించి ఎలాంటి సూచనలు చేస్తారో చూసి..ఆ తరవాతే యూసీసీ అమలు చేస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. 


గుజరాత్‌లో కమిటీ..


గుజరాత్ ప్రభుత్వం Uniform Civil Codeని అమలు చేస్తుందన్న వార్తలు వినిపిస్తుండగానే...ఆ ప్రభుత్వం అధికారికంగా దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించింది. రాష్ట్రంలో ఈ కోడ్‌ను అమలు చేసేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని నియమించినట్టు స్పష్టం చేసింది. రాష్ట్ర కేబినెట్ ఈ కమిటీని నియమించేందుకు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌కు సర్వాధికారాలు కట్టబెట్టింది. ఓ రిటైర్డ్ హైకోర్ట్ జడ్జ్‌ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైంది.  ఇప్పటికే ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు తామూ యూనిఫామ్ సివిల్ కోడ్‌ను అమలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు సంకేతాలిచ్చాయి. భాజపా నేతలంతా ఈ కోడ్‌ అమలు చేయడాన్ని సమర్థిస్తున్నప్పటికీ...కొన్ని వర్గాలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 


యూసీసీ అంటే..


సాధారణంగా మన దేశంలో ఒక్కో మతానికి ఒక్కో చట్టం ఉంటుంది. ఆయా మతాల ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం కొన్ని చట్టాలను అనుసరిస్తుంటారు. హిజాబ్, ట్రిపుల్ తలాక్ లాంటి అంశాలు ఈ కోవకు వస్తాయి. అయితే...Uniform Civil Code అమలు చేస్తే అన్ని మతాలు, వర్గాలకు ఒకే చట్టం అమలవుతుంది. అంటే...అందరికీ కలిపి ఉమ్మడి చట్టం. మతాల వారీగా చట్టాలు ఉండటం వల్ల న్యాయవ్యవస్థపై భారం పడుతోందన్నది కొందరి వాదన. ఈ సివిల్ కోడ్‌ అమల్లోకి వస్తే ఏళ్లుగా నలుగుతున్న కేసులకూ వెంటనే పరిష్కారం దొరుకుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు గుజరాత్ ప్రభుత్వం రాష్ట్రంలో ఈ కోడ్‌ను అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. 


Also Read: Delhi Jama Masjid: సంచలన నిర్ణయం- ఇక సింగిల్‌గా వస్తే మహిళలకు జామా మసీదులోకి నో ఎంట్రీ!