Amit Shah Mumbai visit: కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనలో భద్రతా లోపం తలెత్తడం కలకలం రేపింది. ఈ వారం మొదట్లో మహారాష్ట్ర రాజధాని ముంబయిలో అమిత్ షా పర్యటించారు. ఆ సమయంలో హోంశాఖ అధికారిని అని చెప్పుకుంటూ అమిత్ షా వెంట తిరిగిన ఓ వ్యక్తిని ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ అయిన వ్యక్తి ఆంధ్రాకు చెందిన ఓ ఎంపీ పర్సనల్ సెక్రటరీగా గుర్తించినట్లు సమాచారం.
ఇదీ జరిగింది
అమిత్ షా.. ఈ వారం రెండు రోజుల పాటు ముంబయి పర్యటనకు వెళ్లారు. అక్కడ భాజపా నేతలతో సమావేశమయ్యారు. బుధవారం ఆ పర్యటన ముగిసింది. అయితే ఈ పర్యటనలో ఓ భద్రతా వైఫల్యాన్ని అధికారులు గుర్తించారు.
ఓ వ్యక్తి హోం మంత్రిత్వ శాఖ ఐడీ కార్డు ధరించి భద్రతా బృందంలో కనిపించాడు. కొన్ని గంటల పాటు అమిత్ షాకు దగ్గర్లోనే తిరిగాడు. అయితే అతని తీరు అనుమానాస్పదంగా ఉండటంతో అధికారులు వెంటనే ముంబయి పోలీసులకు సమాచారం అందించారు.
ఎవరతను?
పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తిని హేమంత్ పవార్‌గా గుర్తించారు. భద్రతా సిబ్బంది బృందంలో ఆ పేరు లేదని పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం ఆ వ్యక్తిని అరెస్టు చేసి, ఐదు రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. హేమంత్ పవార్‌పై ఐపీసీ 170, 171 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అతను ఆంధ్రప్రదేశ్ ఎంపీ అనుచరుడినని, వ్యక్తిగత కార్యదర్శినని అతను చెప్పుకొన్నట్లు తెలిపారు. అయితే ఆ ఎంపీ ఎవరనేది ఇంకా తెలియలేదు.
Also Read: Covid Cases: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు- కొత్తగా 6 వేల మందికి వైరస్
Also Read: Bharat jodo Yatra : మనందరం భారత్‌ను ఏకం చేద్దాం - పాదయాత్ర ప్రారంభంలో రాహుల్ గాంధీ పిలుపు