Minister Botsa Satyanarayana: ఉద్యోగ సంఘాలతో భేటీలో ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓపీఎస్ అమలు సాధ్యం కాదని.. సీపీఎస్ రద్దుపై తాము తొందరపడి హామీ ఇచ్చామని అన్నారు. పాత పింఛను విధానాన్ని తిరిగి తీసుకురావడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. సీపీఎస్ రద్దు చేయాలంటూ ఉద్యోగులు ఆందోళన చేస్తే తాము చేయగలిగింది ఏమీ లేదని బొత్స తేల్చి చెప్పారు. సీపీఎస్ కంటే మెరుగ్గా గ్యారంటీ పెన్షన్ స్కీమ్ - జీపీఎస్ ను తీసుకువచ్చామని, కొత్త పింఛను పథకంలో మరిన్ని సదుపాయాలు పెంచుతున్నట్లు ఉద్యోగ సంఘాలతో జరిగిన భేటీలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. 


జీపీఎస్ రద్దుపై మరోసారి భేటీ అవుతాం - బొత్స


మంత్రులు చేసిన ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలు ముక్త కంఠంతో తిరస్కరించాయి. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాల్సిందేనని పట్టుబట్టాయి. దీంతో సీపీఎస్ పై ఎలాంటి నిర్ణయం వెలువడకుండానే చర్చలు ముగిశాయి. జీపీఎస్ లో ఉద్యోగి రిటైర్ అయ్యాక గ్యారంటీ పింఛను కనీసం రూ. 10 వేలు ఉండేలా చర్యలు తీసుకుంటామని, ఉద్యోగి, వారి జీవిత భాగస్వామికి ప్రమాద బీమా, హెల్త్ కార్డు సదుపాయాలు కల్పిస్తామని చెప్పినా ఉద్యోగ సంఘాల నాయకులు ఒప్పుకోలేదని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉద్యోగి చనిపోయినా జీవిత భాగస్వామికి పింఛను సదుపాయాలు కల్పిస్తామనీ చెప్పినా వినలేదని మంత్రి వివరించారు. జీపీఎస్ రద్దుకు ససేమిరా ఒప్పుకునేది లేదని అన్న ఉద్యోగ సంఘాలతో మరోసారి భేటీ అవుతామని బొత్స వెల్లడించారు. కేసులు ఎత్తివేయాలని ఉద్యోగులు కోరారని, తీవ్రమైన కేసులు పెట్టిన అంశాన్ని గురువారం సీఎం దృష్టికి తీసుకు వెళ్తామని తెలిపారు. 


ఉద్యోగులంతా ఓపీఎస్ వైపే మొగ్గు..


చర్చల ద్వారానే పరిష్కారం వస్తుందన్న ఉద్దేశంతో ఉద్యోగ సంఘాల లీడర్లతో భేటీలు నిర్వహిస్తున్నామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. జీపీఎస్ లో చేసిన మార్పులను పరిశీలించి, జీపీఎస్ అమలుకు ఆమోదించాలని కోరారు. ప్రభుత్వానికి, ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా జీపీఎస్ తెచ్చామనీ, ఉద్యోగులకు ఇంతకన్నా ఏమీ చేయలేని పరిస్థితి ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో సీపీఎస్ రద్దు చేస్తే భారీగా ఆర్థిక భారం పడుతుందని వెల్లడించారు. సీపీఎస్ రద్దు కోసం ఆందోళనలు కొనసాగుతాయని యూటీఎఫ్, ఎస్టీయూ, ఏపీటీఎఫ్ అధ్యక్షులు తేల్చి చెప్పారు. ప్రభుత్వం మార్పు చేసి, ప్రతిపాదించిన జీపీఎస్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. సీపీఎస్ రద్దు అవుతుందనే వైసీపీని ఎన్నికల్లో గెలిపించుకుని అధికారంలో కూర్చోబెట్టామని అన్నారు. ఉద్యోగులంతా ఓపీఎస్ నే కోరుకుంటున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు మరో సారి స్పష్టం చేశారు. 


జీపీఎస్ లో కొత్త ప్రతిపాదనలు..



  • పదవీ విరమణ తర్వాత బేసిక్ సాలరీపై 33శాతం గ్యాంరటీ పింఛను

  • పదేళ్లు సర్వీసున్న ఉద్యోగికి కనీసం రూ.10 వేల పింఛను

  • పింఛను అందుకుంటున్న వ్యక్తి చనిపోతే భాగస్వామికి 60 శాతం పింఛను చెల్లింపు

  • సర్వీసులో ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు చనిపోతే అదనంగా ప్రమాద బీమా