Business With Amazon:అమెజాన్ ఇటీవల తమ కస్టమర్లకు బంపర్ ఆఫర్లు ప్రకటించింది. దసరా పండగ సందర్భంగా భారీ ఆఫర్లు ఇచ్చింది. ఈ ఆఫర్లలో కొనుగోలు చేసే వారికి క్రెడిట్ కార్డ్ ల ద్వారా ఈఎంఐ ఫెసిలిటీలు, బై వన్ గెట్ వన్ ఆఫర్లు అదనం. అయితే అమెజాన్ తమ కస్టమర్లకే కాదు, తాను కస్టమర్ గా ఉన్న రిటైలర్లకు కూడా బంపర్ ఆఫర్ ఇచ్చింది. ట్యాక్స్ తగ్గించింది. తమతో బిజినెస్ చేసే రిటైలర్లపై కనికరం చూపించింది. బిజినెస్ పెంచు కోడానికి, అమెజాన్ లో అందుబాటులో ఉండే వస్తువుల సంఖ్య పెంచేందుకే ఈ వ్యూహం అనేది స్పష్టంగా తెలుస్తోంది. అయితే అమెజాన్ వ్యూహాలు ఎలా ఉన్నా.. అంతిమంగా ఇటు వినియోగదారుడు, అటు రిటైలర్లకు లాభం చేకూర్చడం మాత్రం ఆసక్తికర విషయం. 


అమెజాన్ వంటి ఈ కామర్స్ సంస్థలు ఉత్పత్తులను నేరుగా తయారు చేయవు. ఉత్పత్తిదారులకు, కొనుగోలుదారులకు కేవలం మధ్యవర్తిత్వం మాత్రమే చేస్తాయి. అయితే ఉత్పత్తిదారులు ఆయా వస్తువులను అమెజాన్ ద్వారా అమ్మినందుకు ఆ సంస్థకు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో అమెజాన్ తమ లాభాలను కాస్త తగ్గించుకుని వినియోగదారులకు అధిక డిస్కౌంట్లకు వస్తువుల్ని అమ్ముతుంది. కొన్నిసార్లు నష్టానికి కూడా అమ్మకాలు ఉంటాయి. దాని వల్ల అమెజాన్ ప్రైమ్ కస్టమర్లు పెరుగుతారు. నష్టాలకు అమ్మినా కూడా దీర్ఘకాలంలో అవి అమెజాన్ సంస్థ బిజినెస్ పెరుగుదలకు ఉపయోగపడతాయి కాబట్టి ముందుగా ఈ కామర్స్ సంస్థలు ఓ పోటీకి దిగుతాయి. 


అమెజాన్ వెబ్ సైట్ లో ప్రస్తుతం కొన్నివేల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది కొత్తగా 5,200 రకాల ఉత్పత్తులు ఆ లిస్ట్ కి జతచేరాయి. ఇక తెలంగాణ విషయానికొస్తే 55వేలమంది రిటైలర్లు అమెజాన్ ద్వారా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. గతేడాది ఆ సంఖ్య 45వేలు కాగా, ఈ ఏడాది కొత్తగా 10వేలమంది అమెజాన్ ద్వారా బిజినెస్ చేస్తున్నారు. వీరంతా తమ ప్లాట్ ఫామ్ ద్వారా వస్తువుల్ని అమ్మినందుకు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఆ రుసుముని ఇటీవల అమెజాన్ సంస్థ భారీగా తగ్గించింది. 3 శాతం నుంచి 12 శాతం వరకు ఆ రుసుము తగ్గించామని అమెజాన్ ఇండియా సేల్స్ డైరెక్టర్ తెలిపారు. దీని ద్వారా చిన్న చిన్న వ్యాపారులకు అమెజాన్ మరింత అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు. అదే సమయంలో తమ ద్వారా ఉత్పత్తులను కొనుగోలు చేసే వారికి మరింత డిస్కౌంట్ ఇవ్వడానికి కూడా వీలవుతుందని అన్నారు. 


భారత్ లో ఈ కామర్స్ సంస్థల ద్వారా ఉత్పత్తులు కొనేవారు కేవలం 4 శాతం మంది మాత్రమే ఉన్నారు. వీరి సంఖ్య పెంచుకోడానికి ఇటీవల ఆయా సంస్థలు పోటీ పడుతున్నాయి. డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. బయట బహిరంగ మార్కెట్ కంటం అమెజాన్ వంటి ఈ కామర్స్ సంస్థల్లోనే తక్కువ రేటుకి వస్తువులు లభిస్తున్నాయి కాబట్టి వినియోగదారులు ఆన్ లైన్ వైపు చూస్తున్నారు. ఎక్కువ రకాల వస్తువుల్ని అమెజాన్ లో అందుబాటులో ఉంచేందుకు ఆ సంస్థ వ్యాపారులకు కూడా పన్ను తగ్గించింది. మరి పండగ సీజన్ సందర్భంగా మాత్రమే ఈ పన్ను తగ్గించారా, లేక చిన్న వ్యాపారులకు దీర్ఘకాలికంగా దీని వల్ల లాభం చేకూరేలా చేస్తారా అనేది వేచి చూడాలి. 


Also Read: అక్టోబర్ 01 నుంచి అతి పెద్ద మార్పులు - నేరుగా మీ పర్సుపైనే ప్రభావం