Financial Rules Changing From 1st October: ప్రతి నెల ప్రారంభం నుంచి చాలా విషయాలు మారుతుంటాయి. వీటిలో కొన్ని ఫైనాన్షియల్‌ రూల్స్‌ కూడా ఉంటాయి, అవి సామాన్యుల జీవితాన్ని నేరుగా ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు, అక్టోబర్ ప్రారంభం నుంచి కూడా కొన్ని నియమాల్లో మార్పులు వచ్చాయి. క్రెడిట్‌ కార్డ్‌ నుంచి పన్నుల వరకు, గ్యాస్ సిలిండర్ నుంచి ఆధార్ కార్డ్‌ వరకు అనేక విషయాలు మారాయి. కొత్త నిబంధనల ప్రకారం మీ ఆర్థిక ప్రణాళిక ఉండకపోతే, మీ జేబుకు చిల్లు పెరుగుతుంది,


గ్యాస్ సిలిండర్ ధరలు (LPG Cylinder Price) 
LPG సిలిండర్ ధరలు ఈ నెలలో పెరిగాయి. ఆయిల్‌ మార్కెటింగ్ కంపెనీలు ‍‌(OMCs) కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ రేటును ఈసారి కూడా రూ.48.50 (Commercial LPG Cylinder Price Today) చొప్పున పెంచాయి. కొత్త రేట్లు 01 అక్టోబర్‌ 2024 నుంచి అమలులోకి వచ్చాయి. అయితే, ఇళ్లలో వంటకు ఉపయోగించే డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ రేట్లలో OMCs ఎలాంటి మార్పు చేయలేదు. 14.2 కేజీల సిలిండర్ రేటు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.855గా ఉంది.


ఆధార్ కార్డ్ (Aadhar Card)
అక్టోబర్ 01 నుంచి, పాన్ కార్డ్ లేదా ఆదాయ పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేయడానికి ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ IDని ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 139AA ప్రకారం, పాన్ కార్డ్ లేదా ITR కోసం ఆధార్ నంబర్‌ ఇస్తే చాలు.


బీమా పాలసీ సరెండర్‌ విలువ
జీవిత బీమా పాలసీని సరెండర్ చేస్తే గతంలో కంటే ఎక్కువ డబ్బు పొందుతారు. సరెండర్‌ చేసిన బీమా పాలసీపై బీమా కంపెనీలు పాలసీపై ప్రత్యేక సరెండర్ వాల్యూని చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు, ప్లాన్‌ మార్చుకోవడం కూడా సులభం అవుతుంది.


రైళ్లలో తనిఖీలు
పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని, అక్టోబర్‌ ప్రారంభం నుంచి, టిక్కెట్‌ లేకుండా ప్రయాణించే వారిపై ప్రత్యేక టికెట్ చెకింగ్ క్యాంపెయిన్‌ను రైల్వే శాఖ ప్రారంభించింది. టిక్కెట్‌ లేని ప్రయాణాలు పెరగడం వల్ల తనిఖీలు ముమ్మరం చేస్తోంది.


సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (STT)
ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) ట్రేడింగ్‌పై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (STT)లో కూడా మార్పులు వచ్చాయి. అక్టోబర్ 01 నుంచి, ఆప్షన్స్‌ సేల్స్‌పై STT 0.1%కు పెరుగుతుంది, ఇది అంతకుముందు 0.0625%గా ఉంది. ఫలితంగా, ట్రేడర్లు అదనపు ఖర్చును భరించవలసి ఉంటుంది.


BSE, NSE లావాదేవీ రుసుములు
ఈక్విటీ, డెరివేటివ్స్‌ (ఫ్యూచర్స్, ఆప్షన్స్‌) విభాగాల్లో చేసే లావాదేవీల ఛార్జీలను బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌, నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ సవరించాయి. అక్టోబరు ఒకటో తేదీ నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి.


వివాద్ సే విశ్వాస్ 2.0 
'వివాద్ సే విశ్వాస్ 2.0' స్కీమ్‌ను అక్టోబర్ తొలి రోజు నుంచి అమలు చేయనున్నట్లు CBDT ప్రకటించింది. ఆదాయ పన్నుకు సంబంధించి కోర్టులు, ట్రిబ్యునల్స్‌లో పెండింగ్‌లో ఉన్న కేసులను ఈ పథకం ద్వారా పరిష్కరిస్తారు.


HDFC క్రెడిట్ కార్డ్ లాయల్టీ ప్రోగ్రామ్‌
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లాయల్టీ ప్రోగ్రామ్‌లో మార్పులు వచ్చాయి. SmartBuy ప్లాట్‌ఫామ్‌లో, ఒక త్రైమాసికంలో ఒక Apple ఉత్పత్తికే రివార్డ్ పాయింట్‌లను రిడీమ్‌ను పరిమితం చేసింది. ఒక త్రైమాసికంలో తనిష్క్‌ ఓచర్‌ కోసం గరిష్టంగా 50,000 రివార్డ్‌ పాయింట్లను మాత్రమే రిడీమ్‌ చేసుకునేలా రూల్‌ మార్చింది.


ICICI బ్యాంక్‌ డెబిట్‌ కార్డు
ఐసీఐసీఐ బ్యాంక్‌ (ICICI Bank) డెబిట్‌ కార్డ్‌ విషయంలోనూ అక్టోబర్‌ 01 నుంచి మార్పులు వచ్చాయి. గత త్రైమాసికంలో ICICI డెబిట్‌ కార్డ్‌ ద్వారా రూ.10,000 వరకు ఖర్చు చేస్తే, ప్రస్తుత త్రైమాసికంలో రెండు కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌ యాక్సెస్‌లు పొందొచ్చు. 


మరో ఆసక్తికర కథనం: ఈ నెలలో బ్యాంక్‌లు 15 రోజులు పని చేయవు, హాలిడేస్‌ లిస్ట్‌ ఇదిగో