Jeff Bezos : ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతుడు, అపర కుబేరుడు, అమెజాన్ సంస్థ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జెఫ్ బెజోస్ త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నారు. గత కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తోన్న ప్రియురాలు లారెన్ శాంచెజ్‌ను ఆయన వివాహం చేసుకోబోతున్నారు. క్రిస్మస్ పండుగ రోజున అంటే ఈ నెల 28న వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నారు. వీరిద్దరూ గతేడాది మే 2023లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారని.. రూ.21 కోట్ల ఉంగరాన్ని లారెన్ చేతికి తొడిగినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలు నిజమని రుజువు చేస్తూ పెళ్లికి సంబంధించిన ప్రచారం జోరుగా సాగుతోంది. 


పెళ్లి ఎక్కడంటే..?


జెఫ్ బెజోస్ పెళ్లి కొలరాడోలోని ఇస్పైన్‌లో ఉన్న విలాసవంతమైన సుషీ రెస్టారెంట్ మాట్సుహిసా అనే లగ్జరీ రెస్టారెంట్‌లో జరగనుంది. డిసెంబర్ 26 నుంచి 27 వరకు ఈ వేడుకలు జరగనున్నట్టు సమాచారం. దాదాపు 180 మంది అతిథులు బస చేయవచ్చని భావిస్తున్నారు. గత సంవత్సరం వీరి నిశ్చితార్థానికి సంబంధించిన వార్తలు వచ్చాయి. అప్పట్నుంచి వీరి రిలేషన్షిప్‌పై చర్చ సాగుతోంది. ఇక ఈ జంట, కొలరెడోలోని కెవిన్ కాస్ట్నర్ 160 ఎకరాల ర్యాంచ్‌లో ఒక్కటి కావాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు రహస్యంగా ఉంచినప్పటికీ, ఈ వారాంతంలో జంట ఆస్పెన్‌కు చేరుకుంటారని పలు నివేదికలు సూచిస్తున్నాయి. ఇది ఆసన్నమైన వేడుకను సూచిస్తోంది. ఇక బెజోస్ గానీ, శాంచెజ్ గానీ ఇప్పటివరకు ఈ వార్తలపై పెదవి విప్పలేదు.


వివాహం, దాంతో పాటు జరిగే ఇతర వేడుకలకు ఈ జంట 600 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.5,096 కోట్లు ఖర్చు చేస్తుందనే ప్రచారమూ నడుస్తోంది. ఇక క్రిస్మస్ తర్వాత అతిథులకు వసతి కల్పించేందుకు ఆస్పెన్‌లోని ఫైవ్ స్టార్ హోటళ్లను బుక్ చేసినట్లు ఓ నివేదిక పేర్కొంది. ఈ విలాసవంతమైన వసతితో పాటు, బెజోస్ వారి హై లెవల్ గెస్ట్‌ల కోసం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ భవనాలను సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ జంట వచ్చే వారాంతంలో శీతాకాలపు వండర్‌ ల్యాండ్ నేపథ్యంలో పెళ్లి చేసుకోబోతున్నారని  నివేదికలు సూచిస్తున్నాయి. ఈ వివాహానికి చాలామంది సెలబ్రిటీలు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 


పూర్తి వివరాలివే..


54 ఏళ్ల లారెన్ శాంచెజ్ గతంలో జర్నలిస్టుగా పనిచేశారు. ది వ్యూ, కేటీ టీవీ, ఫాక్స్ 11 వంటి ప్రముఖ ఛానెల్స్‌లో రిపోర్టర్‌గా, న్యూస్ యాంకర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆమె దాతృత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇక జెఫ్ బెజోస్.. ప్రస్తుతం ప్రపంచంలోనే రెండో సంపన్నుడిగా కొనసాగుతున్నారు. ఆయన ఆస్తి విలువ 235 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.2 లక్షల కోట్లు. జెఫ్ బెజోస్‌, లారెన్‌ శాంచెజ్ 2018 నుంచే డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అదే ఏడాది బెజోస్‌ తన భార్య మెకంజీ స్కాట్‌తో ఉన్న 25 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకున్నారు. మెకంజీ, జెఫ్ బెజోస్‌కు నలుగురు సంతానం ఉన్నారు. మరోవైపు, లారెన్‌కు గతంలో పాట్రిక్‌ వైట్‌సెల్‌ అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. మాజీ ఎన్‌ఎఫ్‌ఎల్‌ ఆటగాడు టోనీ గోంజలెజ్‌తోనూ ఆమె ఒక కుమారుడికి జన్మనిచ్చారు.


Also Read : Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్‌-10 మ్యూచువల్ ఫండ్స్‌