ACP Vishnumurthy Sensational Comments On Allu Arjun: తెలంగాణలో ప్రస్తుతం అల్లు అర్జున్ వర్సెస్ ప్రభుత్వం అన్న విధంగా నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా శనివారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన బన్నీ.. సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. తాను ఎలాంటి రోడ్ షోలు చేయలేదని.. సీఎం అలా మాట్లాడడం సరికాదని అన్నారు. ఈ అంశంపై సినీ, రాజకీయ ప్రముఖులు ఎవరికి తోచిన విదంగా వారు స్పందిస్తున్నారు. తాజాగా, తెలంగాణ డీజీపీ జితేందర్ సైతం ఈ అంశంపై స్పందించారు. అల్లు అర్జున్ సినిమా హీరో అయి ఉండొచ్చని, కానీ ఓ పౌరుడిగా బాధ్యతాయుతంగా ఉండాలని అన్నారు. అల్లు అర్జున్‌కి మేం వ్యతిరేకం కాదని.. కానీ ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. థియేటర్ వద్ద ఆ రోజు జరిగిన సంఘటన దురదృష్టకరమని అన్నారు.


'కొంచెమైనా బాధ్యత ఉందా.?'


తాజాగా, అల్లు అర్జున్‌పై ఏసీపీ సబ్బతి విష్ణుమూర్తి (Sabbathi Vishnumurthy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఈ అంశంపై మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అల్లు అర్జున్ ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తించాడని మండిపడ్డారు. 'బన్నీ ఇష్టమొచ్చినట్లు ప్రెస్ మీట్లు పెట్టి పోలీసులపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. పోలీసులెవరూ ఫ్యాన్స్‌కు చేతులు ఊపుతూ అభివాదం చేయమని చెప్పలేదు. ఆయన ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాడు. ఇద్దరు మనుషులు అక్కడ శవాల్లాగా పడి ఉంటే పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. ఈ సంఘటన తర్వాత అల్లు అర్జున్ చాలా సక్సెస్ మీట్స్‌లో పాల్గొన్నారు. ఆయనకు కొంచెమైనా సామాజిక బాధ్యత ఉందా ? చట్టానికి విరుద్దంగా ప్రెస్ మీట్లు పెట్టినందుకు కోర్టులో అల్లు అర్జున్‌కు బెయిల్ రాకుండా చేయాలి' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖాన్‌వా.?'


అల్లు అర్జున్ ఏమైనా తీస్‌మార్‌ఖాన్ అనుకుంటున్నాడా! అంటూ ఏసీపీ విష్ణుమూర్తి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు బన్నీకి తెలంగాణలో ఆధార్ కార్డు ఉందా.? అంటూ ప్రశ్నించారు. 'పోలీస్ అధికారులు నాకు చెప్పలేదు అంటున్నావు.. నీకు ఎందుకు చెప్పాలి.?. నువ్వు ఏమన్నా తీస్‌మార్‌ఖాన్ అనుకుంటున్నావా.? నువ్వు మామూలు పౌరుడివి.. నీకు ఆధార్ కార్డు ఆంధ్రలో ఉందా తెలంగాణలో ఎక్కడ ఉందో కూడా తెలియదు. అసెంబ్లీలో నీ వల్ల గంట సమయం పోయింది. నీ గురించి మేము ఎందుకు బాధపడాలి.? తెలంగాణ సమాజం సౌమ్యులు కాబట్టి మీరు ఇంకా ఇక్కడ నాటకాలు చేస్తున్నారు. సినిమా వాళ్ల దాదాగిరి ఏంటీ.? ఇష్టమొచ్చినట్లు టికెట్ రేట్లు పెంచారు. ఇన్ని రూ.కోట్లు పెట్టి సినిమాలు తీయమని మేము బ్రతిమిలాడామా?.' అంటూ నిలదీశారు.


'సినిమా వాళ్ల బట్టలూడదీస్తాం'


అల్లు అర్జున్ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని.. లేదంటే తోలు తీస్తామని ఏసీపీ విష్ణుమూర్తి హెచ్చరించారు. 'సినిమా వాళ్లు వాపును చూసి బలం అనుకుంటున్నారు. మీ వాపును ప్రజలే తీసి పడేస్తారు. ఇంకోసారి పోలీసులను ఎవరైనా అవమానించే విధంగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదు. చట్టపరంగా, న్యాయపరంగా ముందుకెళ్తాం. ప్రజల్లోకి తీసుకెళ్లి మరీ సినిమా వాళ్ల బట్టలూడదీస్తాం. మీరు ఉన్నదే లీజు జాగాలో. జూబ్లీహిల్స్ ఏరియాలో మీకు అంత పెట్టి డబ్బులు ఎక్కడివి.?. అప్పట్లో ఉన్న రాజకీయ నాయకులు ఎవరో ఇండస్ట్రీ అభివృద్ది కావాలని మీకు భూములు ఇచ్చారు. ఊరూరూ తిరిగి సినిమా వాళ్ల బట్టలు ఊడదీస్తాం.' అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.


Also Read: Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ