Telangana DGP Jitender on Allu Arjun Case | కరీంనగర్: సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ హాస్పిటల్‌లో చికిత్స పొండుతున్నాడు. అల్లు అర్జున్ సినిమా హీరో అయి ఉండొచ్చు, కానీ ఓ పౌరుడిగా బాధ్యతాయుతంగా ఉండాలని తెలంగాణ డీజీపీ జితేందర్ అన్నారు. అల్లు అర్జున్‌కి మేం వ్యతిరేకం కాదు. కానీ ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే చట్టప్రకారం యాక్షన్ తీసుకుంటాం. థియేటర్ వద్ద ఆ రోజు జరిగిన సంఘటన దురదృష్టకరం అన్నారు.
నటీనటులు పరిస్థితులు అర్థం చేసుకోవాలి
కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో భరోసా కేంద్రాన్ని డీజీపీ జితేందర్ ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీసులు ఎవరికీ వ్యతిరేకం కాదు. పౌరుల రక్షణ, భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తాం. అల్లు అర్జున్ సినిమా హీరో కావొచ్చు. బయట మాత్రం ఆయన ఓ సాధారణ పౌరుడు. ప్రతి పౌరుడు తమ వంతుగా బాధ్యతాయుతంగా ప్రవర్తించడం ఎంతైనా అవసరం. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అర్థం చేసుకుని మసలుకోవాలి. సినిమా ప్రమోషన్లు, ఈవెంట్ల కంటే మాకు ప్రజల భద్రతే ముఖ్యం. ప్రజల ప్రాణాల కంటే సినిమా ఈవెంట్లు ముఖ్యమైన విషయం కాదు. చట్టాన్ని అతిక్రమిస్తే ఎవరిపై అయినా చర్యలు తప్పవు. అల్లు అర్జున్‌కు తాము వ్యతిరేకం కాదని’ స్పష్టం చేశారు.
సినిమా నటులైనప్పటికీ బయట వీరు సాధారణ పౌరుల్లా వ్యవహరించాలి. సినీ నటుడు మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన విషయం కుటుంబ సమస్య కానీ, జర్నలిస్టుపై దాడితో మోహన్ బాబుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. పరిమితులకు లోబడి, పరిస్థితిని అర్థం చేసుకుని వ్యవహరిస్తే ఎవరికీ ఏ సమస్యా ఉండదు. లేనిపక్షంలో కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. - తెలంగాణ డీజీపీ
మధ్యంతర బెయిల్ రావడంతో అల్లు అర్జున్ విడుదల
సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ 4న తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. కొన్ని రోజుల కిందటితో పోల్చితే బాలుడి పరిస్థితి కొంచెం మెరుగైందని హాస్పిటల్ శనివారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. చిక్కడపల్లి పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి అల్లు అర్జున్ సహా కొందరు నిందితుల్ని అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు రెండు వారాల రిమాండ్ విధించగా చంచల్ గూడ జైలుకు తరలించారు. హైకోర్టుకు వెళ్లడంతో నటుడికి నాలుగు వారాల మధ్యంతర బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యారు.
ప్రైవేట్ బాడీ గార్డ్స్, బౌన్సర్లు హద్దుల్లో ఉండాలి..
బౌన్సర్లు, ప్రైవేట్ బాడీ గార్డ్స్ పేరుతో చట్టానికి వ్యతిరేకంగా ఎవరిపైనైనా దాడులు, బెదిరింపులు చేస్తే క్రిమినల్ కేసులతో జైలు ఊచలు లెక్కించాల్సి వస్తుందని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. బౌన్సర్లకైనా,ప్రైవేట్ బాడీ గార్డ్స్ కైనా పరిమితులు ఉంటాయని, నిబంధనలు అతిక్రమిస్తే కేసులు వెంటాడుతాయని స్పష్టం చేశారు.
Also Read: Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి