Allu Arjun Message To Fans: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఫ్యాన్స్‌కు మెసేజ్ ఇచ్చారు. ఇంటర్నెట్‌లో ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచేలా అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టవద్దని విన్నపం చేశారు. అలాగే అభిమానులు తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని తెలిపారు. దీని గురించి ఆయన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.
రేవంత్ ప్రభుత్వం విమర్శలు చేస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌ని ఏ11గా మెన్షన్ చేసిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్‌ని అరెస్టు చేసి ఒక రోజు రాత్రంతా చంచల్ గూడ జైలులో ఉంచారు. దీంతో అల్లు అర్జున్‌ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలని పర్సనల్‌గా టార్గెట్ చేస్తున్నారని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కొంత మంది ఫ్యాన్స్ అయితే అసభ్య పదజాలంతో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని దూషిస్తున్నారు. ఇలా పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
రేవతి కుటుంబాన్ని తాను కలవలేకపోతున్నానని అల్లు అర్జున్ గతంలో ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని న్యాయపరమైన సమస్యల కారణంగా ఆ కుటుంబాన్ని నేరుగా కలిసి వారికి అండగా నిలవలేకపోతున్నానని పేర్కొన్నారు. చికిత్స పొందుతున్న బాలుడు శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ఆరోగ్యం గురించి తాను చాలా ఆందోళన చెందుతున్నాను అని అల్లు అర్జున్ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఈ సంఘటన దురదృష్టకరం అన్నారు.
ప్రస్తుతం ఈ అంశంపై కేసులు కోర్టులో ఉన్నాయి. లీగల్ ప్రొసీడింగ్స్ కారణంగా రేవతి కుటుంబాన్ని నేరుగా కలవకూడదని లాయర్లు సూచించారని అల్లు అర్జున్ తెలిపారు. కొన్ని చట్టపరమైన కారణాల వల్ల బాధిత కుటుంబాన్ని నేరుగా కలిసి పరామర్శించలేకపోయానని పేర్కొన్నారు. వారికి అవసరమైన మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడానికి బాధ్యత తీసుకున్నానని అన్నారు. శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని, వీలైనంత త్వరగా ఆ కుటుంబాన్ని తాను కలుసుకోవాలని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఆ కుటుంబానికి ఏ అవసరం వచ్చినా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నానని అల్లు అర్జున్ వెల్లడించారు.