ప్రమాదానికి అసలు కారణమిదేనా..


అమర్‌నాథ్‌లో జరిగిన ప్రమాదానికి కారణాలు వెల్లడించారు భారత వాతావరణ విభాగం-IMDఅధికారులు. అందరూ అనుకుంటున్నట్టుగా క్లౌడ్‌బర్స్ట్‌ కారణంగా ఈ ప్రమాదం తలెత్తలేదని స్పష్టం చేశారు. అంచనాలకు మించిన కురిసిన వర్షాలతోనే ఇలా జరిగిందని తెలిపారు.అమర్‌నాథ్ ఆలయ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం 4.30 నుంచి 6.30 వరకూ 31మిల్లీ మీటర్ల వర్షపాత నమోదైందని పేర్కొన్నారు. ఇంతకన్నా ఎక్కువ వర్షపాతం నమోదైన సందర్భంలోనే అది క్లౌడ్‌బర్స్ట్‌(Cloudburst)అని నిర్ధరిస్తామని చెప్పారు. పర్వత ప్రాంతంలో అనూహ్య స్థాయిలో వర్షాలు కురిశాయని, ఈ పర్వతాలు అమర్‌నాథ్ ఆలయానికి దగ్గర్లోనే ఉండటం వల్ల ఇక్కడి వారిపై ప్రభావం పడిందని IMDఅధికారులు వివరిస్తున్నారు. గంటలో 100 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైనప్పుడే అది Cloudburst గా నిర్ధరిస్తామని స్పష్టం చేశారు. 


అనూహ్య వర్షపాతం వల్లే..


అమర్‌నాథ్ యాత్ర జరిగే సమయంలో ఈ ఆలయానికి సమీపంలో IMD,ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తుంది. వాతావరణపరిస్థితులను అంచనా వేసి సమాచారం అందిస్తుంది ఈ స్టేషన్. అయితే మరికొన్ని చోట్ల మాత్రం ఈ స్టేషన్‌ను ఏర్పాటు చేసే వీల్లేకుండా పోయింది. అక్కడి భౌగోళిక స్థితే అందుకు కారణం. ఈ ఘటనలో మొత్తం 16 మంది మృతి చెందగా, యాత్రికులు వేసుకున్న టెంట్‌లు వరదల్లో కొట్టుకుపోయాయి. గతేడాది కూడా ఈ ప్రాంతంలో ఇలాగే వర్షపాతం నమోదైందని అధికారులు గుర్తు చేస్తున్నారు. అమర్‌నాథ్ గుహ పైభాగంలో శుక్రవారం సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకూ 28 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని IMD శాస్త్రవేత్త ఒకరు వెల్లడించారు. ఇంత తక్కువ సమయంలోనే Cloudburst అయ్యే అవకాశాల్లేవని, ఒక్కోసారి వీటిని అంచనా వేయటమూ కష్టసాధ్యమవుతుందని చెబుతున్నారు.