Union Budget 2024-25: మరో రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ని ప్రవేశపెట్టనుంది. లోక్‌సభ ఎన్నికల ముందు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన మోదీ సర్కార్ ఇప్పుడు పూర్తి స్థాయి పద్దుని తీసుకు రానుంది. ఈ క్రమంలోనే అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తప్ప మిగతా పార్టీలన్నీ హాజరయ్యాయి. పార్లమెంట్‌లో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపక్ష నేతలు తమ అభిప్రాయాలు వెల్లడించారు. కాంగ్రెస్ తరపున సీనియర్ నేతలు జైరామ్ రమేశ్ వెళ్లారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై చర్చ కచ్చితంగా జరగాలని ఆయన పట్టుపట్టారు. YSRCPతో పాటు జనతా దళ్ (యునైటెడ్), బిజూ జనతా దళ్ పార్టీల నేతలూ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ మూడు పార్టీలూ తమ తమ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ వినిపించారు. ఒడిశాకి ప్రత్యేక హోదా కావాలని బిజూ జనతా దళ్ డిమాండ్ చేస్తోంది. అటు NDA మిత్రపక్షమైన జేడీయూ కూడా ఇదే అడుగుతోంది. నితీశ్ కుమార్ ఈ డిమాండ్ నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతోనే కూటమిలో చేరారన్న వాదనా ఉంది. వీటితో పాటు యూపీలో జరగనున్న కన్వార్ యాత్రపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది.
ఇప్పటికే ఈ యాత్ర దేశవ్యాప్తంగా సంచలనమవుతోంది. యోగి సర్కార్ పెట్టిన కొన్ని నిబంధనలు రాజకీయంగా అలజడి సృష్టించాయి. ఈ యాత్ర జరిగే దారి పొడవునా షాప్‌లు కచ్చితంగా నేమ్‌బోర్డ్‌లు పెట్టుకోవాలని, ఓనర్ల పేర్లూ రాయాలని ప్రభుత్వం ఆదేశించింది. హలాల్ ఉత్పత్తులు విక్రయించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఈ నిబంధనలే వివాదాస్పదమయ్యాయి. ముస్లిం వ్యాపారులను లక్ష్యంగా చేసుకునే ఈ నిబంధనలు పెట్టారని కొందరు వాదిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ విమర్శల్ని పట్టించుకోడం లేదు. కచ్చితంగా ఈ నిబంధన పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జులై 22వ తేదీన మొదలవుతాయి. ఆగస్టు 12వ తేదీ వరకూ ఈ సమావేశాలు కొనసాగున్నాయి. కేంద్ర ప్రభుత్వం మొత్తం 6 కీలక బిల్స్‌ని ప్రవేశపెట్టాలని ప్లాన్ చేసుకుంది. 90 ఏళ్ల నాటి Aircraft Actనీ మార్చేందుకు వీలుగా కొత్త బిల్‌ని ప్రవేశపెట్టనుంది. జమ్ముకశ్మీర్‌కి సంబంధించిన పద్దు వివరాలనూ వెల్లడించనుంది. బడ్జెట్‌ని ప్రవేశపెట్టే ముందు రోజు..అంటే జులై 22న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ఆర్థిక సర్వే వివరాలు వెల్లడిస్తారు. మరుసటి రోజు పద్దు ప్రకటిస్తారు.
Also Read: Nipah Virus: కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం, 14 ఏళ్ల బాలుడు గుండెపోటుతో మృతి - ప్రభుత్వం అలెర్ట్