Nipah Virus in Kerala: కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం రేపుతోంది. ఓ 14 ఏళ్ల బాలుడు ఇప్పటికే ఈ వైరస్‌కి బలి అయ్యాడు. కేరళ ఆరోగ్య మంత్రి అధికారికంగా ఈ విషయం వెల్లడించారు. మలప్పురం జిల్లాకి చెందిన బాలుడు నిఫా వైరస్‌ సోకి ప్రాణాలు కోల్పోయినట్టు ప్రకటించారు. బాధితుడికి ఉన్నట్టుండి తీవ్ర గుండెపోటు వచ్చిందని, కాపాడేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదని వివరించారు. ఈ వైరస్ సోకిన తరవాత బాధితుడికి శ్వాస సంబంధిత సమస్య తలెత్తింది. ఊపిరి పీల్చుకోడం కష్టంగా ఉండడం వల్ల వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే...వెంటిలేటర్‌పై ఉండగానే గుండెపోటు వచ్చి మృతి చెందినట్టు ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. మెడికల్ ప్రోటోకాల్స్‌కి అనుగుణంగా అంత్యక్రియలు చేస్తామని తెలిపారు. కేరళ ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకూ నలుగురికి నిఫా వైరస్ సోకింది. వాళ్లందరినీ హైరిస్క్ కేటగిరీ కింద ట్రీట్‌ చేస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. 


పండిక్కడ్‌, మలప్పురం జిల్లాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్టు గుర్తించారు. ఈ రెండు ప్రాంతాల్లోని ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య శాఖ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. హాస్పిటల్స్‌లో ఉన్న పేషెంట్స్‌ని కలిసేందుకు పదేపదే వెళ్లడం మానేయాలని, బయటకు వచ్చినప్పుడు కచ్చితంగా మాస్క్‌ ధరించాలని సూచించింది. పక్షులు కొరికి పెట్టిన పండ్లు తినకూడదని ప్రభుత్వం సూచనలు చేసింది. పండ్లు తినే ముందు బాగా కడగాలని చెప్పింది. ఓపెన్ కంటెయినర్లలో ఉండే ఆహార పదార్థాలు తినకపోవడమే మంచిదని వెల్లడించింది. నిఫా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేకంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. గతంలో చాలా నెలల పాటు నిఫా వైరస్ కేరళను వణికించింది. కొజికోడ్‌, ఎర్నాకులంలో కేసులు విపరీతంగా నమోదయ్యాయి. 2018,2019 సహా 2021,23 సంవత్సరాల్లోనూ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాప్తిని అడ్డుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.