Kenya Serial Killer: కెన్యాలో ఓ సీరియల్ కిల్లర్‌ చేసిన దారుణాలు చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. 42 మంది మహిళలను అత్యంత కిరాతకంగా చంపాడు 33 ఏళ్ల కోలిన్స్ జుమైసి ఖలూషా. తనను తాను Vampire గా చెప్పుకునే కోలిన్స్‌కి మనుషుల ప్రాణాలంటే లెక్కేలేదు. చాలా పక్కాగా ప్లాన్ చేసి హతమార్చి ఆ తరవాత ఆ శరీరాలను (Serial Killers) ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. వాటిని సంచుల్లో కుక్కి ఎక్కడో చెత్త కుప్పల దగ్గర పడేసి పోతాడు. పోలీసుల కోలిన్స్ (Collins Jumaisi Khalusha) ఇంట్లో సోదాలు చేస్తే కానీ ఈ మిస్టరీ అంతా బయటపడలేదు. ఇల్లంతా పదునైన ఆయుధాలు, సంచులు, టేప్‌లు కనిపించాయి. ఇవన్నీ చూసి పోలీసులే షాక్ అయిపోయారు. ఆ తరవాతే ఇతనో సైకోపాత్ కిల్లర్ అని ప్రకటించారు. మహిళలనే టార్గెట్ చేసి చంపుతుండడంపై ఒక్కసారిగా అలజడి రేగింది. రాజకీయంగానూ ఇది సంచలనం (Serial Killer in Kenya) సృష్టిస్తోంది. 


ఓ క్వారీలో 9 మంది మహిళల మృతదేహాలు కనిపించాయి. గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నాయి. తాను చంపిన వాళ్లందరినీ తీసుకొచ్చి ఇక్కడే పడేసి వెళ్లేవాడు కోలిన్స్. ఆ డెడ్‌బాడీలు కనిపించాక వెంటనే పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. ఈ క్వారీకి పక్కనే ఉంటున్న కోలిన్స్‌ ఇంట్లో పోలీసులు సోదా చేశారు. అప్పుడే నిందితుడు ఆ హత్యలన్నీ తానే చేశానని ఒప్పుకున్నాడు. అలా విచారణ చేయగా మొత్తం 42 మంది మహిళల్ని ఇలాగే హత్య చేసినట్టు అంగీకరించాడు. మృతదేహాలను ఎవరూ లేని చోట చెత్త కుప్పల్లో పారేసినట్టు చెప్పాడు. క్వారీలోనూ కొన్ని డెడ్‌బాడీలు పారేసినట్టు ఒప్పుకున్నాడు. 


విచారణ మొదలు పెట్టిన కొద్ది రోజులకే కోలిన్స్‌ని అరెస్ట్ చేశారు పోలీసులు. మరో కీలక విషయం ఏంటంటే...కోలిన్స్ చంపిన మహిళల్లో అతని భార్య కూడా ఉంది. 2022 నుంచి ఇప్పటి వరకూ మహిళలనే లక్ష్యంగా చేసుకుని హత్యలు చేస్తున్నట్టు విచారణలో తేలింది. కోలిన్స్ ఇంట్లో ఐడీ కార్డులు, మొబైల్ ఫోన్స్‌ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అయితే...ఎప్పటి నుంచో మహిళల మిస్సింగ్ మిస్టరీ కొనసాగుతున్నా పోలీసులు ఏమీ పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. పోలీస్ స్టేషన్‌కి దగ్గర్లోనే డంపింగ్ యార్డ్‌ దగ్గరే డెడ్‌ బాడీలు విసిరేసి పోయినా తెలియకుండా పోయింది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఇన్ని హత్యలు జరిగాయని స్థానికులు మండి పడుతున్నారు. 


ప్రస్తుతానికి కెన్యాలో ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. భారీ అవినీతి, పన్నులు పెంచడం లాంటి అంశాలు రాజకీయంగానూ అలజడి సృష్టిస్తోంది. అదృశ్యమైన ఓ బాధితురాలి కుటుంబ సభ్యులు తమకి తెలిసిన చోటంతా వెతికారు. తరవాత అనుమానం వచ్చి డంపింగ్ యార్డ్‌ దగ్గరికి వచ్చారు. అక్కడ వెతకగా సంచుల్లో మహిళల మృతదేహాలు కనిపించాయి. గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నాయి. వీటికి DNA టెస్ట్‌లు చేసే పనిలో ఉన్నారు వైద్యులు. చాలా సంచుల్లో ఛాతీ భాగాలు మాత్రమే కనిపించాయి. మరి కొన్ని సంచుల్లో కాళ్లు, చేతులు ఉన్నాయి. ఇవి ఎవరివన్నది గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. మొత్తానికి ఈ సీరియల్ కిల్లర్ అంశం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. 


Also Read: Bangladesh Protests: బంగ్లాదేశ్‌ అల్లర్లలో రజాకార్‌ రచ్చ, కనిపిస్తే కాల్చి పారేయాలని ప్రభుత్వం ఆదేశాలు