Akhilesh Yadav: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మెయిన్‌పురి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆసక్తికర పరిణామం జరిగింది. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్.. తన మావయ్య ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీ అధినేత శివపాల్ సింగ్ యాదవ్‌ను కలిశారు. ఆ సమయంలో వేదికపైకి రాగానే ఎస్పీ చీఫ్ అఖిలేశ్ తన మావయ్య కాళ్లకు మొక్కారు.






పొత్తు


అఖిలేష్ యాదవ్, శివపాల్ యాదవ్ మధ్య విభేదాలు తలెత్తి ఎన్నోసార్లు విడిపోయారు. కానీ ఇటీవలి కాలంలో ఇరువురు కాస్త దగ్గరయ్యారు. తాజాగా మెయిన్‌పురి ఎన్నికల్లో డింపుల్ యాదవ్‌ను గెలిపించమని శివపాల్ యాదవ్‌ను అఖిలేశ్ కోరారు. 


దీంతో కీలకమైన ఉప ఎన్నికలకు ముందు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తన మామ శివపాల్ యాదవ్‌కు చెందిన ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు.


విభేదాలు


శివపాల్ యాదవ్ 2018లో సమాజ్‌వాదీ పార్టీ నుంచి విడిపోయారు. మేనల్లుడు అఖిలేశ్ యాదవ్‌తో విభేదాల కారణంగా సొంత రాజకీయ పార్టీ పెట్టుకున్నారు. 2017లో అఖిలేశ్ యాదవ్ ఎస్పీ పగ్గాలు చేపట్టిన తర్వాత శివపాల్ పార్టీ నుంచి బయటకు వచ్చారు.


బరిలో 


అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్‌ ఉప ఎన్నికల బరిలో నిలిచారు. మెయిన్‌పురి లోక్‌సభ నియోజకవర్గానికి జరిగే ఉపఎన్నికలకు డింపుల్ యాదవ్‌ను సమాజ్‌వాదీ పార్టీ రంగంలోకి దింపింది. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మరణంతో మెయిన్‌పురి లోక్‌సభ స్థానం ఖాళీ అయింది.


ఈ స్థానానికి తొలుత అఖిలేశ్ బంధువు ధర్మేంద్ర యాదవ్ లేదా ఆయన మేనల్లుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ బరిలోకి దిగుతారని అంతా భావించారు. అయితే చివరకు డింపుల్ యాదవ్‌ పేరును ఖరారు చేశారు. ఈ స్థానానికి డిసెంబరు 5న పోలింగ్ జరగనుంది. ఫలితాలు డిసెంబర్ 8న వెల్లడిస్తారు.





కంచుకోట


మెయిన్‌పురి సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటగా ఉంది. 1996లో ములాయం తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన మరో మూడుసార్లు 2004, 2009, 2019లో ఈ స్థానం నుంచి విజయం సాధించారు. 2014 ఉప ఎన్నికలో అఖిలేశ్ మేనల్లుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఈ సీటును గెలుచుకున్నారు. ములాయం సింగ్ లేకుండా సమాజ్‌వాదీ పార్టీ ఎదుర్కోబోతున్న తొలి ఎన్నిక ఇదే.


Also Read: Viral Video: ఇదేం నిరసనరా బాబు! కలెక్టర్‌ ముందు కుక్కలా మొరిగిన వ్యక్తి