Hyd Formula E Race: హైదరాబాద్ హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఇండియన్ రేసింగ్ లీగ్ (IRL) రేసింగ్ సాగుతోంది. ఫార్ములా E రేసింగ్ కార్లు రయ్ రయ్ మంటూ దూసుకుపోతున్నాయి. ప్రేక్షకుల కేరింతలతో హుస్సేన్ సాగర్ తీరం సందడిగా మారింది. రెండో రోజు రేసింగ్ ఉదయం 9 గంటలకు ప్రారంభం అయింది. ఉదయం 8 నుండే సందర్శుకుల తాకిడి మొదలు అయింది. గ్యాలరీల్లో ఉంటూ ఫార్ములా E కార్ల రేసింగ్ ను ప్రేక్షకులు తిలకిస్తున్నారు. 


ఇండియన్ రేసింగ్ లీగ్ నేటి షెడ్యూల్: 


ఉదయం 9 గంటలకు ఫార్ములా-4 క్వాలిఫైయింగ్ రేస్
9.20 గంటలకు ఇండియన్ రేసింగ్ లీగ్ క్వాలిఫైయింగ్ 1
9.40 గంటలకు ఇండియన్ రేసింగ్ లీగ్ క్వాలిఫైయింంగ్ 2
10.15 గంటలకు ఫార్ములా 4 లో రేస్ 1 స్టార్ట్
11.10 గంటలకు ఇండియన్ రేసింగ్ లీగ్ లో రేస్-1
మధ్యాహ్నం 12 గంటలకు ఫార్ములా 4లో రేస్ -2 
1.35PM కు ఫార్ములా 4 లో రేస్ - 3
2.30PM కు ఇండియన్ రేసింగ్ లీగ్ లో రేస్ 2
3.50 PM కు ఇండియన్ రేసింగ్ లీగ్ లో రేస్ -3 స్టార్ట్


ఇండియన్ రేసింగ్ లీగ్ లో 12 కార్లు, 6 జట్లు, 24 మంది డ్రైవర్లు పాల్గొంటున్నారు. రహదారి అభివృద్ధి, ఇతర మౌలిక వసతులకు హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ రూ. 90 కోట్ల దాకా వెచ్చించింది.


దేశంలోనే మొట్టమొదటిసారిగా  ఫార్ములా-E రేసు హైదరాబాద్ లో జరుగుతోంది.రేసింగ్ ట్రాక్ ను సుందరంగా తీర్చిదిద్దండంతో పాటు వేలాది మంది ప్రేక్షకులు కూర్చునేలా గ్యాలరీలు ఏర్పాటుచేశారు. ఈ రేసింగ్ లో సగం మంది రేసర్లు మన దేశానికి చెందిన వారు కాగా, మరో సగం మంది విదేశాలకు చెందినవారు. రేసింగ్ పోటీలో  హైదరాబాద్ రేసర్లు కూడా పాల్గొంటున్నారు. ఐమాక్స్ ఇందిరా గాంధీ విగ్రహం వద్ద నుంచి ఎన్టీఆర్ మార్గ్, లుంబినీ పార్క్, ఎన్టీఆర్ పార్క్, ఐమ్యాక్స్  వరకూ రేస్ సర్య్కూట్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ వేదికగా మొదటి సారి రేసింగ్ కార్ల పోటీలు నిర్వహిస్తున్నారు.


అసలు ఈ ఫార్ములా ఈ రేసు అంటే ఏంటి?


ఫార్ములా ఈ అనేది ప్రపంచంలో మొదటి ఆల్ ఎలక్ట్రిక్ ఇంటర్నేషనల్ సింగిల్ సీటర్ ఛాంపియన్‌ షిప్. ఏబీబీ ఎఫ్ఐఏ ఫార్ములా ఈ వరల్డ్ చాంపియన్‌షిప్ అని దీన్ని అధికారికంగా పిలుస్తారు. రేసింగ్‌లను మరింత మెరుగ్గా, కాలుష్యం లేకుండా నిర్వహించాలనే లక్ష్యంతో దీన్ని రూపొందించారు. 2014లో బీజింగ్‌లోని ఒలింపిక్ పార్క్‌లో దీనికి సంబంధించిన మొదటి రేసు జరిగింది. అప్పటి నుంచి ఫార్ములా ఈ గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్రాండ్‌గా ఎదిగింది. బెస్ట్ రేసింగ్ డ్రైవర్లు, టీమ్స్ ఇందులో ఉన్నారు.


ఫార్ములా ఈ కార్లు ఎలా పని చేస్తాయి?


ఫార్ములా ఈ కార్లలో ఒక ఇన్వర్టర్, మోటార్, ఒక ట్రాన్స్‌మిషన్ ఉంటాయి. బ్యాటరీ నుంచి తీసుకున్న ఎలక్ట్రిసిటీని ఇన్వర్టర్ డైరెక్ట్ కరెంట్‌ (డీసీ) నుంచి ఆల్టర్నేటింగ్ కరెంట్‌గా (ఏసీ) మారుస్తుంది. దీన్ని ఉపయోగించి మోటార్ చక్రాలను తిప్పుతుంది.


ఫార్ములా ఈ కార్లు ఎంత వేగంగా వెళ్తాయి?


ప్రస్తుతం ఉన్న అన్ని ఎలక్ట్రిక్ రేసింగ్ కార్లు గంటకు 280 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించగలవు. 250 kW పవర్ ద్వారా 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2.8 సెకన్లలోనే ఇవి అందుకుంటాయి.