Karimnagar News: కన్న తల్లిదండ్రులని పట్టించుకోని పిల్లలు ఉన్న కాలం ఇది. కలికాలంలో వృద్ధులను ఆదరించడం క్రమక్రమంగా తగ్గుతుందని చిన్న కుటుంబాల వల్ల పండుటాకులకు ఆదరణ లేకుండా పోతుందని బ్రహ్మంగారే స్వయంగా చెప్పారు. అయితే అలాంటి అన్నార్తులకు అండగా నిలుస్తున్నాడు కరీంనగర్ కి చెందిన వీర మాధవ్. 20 ఏళ్ల కిందట తాను ప్రారంభించిన వృద్ధాశ్రమం వల్ల కొన్ని వందల మందికి ఆశ్రయం కల్పించారు. కేవలం ఆశ్రయం మాత్రమే కాదు... ఇప్పటి వరకు 119 మంది అనాధలకు సొంత కొడుకులా మారి వారి మరణం తర్వాత తల కొరివి పెట్టారు. కరీంనగర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల వీబీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సిపెల్లి వీరమాధవ్ గతంలో డేంటింగ్ వర్క్ షాప్ నిర్వహిస్తూ తన కష్టార్జితం లో కొంత సొమ్ముని సమాజ సేవ కోసం కేటాయించాలని నిర్ణయించుకున్నాడు. అందులోంచి పుట్టిందే వీరబ్రహ్మేంద్ర అనాధ వృద్ధుల ఆశ్రమం. 2003లో స్థాపితమైన ఈ ఆశ్రమం సేవలను గమనించిన పలువురు దాతలు అండగా నిలవడంతో అనేక మంది వృద్ధులకు అవసర దశలో అండగా నిలిచింది. ప్రస్తుతం కేవలం తెలంగాణలోని జిల్లాలే కాకుండా పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ,తమిళనాడు, కేరళకు చెందిన వృద్ధుల సైతం ఇక్కడ తమ జీవన చరమాంకాన్ని వెల్లదీస్తున్నారు. మరోవైపు అనాధలకు సేవ మాత్రమే కాకుండా కనీస వేతనం లేక ఆహారం కోసం పరితపించే దినసరి కూలీలకు సైతం వీరమాధవ్, కడుపునిండా భోజనం పెడుతున్నాడు. దాదాపు 100 మంది కూలీలు ఈ సేవని వినియోగించుకుంటున్నారు. ఈ 20 ఏళ్ల కాలంలో దాదాపు 119 మంది వృద్ధులు ఇక్కడే ప్రాణాలు కోల్పోగా వారికి తలకొరివి పెట్టి శ్రాద్ధ కర్మలను సైతం నిర్వహించారు.


కరోనా సమయంలోను ఆగని సేవలు... 


దాదాపు మూడేళ్ల క్రితం విలయ తాండవం చేసిన కరోనా వల్ల అనేక మంది వృద్దులు ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడారు. అలాంటి సమయంలో వారికి వెలుగు రేఖలా కనిపించింది ఈ ఆశ్రమం... అనేక మంది పోలీసు అధికారులు సైతం వృద్ధాప్య సమయంలో పిల్లలకు దూరమైన తల్లిదండ్రులను ఇక్కడ చేర్చడానికి చొరవ చూపేవారు. అంటే వీరమాధవ్ సేవల పట్ల ఉన్న నమ్మకాన్ని అర్థం చేసుకోవచ్చు.


కాశీలో పిండ ప్రదానం..


ఇక కన్న తల్లిదండ్రులకు కాశీలో పిండ ప్రదానం చేయని పిల్లలున్న కాలంలో తన అనాధాశ్రమంలో మరణించిన 119 మంది వృద్ధులకు స్వయంగా సొంత కుమారుడిలాగా పిండ ప్రదాన కార్యక్రమాలు నిర్వహించాడు వీరమాధవ్. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన వారు తమ అవసాన దశలో తనకు తల్లిదండ్రులుగా మారారని అంటుంటారు. వీరా మాధవ్ ఆధునిక కాలంలో డబ్బు సంపాదన పై దృష్టి పెట్టిన ఈ కాలం  పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోవడం మానేయడం సమంజసం కాదని.. బలమైన కుటుంబ వ్యవస్థ ఉంటేనే అందరూ బాగుండారని అంటుంటారు మాధవ్. కొన్ని సందర్భాల్లో వారి కష్టాలు చూసి చలించిపోయానని... తన వల్ల ఎంత సేవా చేయగలనో అంతవరకు చేశానని... ఈ శక్తినిచ్చినందుకు తాను ఎప్పటికీ భగవంతుడికి కృతజ్ఞతతో ఉంటానంటూ వినయంగా చెప్తూ ఉంటారు. నిజంగా వీర మాధవ్ గ్రేట్ పర్సన్ కదూ.