Akhand Bharat Map: 


పార్లమెంట్‌లో అఖండ భారత్ మ్యాప్ 


కొత్త పార్లమెంట్‌ (New Parliament) కట్టడమూ అయింది. ప్రధాని మోదీ (PM Modi) ప్రారంభించడమూ పూర్తైంది. దాదాపు 20 పార్టీలు ఆ కార్యక్రమాన్ని బైకాట్ చేయడం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ నిర్ణయం కరెక్టే అని కొందరు..తప్పు అని మరికొందరు వాదించుకున్నారు. ఇప్పుడీ డిబేట్ ముగిసిపోయి..కొత్త డిబేట్ మొదలైంది. పార్లమెంట్‌లో సెంగోల్‌ గురించి ఎంత చర్చ జరిగిందో...అక్కడ కనిపించిన మ్యాప్ గురించీ అదే స్థాయిలో డిస్కషన్ జరుగుతోంది. "అఖండ భారత్"ని (Akhand Bharat Map) సూచించే మ్యాప్ అది. పేరులోనే ఉందిగా అఖండ భారతం అని. అంటే...ఒకప్పటి భారత భూభాగానికి సంబంధించిన మ్యాప్‌ని పార్లమెంట్‌లో ఏర్పాటు చేసింది మోదీ సర్కార్. అఫ్గనిస్థాన్, పాకిస్థాన్, శ్రీలంక, మాల్దీవ్స్, మయన్మార్, బంగ్లాదేశ్‌, భారత్...అన్నీ మ్యాప్‌లో కనిపించాయి. అంటే...ఇవన్నీ భారత్‌లో భాగమే అని తమ ఉద్దేశమేంటో చెప్పకనే చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఉత్తరాదిలో తక్షశిల,వాయువ్యంలోని పురుష్‌పూర్, ఈశాన్యం లోని కామ్‌రూప్‌ కూడా ఈ మ్యాప్‌లో కనిపించాయి. దీన్నే బీజేపీ "అఖండ భారత్" అని తేల్చి చెబుతోంది. అయితే...భారత దేశ చరిత్రకారుల దృష్టిలో ఇది కరెక్టే. ఎందుకంటే...అంతకు ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్, మాల్దీవ్స్, మయన్మార్, అఫ్గనిస్థాన్ అనే దేశాలు లేవు. గత వెయ్యేళ్లలో పుట్టుకొచ్చిన దేశాలివి. ఇక పాకిస్థాన్-బంగ్లాదేశ్‌ ఏర్పాటై ఇంకా వందేళ్లు కూడా కాలేదు. అందుకే...ఈ మ్యాప్‌లో ఉన్న ప్రాంతాలన్ని అఖండ భారతంలో భాగమే అని కొందరు గట్టిగా వాదిస్తున్నారు. ఇంత వరకూ బానే ఉన్నా...ఈ మ్యాప్‌పై పొరుగు దేశాలు మండి పడుతున్నాయి. నేపాల్, పాకిస్థాన్‌ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇంతకీ వాళ్ల వాదనలేంటి..? 


నేపాల్‌ ఏమంటోంది..? 


ముందు నేపాల్ విషయానికొద్దాం. మనతో దాదాపు 18 వందల కిలోమీటర్లకుపైగా సరిహద్దు పంచుకుంటోంది ఈ దేశం. సిక్కిం, పశ్చిమ బెంగాల్, బిహార్, యూపీ, ఉత్తరాఖండ్...ఈ 5 రాష్ట్రాలతోనూ నేపాల్‌ సరిహద్దు సమీపంలో ఉన్నవే. అయితే...నేపాల్ అఖండ భారతంలో భాగమే అన్న వాదనను నేపాల్ కొట్టి పారేస్తోంది. ఆ దేశ మాజీ ప్రధాని బాబూరాం భట్టరాయ్ కాస్త గట్టిగానే స్పందించారు. "ఈ మ్యాప్ ద్వారా భారత్‌ ఏం చెప్పాలనుకుంటోందో మాకు కచ్చితంగా తెలియాలి. ఆ క్లారిటీ మాకు ఇవ్వాలి" అని డిమాండ్ చేశారాయన. ఇదే సమయంలో మరో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి కూడా ఈ మ్యాప్‌ని చూసి అసహనానికి గురయ్యారు. 


"సనాతన ధర్మానికి, ప్రజాస్వామ్యానికి నెలవైన అతి పెద్ద దేశం భారత్. అలాంటి దేశం..నేపాల్‌లోని ప్రాంతాలను తమ మ్యాప్‌లో చూపించడం సరికాదు. పైగా ఆ మ్యాప్‌ని పార్లమెంట్‌లో ఉంచటం అంత కన్నా పెద్ద తప్పు. ఇది కచ్చితంగా ఖండించాల్సిన విషయం. మా ప్రధాని ప్రచండ దీనిపై భారత్‌తో మాట్లాడతారని ఆశిస్తున్నాను"


- కేపీ శర్మ ఓలి, నేపాల్ మాజీ ప్రధాని 


పాకిస్థాన్‌ అసహనం..


అటు పాకిస్థాన్ కూడా ఇదే స్థాయిలో మండి పడుతోంది. అఖండ భారత్ మ్యాప్‌పై ఎన్నో ప్రశ్నలు వేస్తోంది దాయాది దేశం. పాకిస్థాన్ విదేశాంగశాఖ ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ దీనిపై స్పందించారు. పాకిస్థాన్‌లోని కీలక ప్రాంతాలన్నింటినీ భారత్‌లో భాగమే అని తప్పుగా చూపిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇది భారత్ "విస్తరణ కాంక్షకు" నిదర్శనం అంటూ విమర్శించారు. 


"పార్లమెంట్‌లో పెట్టిన ఆ మ్యాప్‌పై మాకు ఎన్నో సందేహాలున్నాయి. భారత్‌ పొరుగు దేశాలన్నీ ఈ మ్యాప్‌ని చూసి ఆశ్చర్యపోతున్నాయి. ఇలాంటి విస్తరణా కాంక్ష ఉండటం మంచిది కాదు. సరిహద్దు వివాదాలుంటే...వాటిని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి కానీ...ఇలా అణిచివేసే విధంగా వ్యవహరించకూడదు"


- ముంతాజ్ జహ్రా బలోచ్, పాకిస్థాన్ విదేశాంగ ప్రతినిధి


1947 ఆగస్టు 14న భారత్‌, పాకిస్థాన్‌ వేరైపోయాయి. పాకిస్థాన్ ప్రత్యేక ముస్లిం దేశంగా ఏర్పాటైంది. అంతకు ముందు వరకూ పాకిస్థాన్‌ అంతా భారత్‌లో భాగంగానే ఉంది. పాకిస్థాన్‌లోని సింధు, తక్షశిల, పురుష్‌పూర్, ఉత్తర్‌పథ్‌ లాంటి ప్రాంతాలన్నింటినీ ప్రస్తుత అఖండ భారత్‌లో భాగంగా చూపిస్తోంది పార్లమెంట్‌లోని మ్యాప్. ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం ఈ వివాదంపై స్పందించలేదు. మరి పాక్‌, నేపాల్‌ వాదనలకు భారత్ ఎలా కౌంటర్ ఇస్తుందో చూడాలి. 


Also Read: ₹75 Coin: ప్రధాని లాంచ్‌ చేసిన ₹75 నాణేలను ఎలా కొనాలి?