EY Change the corporate work culture : అన్నా సెబాస్టియన్. 26 ఏళ్ల యంగ్ చార్టెడ్ అకౌంటెండ్. అందరిలాగే ఎంతో కష్టపడి ప్రతిభ చూపి సీఏ పాసైంది. ప్రపంచంలోనే ప్రముఖ కంపెనీ అయిన యర్నెస్ట్ అండ్ యంగ్.. EY కంపెనీలో జాబ్ తెచ్చుకుంది. కానీ పట్టుమని ఆరు నెలలు ఉద్యోగం చేయగానే ఆమె అనారోగ్యానికి పాలై మరణించింది. ఆమెకు వచ్చింది శారీరక అనారోగ్యం మాత్రమే కాదు.. మనసిక అనారోగ్యం కూడా. పని వాతావరణం.. అధిక పని.. ఒత్తిడి, టాక్సిక్ ఆఫీస్ ఎట్మాస్పియర్ ఇలా అన్నీ కలిసి ఆమె ప్రాణాలు తీశాయి ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉన్న ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత.. ఇంత ఘోరమైన పరిస్థితుల్లో కొత్త ఎంప్లాయిలు ఉంటున్నారా.. కార్పొరేట్‌లో కొత్తగా చేరే వారు ప్రాణాలు పణంగా పెట్టాల్సిందేనా అన్న చర్చ జరుగుతోంది.
ప్రతి కార్పొరేట్ ఉద్యోగి వాట్సాప్‌లో అన్నా సెబాస్టియన్ మృతిపై చర్చ
అన్నా సెబాస్టియన్ చనిపోయిన తర్వాత యర్నెస్ట్ అండ్ యంగ్ కంపెనీ కనీసం సంతాపం చెప్పలేదు. పట్టించుకోలేదు. ఆ తర్వాత వరుసగా అన్నా సెబాస్టియన్ ఉద్యోగం చేసిన ఆరేడు నెలల కాలంలో ఎదుర్కొన్న పరిస్థితుల్ని వివరిస్తూ ఆమె తల్లి రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొత్తగా ఉద్యోగంలో చేసిన అన్నాతో .. కనీసం వ్యక్తిగత అవసరాలు తీర్చుకునే సమయం ఇవ్వకుండా పని చేయించుకున్నారని.. ఒత్తిడిలోకి నెట్టి మానసిక ఆందోళనకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె లేఖతో పాటు.. ఆమె మరణించిన పరిస్థితులపై సోషల్ మీడియాలోనే కాదు.. కార్పొరేట్ ఆఫీసుల్లో పని చేసే ప్రతి ఉద్యోగి వాట్సాప్ గ్రూపుల్లో చర్చ జరుగుతోంది. తమ తమ ఆఫీసుల్లో పని వాతావరణంపై వారు చర్చించుకుంటున్నారు.
ఈ ఎన్నికల్లో ఓడిపోతే మళ్లీ పోటీ చేయనన్న ట్రంప్-ఎన్‌బీసీ పోల్స్‌లో దూసుకుపోతున్న కమలాహారిస్
కార్పొరేటర్ కల్చర్ మారాల్సి ఉందన్న అభిప్రాయం
కార్పొరేటర్ కల్చర్ గురించి బయటకు తెలిసింది తక్కువ. కార్పొరేటర్ కల్చర్ అంటే వీకెండ్ పార్టీలనుకుంటారు. కనీ.. కార్పొరేట్ వర్క్ కల్చర్ మాత్రం.. ఎంతో ఒత్తిడితో ఉంటుంది. ఎలాంటి కంపెనీ అయినా టార్గెట్లు.. అచీవ్ మెంట్లు.. మీటింగ్‌లతో హడావుడిగా ఉంటుంది. వీటి మధ్యలో పని చేయాలి. అన్నింటినీ బ్యాలెన్స్ చేయాలి. ఫలితాలు చూపించాలి. ఈ టార్చర్ అనుభవించే వారికి తెలుస్తుంది కానీ.. ఇతరులు అంత గొప్పగా చెప్పలేరు. పరిస్థితి ఎలా ఉంటుదంటే... మానసికంగా బలహీనులు అయితే ప్రాణాలు తీసుకునేంత.. లేకపోతే .. ఉద్యోగం వదిలి పారిపోవాలన్నంతగా ఉంటుంది. చాలా మంది ఆరోగ్యాలు కూడా పాడైపోతూంటాయి.
యర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ ఉద్యోగిని విషయంలో నిర్లక్ష్యంగా స్పందించిందన్నది నిజం. దీన్ని ఆ సంస్థ ఒప్పుకుంది. తమ వర్క్ కల్చర్ లో లోపాలు ఉంటే సరిదిద్దుకుంటామని.. కొత్తగా చేరే ఉద్యోగులకు తగినంత సహకారం అందించేలా టీమ్‌లలో మార్పులు చేస్తామని చెబుతోంది. మరో సంస్థ డెలాయిట్ కూడా.. దీన్నో పాఠంగా తీసుకుని.. తమ ఉద్యోగుల వర్క్ కల్చర్ లో మార్పులు చేస్తామని అంటోంది. కేంద్రం.. కూడా ఈ అంశంపై దృష్టి పెట్టింది. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై ఉద్యోగులకు ప్రత్యేక సెషన్లు నిర్వహించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అయితే కంపెనీల వర్క్ కల్చర్ లో మార్పులు రావాలని ఆమె చెప్పకపోవడంపై విమర్శలు వచ్చాయి.
అన్నా సెబాస్టియన్ మృతి తర్వాత కార్పొరేట్ లో కింది స్థాయి ఉద్యోగుల నుంచి పై స్థాయి యాజమాన్యం వరకూ జరుగుతున్న చర్చతో రాబోయే రోజుల్లో ఎంతో కొంత మార్పు ఉండటం ఖాయమన్న అభిప్రాయం .. కార్పొరేట్ సర్కిల్స్ లోనే గట్టిగా వినిపిస్తోంది.