ప్రపంచ దేశాలను కరోనా ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న వేళ అబుదాబి కీలక నిర్ణయం తీసుకుంది. యునైటెట్ అరబ్ ఎమిరేట్స్‌లో అడుగుపెట్టాలనుకునే వారికి కొత్త నిబంధన తీసుకువచ్చింది. ఇక నుంచి అబుదాబి వచ్చే వారు కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకున్న సర్టిఫికెట్ చూపించాలని పేర్కొంది. 


ఒమిక్రాన్ ధాటికి యూఏఈలో కేసులు సంఖ్య అమాంతం పెరిగింది. దీంతో ఈ నిర్ణయం తీసుకుంది అక్కడ సర్కార్. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది.


మార్గదర్శకాలు..



  • యూఏఈలోకి అడుగుపెట్టాలంటే బూస్టర్ డోసు తీసుకున్నదానికి ధ్రువీకరణ పత్రం చూపించాలి. 

  • రెండు వారాల లోపు చేయించుకున్న పరీక్షలో వచ్చిన నెగెటివ్ సర్టిఫికెట్ కూడా చూపించాల్సిందే. 

  • బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే వారు గ్రీన్ పాస్ చూపించాలి. 


వ్యాక్సినేషన్ పూర్తయిందనే దానికి గుర్తుగా ఇటీవల యూఏఈ ప్రభుత్వం పౌరులకు గ్రీన్ పాస్ ఇచ్చింది. నగరంలో తిరిగే వారు విధిగా గ్రీన్ పాస్ తమ వద్ద ఉంచుకోవాల్సిందే. అయితే తాజాగా బూస్టర్ డోస్ కూడా తీసుకుంటేనే గ్రీన్ స్టేటస్ యాక్టివ్ అయ్యేలా ప్రభుత్వ ఆరోగ్య యాప్‌లో అప్‌డేట్ చేశారు. పక్కనే ఉన్న దుబాయ్‌తో పోలిస్తే యూఏఈలో కరోనా ఆంక్షలు కఠినతరం చేశారు.


డ్రోన్ దాడి..


యూఏఈ రాజధాని అబుదాబిలో సోమవారం డ్రోన్ దాడులు కలకలం సృష్టించాయి. అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో ముగ్గురు మరణించారు. మృతుల్లో ఇద్దరు భారతీయులు ఉన్నట్లు సమాచారం. యెమన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటు సంస్థ డ్రోన్‌ దాడులు చేసినట్లు ఒప్పుకుంది.


ప్రధాన విమానాశ్రయంలో ముందుగా పేలుడు జరిగినట్లు అధికారులు తెలిపారు. తర్వాత  మరో చోట మూడు చమురు ట్యాంకులు పేలినట్లు వెల్లడించారు. ఇందుకు డ్రోన్‌ దాడులే కారణమని అనుమానం వ్యక్తం చేశారు. ఈ దాడిలో ముగ్గురు మృతి చెందగా ఆరుగురికి గాయాలయ్యాయి.


విమానాశ్రయం విస్తరణలో భాగంగా నిర్మాణంలో ఉన్న ప్రాంతంలో డ్రోన్ దాడి జరిగినట్లు వెల్లడించారు. ఇండస్ట్రీ మస్తఫా ప్రాంతంలో అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీకి చెందిన మూడు పెట్రోలియం ట్యాంకర్లపైనా దాడులు జరిగినట్లు పేర్కొన్నారు. ఎగిరే చిన్న వస్తువులు పడిన తర్వాత చమురు ట్యాంకులు పేలినట్లు పోలీసులు వివరించారు. 


Also Read: Covid Cases: దేశంలో కొత్తగా 2 లక్షల 38 వేల కరోనా కేసులు.. దిల్లీ, ముంబయిలో తగ్గిన ఉద్ధృతి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి