ABP Southern Rising Summit: ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మొదటి సారి అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా సాధించనంత మెరుగైన ఫలితాల్ని సాధించి అధికారం చేపట్టింది. కేసీఆర్, బీఆర్ఎస్ పై పోరాటమే సింగిల్ ఏజెండాగా రాజకీయ శక్తుల పునరేకీకరణ చేసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన అనతి కాలంలోనే బలమైన ముద్ర వేశారు. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా వెనక్కి తగ్గలేదు. కాంగ్రెస్ గెలుపు అసాధ్యమనుకున్న సమయంలోనూ ఆయన నిబ్బరం కోల్పోలేదు. ఎదురొడ్డారు. పోరాడారు. పార్టీని గెలిపించారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్నరు.
సాధారణంగా సుదీర్ఘ కాలంగా పోరాడి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత యువనేతలు రిలాక్స్ అయిపోయారు. కానీ రేవంత్ రెడ్డి అలా కాదు. ప్రజలు తనకు ఇచ్చిన అవకాశాన్ని తనదైన ముద్ర వేసే పరిపాలన చేయడం కోసం వినియోగిస్తున్నారు. దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యకు పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తున్నారు. మురికి కాలువగా మారిపోయిన మూసీ నదిని జీవనదిగా మార్చే ప్రయత్నంలో ఉన్నారు. అధికారం అండంతో చెరువుల్ని ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసిన వారికి చుక్కలు చూపిస్తున్నారు. వేల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తుల్ని వెనక్కి తెస్తున్నారు.
రాజకీయాలే చేయాలనుకుంటే సేఫ్ గేమ్ ఆడి ఉండేవారు.కానీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి విప్లవాత్మక ఆలోచనలు చేస్తున్నారు. గత సీఎంలు చేయడానికి సాహసించని పనులు చేస్తున్నారు. మంత్రిగా కూడా చేయకుండానే ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినప్పటికీ ఆ తడబాటు ఆయనలో లేదు. తెలంగాణ అభివృద్ధికి, ప్రజల సంక్షేమం కోసం ఆయన డైనమిక్‌గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. రెండు లక్షల వరకూ రుణమాఫీని అమలు చేసి రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేశారు.
కఠినమైన దారిలో వెళ్తూ భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్న ఏ నాయకుడికైనా రహదారి ఎప్పటికీ పూలబాట కాదు. రాళ్లు రప్పలు లాంటి ఎదురుదెబ్బలు ఎన్నో తగులుతాయి. రేవంత్ రెడ్డి కూడా అదే బాటను ఎంచుకున్నారు. వెరవకుండా ముందుకు పరుగెడుతున్నారు. ఆయన నాయకత్వంలో నవ తెలంగాణ ఆవిష్కృతమవుతుందని ప్రజలు కూడా ఆశిస్తున్నారు. వారి ఆశల్ని నిజం చేయాలని రేవంత్ కూడా పట్టుదలగా ఉన్నారు.
రేవంత్ తన ఆలోచనల్ని .. దేశంలో తెలంగాణను ఎలా ప్రత్యేకంగా నిలిపే ప్రయత్నం చేస్తున్నారో ప్రజలకు వివరించేందుకు ఏబీపీ నెట్ వర్క్ నిర్వహిస్తున్న "ది సదరన్ రైజింగ్ సమ్మింట్"కు విశిష్ట అతిథిగా వస్తున్నారు. అక్టోబర్ 25వ తేదీన ఉ.10 గంటల నుంచి ఏబీపీ నెట్ వర్క్ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌ల మీద "ది సదరన్ రైజింగ్ సమ్మింట్"ను వీక్షించవచ్చు.