C-Voter Survey On Modi Vs Kejriwal: 2024 లోక్‌సభ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉన్నప్పటికీ భాజపా సహా ప్రతిపక్షాలన్నీ వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. మరి 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీకి అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసరగలరా? లేక మోదీకి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమారే సరైన ప్రత్యర్థా?

ప్రస్తుతం ఈ ప్రశ్నే అందరి మదిలో మెదులుతోంది. అయితే ఈ అంశంపై ఓ క్లారిటీ ఇచ్చేందుకు C-ఓటర్.. ABP న్యూస్ కోసం ఒక క్విక్ సర్వే నిర్వహించింది. దీనిలో ప్రజలు ఈ ప్రశ్నకు చాలా ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చారు.

2024లో ప్రధాని మోదీకి అతిపెద్ద సవాల్‌ ఎవరు? కేజ్రీవాల్ లేదా నితీశ్? అని ప్రజల్ని ప్రశ్నించింది C-ఓటర్

  • కేజ్రీవాల్‌.. ప్రధాని మోదీకి సవాల్‌గా నిలుస్తారని 65 శాతం మంది అభిప్రాయపడ్డారు.
  • ప్రధాని మోదీకి నితీశ్‌ కుమార్ సరైన ప్రత్యర్థి అని 35 శాతం మంది తెలిపారు. 

కేజ్రీవాల్ నయా జోష్

దిల్లీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన అరవింద్ కేజ్రీవాల్ నేడు ప్రాంతీయ రాజకీయాలను వదిలి జాతీయ స్థాయిలో తమ పార్టీ విశ్వసనీయతను పెంచుకునే పనిలో బిజీగా ఉన్నారు. కేజ్రీవాల్ రెండోసారి దిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న తర్వాత హరియాణా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్ సహా పలు రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.

అందుకు తగ్గట్లుగానే అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ దిల్లీ తర్వాత పంజాబ్‌లో విజయం సాధించింది. పంజాబ్ విజయంతో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ ఫుల్‌ జోష్‌లో ఉంది.

ఈ ఏడాది చివర్లో జరగనున్న హిమాచల్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలను ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా తీసుకున్నారు. అందుకే గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌లో వరుస పర్యటనలు చేస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ భాజపా ప్రభుత్వం ఉంది. తన వ్యూహాన్ని మార్చుకుంటూనే, అరవింద్ కేజ్రీవాల్.. భాజపాకు కంచుకోటగా చెప్పుకునే గుజరాత్‌లో పాగా వేయాలని సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇందుకోసం గుజరాత్‌లో కేజ్రీవాల్ వరుస ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

భారీ వాగ్దానాలు

దిల్లీ, పంజాబ్ లాగే గుజరాత్‌కు కూడా కేజ్రీవాల్ ఎన్నో హామీలు ప్రకటించారు.

  1. 2 లక్షల వరకు వ్యవసాయ రుణమాఫీ,
  2. రైతులకు పగటిపూట విద్యుత్ సరఫరా,
  3. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్,
  4. 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు

ఇలా అనేక హామీలను కేజ్రీవాల్.. గుజరాత్ ప్రజలకు ఇచ్చారు. సెప్టెంబరు 12, 13 తేదీల్లో ఆయన మరోసారి గుజరాత్‌లో రెండు రోజుల పర్యటనలో ఉంటారు. 182 మంది సభ్యుల గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు 29 మంది అభ్యర్థులతో కూడిన మూడు జాబితాలను ఆయన పార్టీ ఇప్పటికే విడుదల చేసింది.

నితీశ్ తక్కువేం కాదు!

గత నెలలో భాజపాతో తెగతెంపులు చేసుకున్న నితీశ్ కుమార్ మళ్లీ లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్‌జేడీతో చేరి బిహార్ ముఖ్యమంత్రి అయ్యారు. బిహార్ తర్వాత నితీశ్ కుమార్ ఇప్పుడు భాజపాను కేంద్రం నుంచి గద్దె దించాలని చూస్తున్నారు. ఇందుకోసం ఆయన సన్నాహాలు కూడా మొదలుపెట్టారు.

తాజాగా నితీశ్ దిల్లీలో పర్యటించి మొత్తం విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కసరత్తు ప్రారంభించారు. "మేం ఏర్పాటు చేసేది థర్డ్ ఫ్రంట్ కాదు మెయిన్ ఫ్రంట్" అంటూ నితీశ్ చెబుతున్నారు. ప్రధాని పదవి రేసులో ప్రతిపక్షాల నుంచి నితీశ్ పేరే ఎక్కువగా వినిపిస్తున్నప్పటికీ ఆ వార్తలను ఆయన తోసిపుచ్చారు. అయితే జేడీయూ, దాని మిత్రపక్షాలు మాత్రం నితీశ్‌ను ప్రధాని పదవి రేసులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.

Also Read: Sonali Phogat Murder Case: CBI చేతికి సోనాలీ ఫోగాట్ హత్య కేసు- గోవా సీఎం కీలక నిర్ణయం

Also Read: Gyanvapi Masjid Verdict: జ్ఞానవాపి మసీదు కేసులో కోర్టు సంచలన తీర్పు